(1 Jul) కౌటాల : వారంతా రైతులు. చిరుజల్లులు కురవడంతో పంట చేలలో విత్తనాలు నాటేందుకు వెళ్లారు. మంగళవారం సాయంకాలం ఒక్కసారిగా ఉరుములు, మెరుపుల...
(1 Jul) కౌటాల : వారంతా రైతులు. చిరుజల్లులు కురవడంతో పంట చేలలో విత్తనాలు నాటేందుకు వెళ్లారు. మంగళవారం సాయంకాలం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఇంటికి ప్రయాణమయ్యే క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో నలుగురు రైతులను పిడుగు మృత్యువు రూపంలో కబలించింది. ఇందులో ఇద్దరు మహిళలు, ఇద్దరు రైతులు మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన కౌటాల మండలంలో విషాదం నింపింది. మండలంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రైతులు చేల పనులు చేసుకొని ఇంటికి వెళుతుండగా.. తాటిపెల్లి గ్రామానికి చెందిన రౌతు ఉద్దవ్(30), కుమ్డె మంగళ(25), చింతల మానెపెల్లి గ్రామానికి చెందిన పుంజరి పార్వతి(30), బాబాసాగర్‌కు చెందిన రౌతు వెంకటేశ్(30) పిడుగుపాటుకు మృతిచెందారు. తాటిపల్లికి చెందిన సుమన్‌బాయి, చింతల మానెపెల్లికి చెందిన రోజ, సుజాతలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సిర్పూరు(టి) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వివిధ గ్రామాల్లో సంఘటనా స్థలాలను సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.2వేలు చొప్పున అందజేశారు. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు రూ.50 వేలు చొప్పున అందజేస్తామని హామీ ఇచ్చారు. ఐటీడీఏ తరఫున గిరిజన కుటుంబాలకు చెందిన మృతులకు రూ.5వేలు అంతిమ సంస్కారాలకు అందజేయనున్నట్లు చెప్పారు. జడ్పీటీసీ డుబ్బుల నానయ్య, సీఐ అశ్చేశ్వర్‌రావు, కార్యకర్తలు కట్ట ప్రసాద్, రాజన్న, విశ్వనాథ్, తదితరులు ఉన్నారు. దహెగాం: మండలంలోని ఇట్యాల గ్రామానికి చెందిన గువ్వల వెంకటి(55) అనే వ్యవసాయ కూలీ మంగళవారం పిడుగుపాటుకు మృతిచెందాడు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. వెంకటి, కట్టెకోల లచ్చన్నలిద్దరు కలసి అరక కూలీకి వెళ్లారు. పత్తిచేనులో డౌర కొట్టే సమయంలో మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ సమయంలోనే పిడుగు పడడంతో గువ్వల వెంకటి అక్కడికక్కడే మృతి చెందాడు. దూరంగా ఉన్న లచ్చన్నకు ప్రమాదం తప్పింది. విషయాన్ని లచ్చన్న గ్రామస్థులకు తెలిపాడు. మృతునికి కుమారుడు అశోక్ ఉన్నాడు. భీమిని: భీమిని మండలం మల్లీడీ గ్రామానికి చెందిన మామిడిలా భీమక్కపై పిడుగు పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ఉదయం తన చేను పనికి వెళ్లింది. మధ్యాహ్న సమయంలో పిడుగు పడటంతో గాయాలపాలైంది. కుటుంబ సభ్యులు ప్రైవేట్ వాహనంలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. బెజ్జూరు: బెజ్జూరు మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన ఆత్రం లలిత(22) అనే విద్యార్థిని పిడుగుపాటుకు మృతి చెందారు. ఆత్రం సుజాతకు గాయాలు కావడంతో ఆమెను అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. మంగళవారం చేనులో పత్తి విత్తనాలు పెట్టి ఇంటికి తిరిగి వస్తుండగా చెట్టుపై పిడుగు పడింది. దీంతో లలిత అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పున్నంచందర్ తెలిపారు. లలిత కుటుంబాన్ని ఎమ్మెల్యే కోనప్ప పరామర్శించారు. రూ.2వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కాగజ్‌నగర్ గ్రామీణం: మండలంలోని దరిగామ్ గ్రామానికి చెందిన అయ్యూబాయి(15) అలీగూడ గ్రామానికి చెందిన గిరుజ్బాయ్(16) వ్యవసాయ పనులకు వెళ్లారు. సాయంత్రం భారీ వర్షం రావడంతో ఇంటికి వెళ్లేందుకు తిరుగు ప్రయాణమవుతుండగా పిడుగు పడి అక్కడికక్కడే మృతిచెందారు. అలీగూడకు చెందిన ఆత్రం రాంబాయి, సిడాం కుర్సుబాయ్(45) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పంట చేల నుంచి తరలించే క్రమంలో మార్గంమధ్యంలో వాగు ఉప్పొంగి ప్రవహించడంతో అక్కడ నిరీక్షించాల్సి వచ్చింది. వాగు ఉద్ధృతి తగ్గిన తర్వాత వీరిని ఆవలి ఒడ్డున ఉన్న 108 ద్వారా ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెన్నూరు గ్రామీణం: చెన్నూరు మండలం సోమనపల్లి గ్రామానికి చెందిన బట్టె దుర్గయ్య (33) అనే గొర్రెల కాపరి మంగళవారం రాత్రి పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. దుర్గయ్య ఉదయం గొర్రెల మందను మేత కోసం ఒడ్డుసోమన్పల్లి సమీపంలోకి తీసుకెళ్లాడు. సాయంత్రం గొర్రెలు మాత్రమే ఇంటికి రాగా దుర్గయ్య రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఆచూకీ కోసం గాలించగా ఒడ్డుసోమనపల్లి గ్రామ సమీపంలో దుర్గయ్య మృతదేహం కనిపించింది. పిడుగుపాటుకు దుర్గయ్యతో పాటు మరో రెండు గొర్రెలు మృతిచెందాయని కుటుంబ సభ్యులు తెలిపారు. బలార్ష: చంద్రపూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలతోపాటు పిడుగులు పడటంతో ముగ్గురు మృతి చెందారు. రాజూర తాలూకాలోని పాండర్పౌని గ్రామానికి చెందిన వర్ష నందూకాడే(32), అదే తాలూకాలోని సోండా గ్రామానికి చెందిన మహిళతోపాటు గోండ్పిపిరీ తాలూకాలోని పార్గావ్ గ్రామానికి చెందిన అనూబాయి ఎసన్కర్(38) మృతిచెందారు.