హైదరాబాద్, జూలై 30 : విభజన చట్టం ప్రకారం విద్యుత్ పంపిణీ విషయంలో తెలుగు రాష్ర్టాల మధ్య తలెత్తిన వివాద ఫలితంగా ఇరు రాష్ర్టాల ప్రజ...
హైదరాబాద్, జూలై 30 : విభజన చట్టం ప్రకారం విద్యుత్ పంపిణీ విషయంలో తెలుగు రాష్ర్టాల మధ్య తలెత్తిన వివాద ఫలితంగా ఇరు రాష్ర్టాల ప్రజలు నష్టపోతున్నారు. పరస్పరం విద్యుత్ సరఫరా విషయంలో విభేదాల వల్ల ఆయా రాష్ర్టాలు అధిక ధరకు ప్రైవేటు విద్యుత్‌ను కొనుగోలు చేసి సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఏర్పడిన 2014 జూన్ 2వ తేదీ నుంచి ఈ నెల 27వ తేదీ వరకూ ఏపీజెన్కో 24,387 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్టు ఆ రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ లెక్కలు చెబుతున్నాయి. విభజన చట్టం ప్రకారం ఇందులో 53.89% విద్యుత్... అంటే 13,142 మిలియన్ యూనిట్లు ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాలి. కానీ, తెలంగాణకు ఇప్పటివరకూ సరఫరా అయిన విద్యుత్ కేవలం 7,687 మిలియన్ యూనిట్లు మాత్రమే. మరో 5,455 మిలియన్ యూనిట్ల విద్యుత్ తెలంగాణకు సరఫరా కావాల్సి ఉన్నా... వివాదాల వల్ల అది జరగలేదు. ప్రైవేటు విద్యుత్ ఒక యూనిట్ ధర సగటున రూ.6గా తీసుకుంటే తెలంగాణ నష్టపోయిన విద్యుత్ విలువ రూ.3,273 కోట్లు. అలాగే... తెలంగాణ జెన్కో 18,098 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. విభజన చట్టం ప్రకారం.. ఇందులో 46.11ు విద్యుత్... అంటే 8,345 మిలియన్ యూనిట్లు ఏపీకి సరఫరా కావాలి. కానీ, సరఫరా అయిన విద్యుత్ 7,410 మిలియన్ యూనిట్లు. మరో 935 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఏపీకిసరఫరా కావాలి. ప్రైవేటు విద్యుత్ కొనుగోలు ధరల ప్రకారం దీని విలువ రూ.561 కోట్లు. ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి కొనుగోలు వల్ల పడిన భారాన్ని ఏదో ఒక రూపంలో ప్రజలపై ప్రభుత్వాలు మోపుతాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలావుంటే, రెండు రాష్ర్టాల మధ్య జరుగుతున్న విద్యుత్ సరఫరా విషయంలోనూ తీవ్ర విభేదాలు తలెత్తుతున్నాయి. అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరాను నియంత్రించే దక్షిణ ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ కూడా తెలంగాణ, ఏపీ విద్యుత్ లెక్కల విషయంలో నిస్సహాయతను వ్యక్తం చేస్తోంది. తమకు వేల కోట్ల విలువైన బిల్లులు రావాలంటూ ఇరు రాష్ర్టాల ట్రాన్స్‌కోలు పరస్పరం లేఖలు రాసుకుంటున్నాయి. వాదోపవాదాల లేఖలతో విసిగిపోతున్న ట్రాన్స్‌కోలు... అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా విషయంలో రెండు రాష్ర్టాల సరిహద్దులకు సమీపంలో ఉన్న 132 కేవీ సబ్స్టేషన్లలో ప్రత్యేక విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆ మీటర్లను సరిహద్దులు కలిగి ఉన్న ఇరు రాష్ర్టాల డిస్కంలు ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌కోల మధ్య అంగీకారం కుదిరినట్టు సమాచారం.