నిజామాబాద్ : జిల్లాలో ఎస్ఐల బదిలీ తరచూ వివాదాస్పదమవుతుంది.. పోలీసు ఉన్నతాధికారులను కాదని, ప్రజాప్రతినిధుల పెత్తనమే అనవాయితీగా కొనసాగుతూ...
తాజాగా శనివారం వెలువడిన ఎస్ఐల బదిలీ ఉత్తర్వులు చర్చనీయాంశంగా మారాయి.. అవినీతికి మారుపేరుగా నిలిచిన వారికి పోలీసు ఉన్నతాధికారులు పనిష్మెంట్గా బదిలీ చేసి తీసుకొస్తే.. తిరిగి యధాస్థానంలో పోస్టింగ్ తెచ్చుకున్నారంటే ఎంత భారీ స్థాయిలో పైరవీలు జరిగాయో ఇట్టే అర్థం అవుతుంది. జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న 12 మంది ఎస్సైలకు ఒకేసారి స్థానచలనం జరిగింది. వారిని ఆకస్మికంగా బదిలీ చేస్తూ ఐజీ వై.గంగాధర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే నియోజకవర్గ ప్రతినిధులు తమకు అనుకూలమైన వారిని ప్రత్యేకంగా పోస్టింగులు ఇప్పించుకున్నట్లు సమాచారం. తమ అడుగులకు మడుగులు ఎత్తే ఎస్సైల కోసం సదరు ప్రజాప్రతినిధులు రాష్ట్రస్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చి బదిలీ చేయించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇలా ప్రజాప్రతినిధులు పోలిస్స్టేషన్లపై పూర్తి పెత్తనం చెలాయించాలని చూస్తున్నట్లు స్పష్టం అవుతుంది. బోధన్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన కే.గంగాధర్‌రావు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో మే 4న నిజామాబాద్ వీఆర్‌కు బదిలీ చేశారు. అయితే ఇతన్ని తిరిగి బోధన్ పోలిస్‌స్టేషన్‌కు బదిలీ చేయటం చర్చనీయాంశంగా మారింది. జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కాదని, ప్రజాప్రతినిధులకు చెంచాగిరి చేసి, తమకు అనుకూలమైన స్టేషన్లో పోస్టు సాధించామని కొందరు సంబర పడిపోతుంటే.. ముక్కు సూటిగా వెళ్లినందుకు పక్కన పెట్టారని మరి కొందరు మదన పడుతున్నట్లు తెలిసింది.