రాష్ట్రంలో పప్పులు, కూరగాయల ధరలు రోజు రోజుకు మరింతగా పెరుగుతూ చుక్కలను తాకుతున్నాయి… జేబులన్నీ ఖాళీ అయినాకుటుంబ అవసరాలకు సరిపడ కూరగాయలు, ...
రాష్ట్రంలో పప్పులు, కూరగాయల ధరలు రోజు రోజుకు మరింతగా పెరుగుతూ చుక్కలను తాకుతున్నాయి… జేబులన్నీ ఖాళీ అయినాకుటుంబ అవసరాలకు సరిపడ కూరగాయలు, పప్పులు కొనలేని పరిస్థితి నెలకొంది. పప్పుల ధరలు ఇప్పటికే కిలో రూ.120 దాటి పోగా కూరగాయల ధరలు గత ఏడాది ఆరంభంతో పోలిస్తే నేటికి మూడింతలయ్యాయి. ఇటీవల వేసవిలో కురిసిన భారీ వర్షాలు, వడగండ్ల వానకు టమాట, వంకాయ, బీరకాయ, సోరకాయ, చిక్కుడు కాయలు వేలాది హెక్టార్లలో పూర్తిగా దెబ్బతినడం ఒక ఎత్తు అయితే, ఒక వైపు సాగు విస్తీర్ణం పడిపోవడం మరో ఎత్తైంది. దీంతో కూరగాయల రేట్లు ఒక్కసారిగా మూడు రెట్లు పెరిగాయి. ఇతర రాష్ట్రాల నుండి సరఫరా తగ్గిపోవడం, వ్యాపారులు విచ్చల విడిగా నిల్వలు చేసుకొని కృత్రిమ కొరతను సృష్టించడం కూడా ఈ ధరల పెరుగుదలకు పరోక్షంగా కారణాలవుతున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనా లపై తెలంగాణ ప్రవేశ పన్ను విధిస్తుండడం వలన కూరగాయల ధరల కొంత మేర పెరడగానికి మరో కారణం. ఇంకోవైపు గత సంవత్సరం(2014)లో ఆంధ్రప్రదేశ్‌లో భారీగా వచ్చిన తుఫాన్ల ప్రభావం వల్ల సాగుచేసిన పప్పు దినుసులు పూర్తిగా దెబ్బతినడంతోవాటిప్రభావం కూడా కొంత తెలంగాణ రాష్ట్రంపై పడింది.
తగ్గిన దిగుబడులు
గత రబీలో మార్చి, ఏఫ్రిల్ మాసాలలో కురిసిన అకాల భారీ వర్షాలు, వడగండ్ల వానల కారణంగా కూరగాయలు, పప్పుధాన్యాల సాగు గణనీయంగా తగ్గింది. భూగర్భ జలాలు ఎన్నడు లేని రీతిలో అడుగంటడంతో బోర్ల క్రింద సాగు చేసి రైతులు ఆశించిన స్థాయిలో దిగుబడులు తీయలేకపోయారు. దీంతో సాగు చతికిలా పడింది. 2013-2014 జూన్ వరకు 6.25 లక్షల ఎకరాల్లో కూరగాయలు సాగు చేయగా ఈ సంవత్సరం 4 లక్షల 80 వేల ఎకరాలకు సాగు పడి పోయింది. పప్పు ధాన్యాల సైతం సాగు కూడా 11 లక్షల 67 వేల ఎకరాల నుంచి ఈ సంవత్సరం 7 లక్షల 72 వేల వరకు తగ్గిపోయింది.ఈ ఏడాది పక్క రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలోనే 32 శాతం ఉత్పత్తి అవుతుండగా ఆంధ్రప్రదేశ్ నుంచి 26 శాతం కర్ణాటక, మహారాష్ట్ర నుంచి 42 శాతం దిగుమతి అవుతుంది. అయితే ప్రస్తుతం ఆయా రాష్ట్రాల నుంచి వర్షాభావ నేపథ్యంలో దిగుమతులు ౩౦ శాతం వరకు తగ్గాయి. దీంతో కర్నూల్, అనంతపురం, మదనాపల్లి నుంచిరావాల్సిన టమాట, ప్రకాశం, గుంటూరు, అనంతపురంల నుండి రావాల్సిన వంకాయ, బెంగుళూరు, చిక్ బల్లాపూర్ల నుంచి రావాల్సిన బెండకాయ, చిక్కుడు, గోరు చిక్కుడు తదితరల దిగుమతులు తగ్గిపోయాయి. గత రెండు మూడు నెలలతో పోలిస్తే అన్ని రకాల కూరగాయల దిగుమతులు 20 శాతం మేరకు తగ్గాయి. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణమవుతుంది. దీంతో కూరగాయలు, పప్పు ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. మార్కెట్లో ప్రస్తుత డిమాండ్‌కు సరఫరాకు మధ్య భారీగా తేడా ఏర్పడడంతో ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాట రూ.32లు, వంకాయ 28, బీరకాయ, బెండకాయ, క్యాబ్స్కం క్యారెట్ తదితరులు రూ.4౦/-కి పైగా ఉన్నాయి. మిగతా కూరగాయల ధరలు ౩౦ నుంచి 40 మధ్య ఉంటున్నాయి.
ఉడకని పప్పులు
ఇక రాష్ట్రంలో పప్పుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. పెసర పప్పు, కందిపప్పు కిలో 130 కి చేరుకోగా మినపప్పు 120కి పైగా ఉంది. చివరకు శనగ పప్పు ధర కూడా రూ.70/-లకు చేరింది. ఈ ధరలన్ని కూడా గత ఏడాదితో పోలిస్తే ౩౦ నుంచి 50 శాతం వరకు ఎక్కువ కావడం ఆందోళనకరం. పప్పు ధాన్యాల సాగు తగ్గిన నేపథ్యంలో భవిష్యత్తు డిమాండ్‌ను ముందుగానే ఊహించిన వ్యాపారులు భారీగా పప్పులను నిల్వ
చేయడం మార్కెట్లో కొద్ది కొద్దిగా విడుదల చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ధరలను కూడా ఇష్టరీతిన నిర్ణయిస్తుండడంతో తమకు ధరాఘాతం తప్పడం లేదని సామాన్యులు వాపోతున్నారు.
ఎన్ఎఫ్ఎస్సి ఎక్కడ
నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ కింద ప్రతి సంవత్సరం పప్పు ధాన్యాల సాగుకు ప్రతి గ్రామంలో అంతో ఇంతో సాగుకు ప్రోత్సహిస్తూ పప్పు ధాన్యాల దిగుబడిని పెంచి ధరలను అదుపులో ఉంచాల్సిన ఎన్.ఎఫ్.ఎస్.సి.కి గత సంవత్సరం ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదు.