ఆదిలాబాద్ అర్బన్, పాలనాప్రాంగణం, న్యూస్టుడే: జీవో 3 వివాదం ఉపాధ్యాయ కౌన్సెలింగ్ ప్రక్రియను కుదిపేసింది. గిరిజనప్రాంతంలో 1950 నుంచి ని...
ఆదిలాబాద్ అర్బన్, పాలనాప్రాంగణం, న్యూస్టుడే: జీవో 3 వివాదం ఉపాధ్యాయ కౌన్సెలింగ్ ప్రక్రియను కుదిపేసింది. గిరిజనప్రాంతంలో 1950 నుంచి నివాసముంటున్న వారికే పదోన్నతులు కల్పించాలని ఓ వర్గం పట్టుబడటం... అలా చేస్తే తమకు అన్యాయం జరుగుతుందని మరోవర్గం వాదనకు దిగడంతో ప్రతిష్టంభన నెలకొంది. బుధవారం రాత్రి వరకు కౌన్సెలింగ్ జరగకపోవడం.. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో డీఈవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత కనిపించింది. అక్కడ ఎవరు ఏం మాట్లాడుతున్నారో... ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. సీఐ రఘురెడ్డి సారథ్యంలో ఘర్షణకు సిద్ధపడిన ఉపాధ్యాయులను సముదాయించారు. బుధవారం స్కూల్ అసిస్టెంట్లకు పీజీహెచ్ఎంలుగా పదోన్నతి కౌన్సెలింగ్ జరగాల్సి ఉండగా... ఉదయమే ఏజెన్సీ, మైదానప్రాంత పాఠశాలల ఉపాధ్యాయులు డీఈవో కార్యాలయానికి తరలివచ్చారు. తొలుత మైదానప్రాంత పదోన్నతి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కాగా... ఏజెన్సీ ప్రాంతం వారికి ముందుగా నిర్వహించాలని ఆప్రాంత ఉపాధ్యాయులు పట్టుబట్టారు. జీవో 3 ప్రకారం స్థానికేతరులకు పదోన్నతి అవకాశం కల్పించవద్దని గిరిజన తెగలోని ఓ వర్గం అభ్యంతరం వ్యక్తంచేసింది. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలకు పదోన్నతి కల్పించవద్దని మరికొందరు వాదించారు. దీంతో డీఈవో సత్యనారాయణరెడ్డి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి జోగురామన్న వద్దకు ఈ పంచాయితీ వెళ్లింది. నిబంధనల మేరకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించడంతో అధికారులు రంగంలోకి దిగారు. సాయంత్రం 7 గంటల సమయంలో కౌన్సెలింగ్ సమావేశమందిరానికి జడ్పీ సీఈవో జితేందర్రెడ్డితో కలిసి డీఈవో వచ్చారు. తొలుత ఏజెన్సీ ప్రాంత పదోన్నతి ప్రక్రియ కొనసాగించేందుకు సన్నద్ధమయ్యారు. మైదానప్రాంతానికి చెందిన గిరిజన ఉపాధ్యాయిని ఏజెన్సీలో పదోన్నతికి అవకాశం ఇవ్వాలంటూ పోడియం ముందు ఆందోళనకు దిగడంతో పరిస్థితి మొదటికొచ్చింది. స్థానికేతర విభాగానికి చెందిన ఆ ఉపాధ్యాయినికి అవకాశం ఇవ్వొద్దని మరో ఉపాధ్యాయిని వాదనకు దిగడం కౌన్సెలింగ్ అడ్డంకిగా మారింది. ఈ విషయమై ఇరువర్గాల వారు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో కౌన్సెలింగ్ హాలులో గందరగోళం మొదలైంది. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేసుకోవడం ప్రారంభించడంతో... పరిస్థితి చేయిదాటేలా ఉండటంతో డీఈవో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ రఘు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టే యత్నంచేశారు. రాత్రి తొమ్మిది గంటలైనా గందరగోళం సద్దుమణగక పోవడంతో కౌన్సెలింగ్ ప్రారంభంకాలేదు. మరోవైపు కౌన్సెలింగ్ కోసం ఉదయమే వచ్చి ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు గంటల తరబడి నిరీక్షణ తప్పలేదు. ధ్రువపత్రాలు పరిశీలించాక అనుమానం ఉన్నవారి పదోన్నతులను తాత్కాలికంగా నిలిపివేస్తామని డీఈవో పేర్కొనడంతో వివాదం సద్దుమణిగింది. దీంతో రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కౌన్సెలింగ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఇరువర్గాలు డీఈవో ప్రతిపాదనకు ఒప్పుకొన్నారు. ఏజెన్సీ ప్రాంత పీజీహెచ్ఎంల కౌన్సెలింగ్ మొదలైంది. ఆందోళన దృష్ట్యా పోలీసుల పహారా నడుమ కౌన్సెలింగ్ జరగడం... పదోన్నతికి వచ్చిన వారి తప్పిస్తే మిగిలిన వారందరినీ కౌన్సెలింగ్ హాలు నుంచి బయటకు పంపించడంతో కౌన్సెలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఈ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. కౌన్సెలింగ్లో ఏజెన్సీలో 16 పోస్టులకు, మైదానప్రాంతంలో 48 పోస్టులకు పదోన్నతి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో ఉపవిద్యాధికారులు రామారావు, చారి, ఏడీ జిలానీభాషా, కార్యాలయ పర్యవేక్షకులు కిషన్ తదితరులు పాల్గొన్నారు.