(3 Jul) ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన హారితహారంతోపాటు కీలకమైన పుష్కరాల అంశాలపైనే గురువారం జరిగిన జడ్పీ సర్వసభ్యసమావేశంలో వాడీవ...
(3 Jul) ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన హారితహారంతోపాటు కీలకమైన పుష్కరాల అంశాలపైనే గురువారం జరిగిన జడ్పీ సర్వసభ్యసమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగింది. వ్యవసాయం, వైద్యం అంశాలు ప్రస్తావనకు వచ్చినా పదిహేను నిమిషాల్లోనే మమ అనిపించారు. కేంద్రప్రభుత్వం తీసేసిన బీఆర్జీఎఫ్ పథకం కొనసాగించాలని, ఆర్థిక సంఘం నిధులు జిల్లాపరిషత్, మండల పరిషత్‌లకూ విడుదల చేయాలని సమావేశంలో తీర్మానం చేశారు. మూడునెలలకోమారు జరిగే ఈసమావేశంలో ఎన్నో అంశాలు ప్రస్తావనకు వచ్చి సమస్యల పరిష్కారానికి మార్గం దొరుతుందని ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నా హారితహారం కార్యక్రమం ప్రారంభం దృష్ట్యా అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాటు ్లచేసుకునేందేకు మూడుగంటల్లోనే సమావేశం ముగించాల్సి వచ్చింది. జిల్లాలో జరగనున్న పుష్కరాల పనులపై మొదట చర్చ జరిగింది. పనులు ఆలస్యంపై కొందరు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవదాయశాఖ మంత్రినైన తననియోజకవర్గంలో సైతం పనుల్లో జాప్యం జరగడంపై మంత్రి అసహనానికి లోనయ్యారు. నిర్మల్ వద్ద ఘాట్ల పనులు పూర్తికాకపోవడంతో ఈ పనులు పర్యవేక్షిస్తున్న నీటిపారుదలశాఖ ఎస్ఈ భగవంత్రావ్పై ఆయన మండిపడ్డారు. 'మంత్రినైన నేను నిర్మల్‌లోనే ఉంటాను, జడ్పీ అధ్యక్షురాలు అక్కడే ఉంటారు, మీ కార్యాలయం కూడా అక్కడే ఉంది మరి నిర్మల్‌కు ఎనిమిదికిలోమీటర్ల దూరంలోనే పనులు పూర్తికాకపోతే ఎలా' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ సైతం ఎస్ఈపై విమర్శనస్త్రాలు సంధించడంతో సమావేశం వేడెక్కింది. మా నియోజకవర్గంలోంచి నిధులు వేరేచోటికి మా అనుమతిలేకుండా ఎలా మరలిస్తారని మండిపడ్డారు. పనుల సంగతేమిటంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఘాట్ల పనుల వేగం పెంచకపోతే ప్రజాప్రతినిధుల మీదకు వస్తుందని పలువురు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనికి స్పందనగా పనుల్లో జాప్యం జరిగితే సహించేదిలేదని మంత్రి ఐకేరెడ్డి అధికారులు హెచ్చరించారు. పుష్కన స్నానాలకు బాసర పుణ్యక్షేత్రంలో నీటికొరత మూలాన ప్రత్యామ్నాయంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడి ప్రాజెక్టులనుంచి నీళ్లు వచ్చేలా చూడాలని ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కోరడంతో వరుణ దేవుడు కరుణిస్తాడని ఎవరూ అధైర్యపడవద్దని మంత్రి ఐకే నవ్వుతు సమాధానమిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన హారితహారంలో ప్రతిఒక్కరు భాగస్వామ్యులు కావాలని సమావేశం పిలుపునిచ్చింది. పలుచోట్ల నర్సరీల్లో మొక్కలు ఎండిపోయాయని ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు ఏం చేస్తారని, ఇలాగైతే లక్ష్యం ఎలా నెరవేరుతుందని ప్రశ్నించడంతో ఇతర నర్సరీలనుంచి మొక్కలు తెచ్చి ఇస్తామని అధికారులు భరోసా కల్పించారు. ఉపాధిహామీ కూలీ డబ్బుల చెల్లింపులో ఆలస్యమవుతోందని దీనివల్ల హరితహారంలో గుంతలు తవ్వడం, ఇతర పనులకు కూలీలకు ముందుకు రావడం లేదని పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు వివరించారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఐకే పాలనాధికారిని ఆదేశించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి(బీఆర్జీఎఫ్) పథకాన్ని కేంద్రం ఎత్తివేయడంతో ఏటా రూ.30కోట్లవరకు జిల్లా నష్టపోతుందని తెలంగాణలో పరిస్థితుల దృష్ట్యా ఈ పథకాన్ని కొనసాగించాలని సమావేశంలో తీర్మానించారు. మూడంచెల వ్యవస్థగల స్థానిక సంస్థల్లో ఆర్థిక సంఘం నిధులు కేవలం గ్రామపంచాయతీలకే ఇస్తే ఇబ్బందులు తలెత్తుతాయని మండల పరిషత్, జిల్లాపరిషత్లకూ ఈ నిధుల కేటాయింపు ఇంతకుముందులాగే కొనసాగించాలని, పుష్కరాల్లో అత్యవసర పనులకు జడ్పీ నుంచి నిధులు కేటాయించాలని సమావేశంలో తీర్మానాలు చేశారు. జడ్పీ అధ్యక్షురాలు శోభారాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పలువురు ప్రజాప్రతినిధులు గైర్హాజరయ్యారు. హరితహారం పథకంపై హైదరాబాద్‌లో సమీక్ష ఉండడంతో అటవీశాఖమంత్రి రాకపోగా, ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తుండడంతో ఎంపీ గోడంనగేష్ గైర్హాజరయ్యారు. వీరితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి రాలేదు. ఎమ్మెల్యేల్లో విఠల్‌రెడ్డి, దుర్గం చిన్నయ్య, రేఖానాయక్, రాఠోడ్ బాపురావులు మాత్రమే హాజరయ్యారు. సమావేశం ఉదయం 11.50 గంటలకు ప్రారంభం కాగా మధ్యాహ్నం 2.40 గంటలకు ముగిసింది. హారితహారం కార్యక్రమం శుక్రవారం ప్రారంభించాల్సి ఉండడంతో ప్రత్యేక అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటు సమావేశం తొందరగా ముగించేస్తున్నట్లు ప్రకటించారు.