-విడుదల చేసిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి -ప్రభుత్వ కాలేజీలలో మెరుగైన ఫలితాలు హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వా...
-విడుదల చేసిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
-ప్రభుత్వ కాలేజీలలో మెరుగైన ఫలితాలు
హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మే/జూన్‌లో నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శుక్రవారం విడుదల చేశారు. ఫస్టియర్ ఫలితాల్లో 66.25శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, సెకండియర్ ఫలితాల్లో 42.77శాతం ఉత్తీర్ణత నమోదైంది. మార్చి, మే పరీక్షల్లో కలిపి ఫస్టియర్‌లో 67.11శాతం, సెకండియర్‌లో 79.61శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా రాష్ట్రంలో ప్రైవేటు జూనియర్ కాలేజీలలో ఫలితాలు బాగా తగ్గగా, ప్రభుత్వ కాలేజీలలో ఫలితాలు మెరుగుపడ్డాయి.
ప్రైవేటు కాలేజీలలో సెకండియర్ ఫలితాలలో 42 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ప్రభుత్వ కాలేజీలలో 45 శాతం ఉత్తీర్ణత నమోదైంది. దీనిని బట్టి ప్రైవేటు కాలేజీల కంటే ప్రభుత్వ కాలేజీలలో ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. కాగా ఫస్టియర్, సెకండియర్ పరీక్ష ఫలితాలు రెండింట్లోనూ బాలికలే పైచేయి సాధించారు. ఇక ఒకేషనల్ కోర్సులో ఫస్టియర్‌లో 51.17 శాతం సెకండియర్ ఫలితాలలో 49.15 శాతం ఉత్తీర్ణత నమోదయ్యాయి. ఫలితాల విడుదల కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్, ప్రభుత్వ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు పీ మధుసూదన్‌రెడ్డి, ఇంటర్ బోర్డు అధికారులు పాల్గొన్నారు.
రీకౌంటింగ్‌కు జూలై 4 వరకు గడువు..: ఇంటర్ పరీక్ష ఫలితాలపై సందేహాలున్న విద్యార్థులు రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్/ జవాబు పత్రాల జిరాక్స్ కాపీల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు జూలై 4 చివరి తేదీగా నిర్ణయించారు. రీ కౌంటింగ్ కోసం ప్రతి పేపర్‌కు రూ.100, జవాబు పత్రాల జిరాక్స్‌ల కోసం ప్రతి పేపర్‌కు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంసెట్‌కు ఉచిత శిక్షణ..: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ఎంసెట్ కోచింగ్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.
ఉచితవిద్యకు అనూహ్య స్పందన..: ఇంటర్ బోర్డు ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితవిద్య, ఉచితంగా పాఠ్యపుస్తకాలు పం పిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుహ్య స్పందన వస్తున్నద ని, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారని డిప్యూటీ సీఎం కడియం తెలిపారు. రాజకీయ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, అధ్యాపక సంఘాలు, కాంట్రాక్టు అధ్యాపకులు, ఇలా.. అన్ని వర్గాల ప్రజల నుంచి ఉచిత ఇంటర్ విద్యకు మంచి స్పందన వస్తుందన్నారు. ఇదే ఉత్సాహంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఈ ఏడాది ఎన్రోల్మెంట్లో కూడా పురోగతి ఉండే అవకాశాలున్నాయని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో కొత్త భవనాలు, అదనపు తరగతి గదులు, వసతి సదుపాయాలు కల్పించడానికి చర్యలు చేపట్టామన్నారు.