-ప్రీ-2005 నోట్లు మార్చుకునేందుకు జూన్ 30తో ముగియనున్న గడువు న్యూఢిల్లీ, జూన్ 21: పాత కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు ఇంకా పది రో...
-ప్రీ-2005 నోట్లు మార్చుకునేందుకు జూన్ 30తో ముగియనున్న గడువు
న్యూఢిల్లీ, జూన్ 21: పాత కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు ఇంకా పది రోజులే గడువుంది. 2005కు ముందు ముద్రించిన నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ గతంలో ప్రకటించింది. ఈ నోట్లను బ్యాంకుల్లో ఇచ్చి అంతే విలువ చేసే కొత్త నోట్లను పొందేందుకు గతేడాది చివరి వరకున్న గడువును మరో ఆరు నెలలు (జూన్ 30 వరకు) పొడిగించింది. ఈనెలాఖరుతో సమయం ముగియనుండటంతో 2005కు ముందు నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకునేందుకు సహకరించాలని ఆర్బీఐ కోరుతున్నది. ఇప్పటివరకు నోట్లను మార్చుకోని వారెవరైనా ఉంటే దగ్గర్లోని బ్యాంక్ బ్రాంచీల నుంచి కొత్త నోట్లను పొందాలని అంటున్నది.
ఎందుకంటే ప్రస్తుత గడువు ప్రకారం జూలై 1 నుంచి 2005కు ముందు నోట్లు మార్కెట్లో చెల్లుబాటు కావు. ఈ నోట్లను గుర్తించడం చాలా సులువు. 2005కు తర్వాత ప్రింట్ చేసిన కరెన్సీకి వెనుకవైపు కింది భాగంలో ముద్రించిన ఏడాది వివరాలు ఉంటాయి. అదే 2005కు ముందు నోట్లలో ఈ వివరాలుండవు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, నకిలీ నోట్లను ఏరివేసే ప్రయత్నాల్లో భాగంగానే ఈ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ తెలిపింది. 2005కు తర్వాత ముద్రించిన కరెన్సీతో పోలిస్తే పాత నోట్లలో భద్రత ఫీచర్లు తక్కువని పేర్కొంది. జనవరి చివరినాటికి ముగిసిన 13 నెలల కాలంలో ఆర్బీఐ.. రూ.21,750 కోట్ల విలువ చేసే 164 కోట్ల నోట్లను ఉపసంహరించుకోగలిగింది. ఇందులో రూ.500, రూ.1000 నోట్లు కూడా ఉన్నాయి.