-హైర్ అండ్ ఫైర్ మరింత సరళీకరణ -యూనియన్ల ఏర్పాటు మరింత కఠినం -పీటీఐ వార్తా సంస్థతో కేంద్రమంత్రి దత్తాత్రేయ న్యూఢిల్లీ, జూన్ 25...
-హైర్ అండ్ ఫైర్ మరింత సరళీకరణ
-యూనియన్ల ఏర్పాటు మరింత కఠినం
-పీటీఐ వార్తా సంస్థతో కేంద్రమంత్రి దత్తాత్రేయ
న్యూఢిల్లీ, జూన్ 25: కార్మిక చట్టాలను సమూలంగా మార్చేందుకు కేంద్రం ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ మార్పులు ఇటు కార్మికులకు, అటు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉంటాయని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు. హైర్ అండ్ ఫైర్ నిబంధనలు సరళీకరిస్తామని, కార్మికులు యూనియన్లను ఏర్పాటు చేసుకునే విధానాన్ని కఠినంగా మారుస్తామని, ఉద్యోగంలోంచి తొలగించినప్పుడు ఇచ్చే పరిహారాన్ని మూడు రెట్లు పెంచుతామని చెప్పారు.
దేశంలో వ్యాపారాలను మరింత సులభంగా చేసుకొనేందుకు వీలు కల్పించడం, మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించే ప్రణాళికలో భాగంగా కార్మిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక ముసాయిదా బిల్లును తయారు చేసింది. కార్మిక సంఘాల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, పారిశ్రామిక ఉపాధి (స్టాండింగ్ ఆర్డర్స్) చట్టాలను మిళితం చేసి పారిశ్రామిక సంబంధాల కోసం ఒకేకోడ్గా మార్చనున్నామని తెలిపారు. పారిశ్రామిక విస్తరణకు అనుకూల వాతావరణం కల్పించాలంటే కార్మిక సంస్కరణలు తక్షణ అవసరమని మంత్రి పేర్కొన్నారు. కార్మిక చట్టాలను నూతన దృక్పథంతో చూడాల్సి ఉందని చెప్పారు. అయితే కార్మికుల ప్రయోజనాలను మాత్రం పణంగా పెట్టబోమని దత్తాత్రేయ స్పష్టం చేశారు.
ప్రస్తుతం, 100 మంది కార్మికులున్న కంపెనీలు ఎటువంటి అనుమతి లేకుండానే లేఆఫ్ ప్రకటించవచ్చు. ఇప్పుడు 300 మంది కార్మికులు పనిచేస్తున్న కంపెనీలు కూడా అధికారిక అనుమతి లేకుండా లేఆఫ్ ప్రకటించేందుకు అనుమతినిచ్చే నిబంధనను ముసాయిదా బిల్లులో చేర్చామని మంత్రి చెప్పారు. అయితే కార్మికుల ప్రయోజనాలు కాపాడేందుకు గాను, సంస్థలు ఓ ఉద్యోగిని తొలగించాలనుకున్నా లేక కంపెనీని మూసివేయాలనుకున్నా నెల ముందు కాకుండా మూడు నెలల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. ఇక ఉద్వాసనకు గురైన కార్మికులకు ఇచ్చే సగటు వేతనాన్ని 15 రోజుల నుంచి 45 రోజులకు పెంచనున్నామని తెలిపారు. నూతన చట్టం కార్మికులందరినీ కనీస వేతనానికి అర్హులను చేస్తుందని చెప్పారు.
సంఘటిత రంగంలో కార్మికులు మాత్రమే యూనియన్లు ఏర్పాటు చేసుకోవాలని, బయటి వ్యక్తుల ప్రమేయం ఉండరాదన్నారు. ఆరువారాల ముందు నోటీసు ఇచ్చి సమ్మెకు దిగాలన్నారు. కార్మిక సంస్కరణలపై చర్చించేందుకు యూనియన్లను కూడా విశ్వాసంలోకి తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో ప్రధానమంత్రి ఒక కమిటీని ఏర్పాటుచేశారని దత్తాత్రేయ చెప్పారు. ఈ బిల్లును వచ్చే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం లేదని తెలిపారు.