(1 Jul) జిల్లాలో బాసర వద్దే ఎక్కువ మంది భక్తులు పుణ్యస్నానాలకు వచ్చే అవకాశం ఉంది. మామూలు సమయంలోనూ ప్రతిరోజు భక్తులు పుణ్యస్నానాలకు వస్తార...
(1 Jul) జిల్లాలో బాసర వద్దే ఎక్కువ మంది భక్తులు పుణ్యస్నానాలకు వచ్చే అవకాశం ఉంది. మామూలు సమయంలోనూ ప్రతిరోజు భక్తులు పుణ్యస్నానాలకు వస్తారు. అయితే.. వర్షాభావ పరిస్థితుల కారణంగా బాసర వద్ద గోదావరిలో నీళ్లులేక నదీగర్భం బయటపడింది. దీంతోపాటే చెత్తాచెదారం, పిండప్రధాన సామగ్రి, అస్తికలు నిమజ్జనం చేసిన కుండలు సైతం బయటపడ్డాయి. వాడి పారేసిన ప్లాస్టిక్ కవర్లు కూడా అపరిశుభ్రతకు కారణమవుతున్నాయి. గోదావరి ప్రవాహం కేవలం వర్షాకాలంలోనే ఉంటుంది. కానీ.. ఈ ఏడాదిలో ఇప్పటికీ సరైన వర్షాలు లేకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. ఎస్సారెస్పీలో నీటి నిల్వలు ఉన్నప్పుడు బ్యాక్‌వాటర్ నిల్వ ఉండటం వల్ల ఇక్కడి వ్యర్థాలు ఎటూ కొట్టుకు పోలేని పరిస్థితి. సులభ్‌కాంప్లెక్స్ నుంచి వెలువడే వ్యర్థాలను సైతం గోదావరిలోకే వదలడం భక్తులను మరింత కలవరపెడుతోంది. బాసర సమీపంలో వెలువడే చెత్తాచెదారాన్ని కూడా గోదావరినదిలోనే పడేస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక్కడి పరిశుభ్రతను మెరుగుపరచడంలో గ్రామపంచాయతీ, దేవాదాయశాఖలు తీవ్రంగా విఫలమయ్యాయి. రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో అపరిశుభ్రతకు కారణమవుతోంది. ఇక్కడ 640మీటర్ల పొడవున పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. గోదావరిలో పాత పుష్కరఘాట్లపైన ఒండ్రుమట్టి పేరుకుపోయింది. ఇప్పటికీ ఆ మట్టి అలాగే ఉంది. తొలగించడానికి ఏమీ చర్యలు తీసుకోలేదు. ఇక్కడి పారిశుద్ధ్య పనుల నిర్వాహణ తమది కాదంటే తమది కాదంటూ గ్రామపంచాయతీ, దేవాదాయశాఖ అధికారులు తప్పించుకుంటున్నారు. రెండు శాఖల నిర్లక్ష్యం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా శాఖలను సమన్వయం చేసే అధికారులే లేకపోవడంతో ఈ వివాదానికి తెరపడటం లేదు. వచ్చే నెల 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. పారిశుద్ధ్య పనులను పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉన్నా.. వారునిద్రావస్థను వీడటంలేదు. ఇంకా చాలా సమయం ఉందంటూ పారిశుద్ధ్యపనులను మొదలేపెట్టలేదు. కనీసం ఇటువైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పటికే ప్రతి రోజు వచ్చిపోయే భక్తుల సంఖ్య పెరుగుతున్నా.. కనీసం పుష్కర ఘాట్ల వద్ద శుభ్రం చేద్దామనే ఆలోచన రాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రధాని స్వచ్ఛభారత్ కార్యక్రమం దేశం అంతటా నిర్వహించినా.. బాసరలో పేరుకపోయిన అపరిశుభ్రతను తొలగించే ప్రయత్నమేదీ చేయలేదు. ఈ విషయంలో వందలాది మంది ఉద్యోగులు, సిబ్బంది కలిగిన దేవాదాయధర్మాదాయశాఖ కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. మిగిలిన ప్రభుత్వశాఖలు, స్వచ్ఛంద సంస్థలు కూడా స్వచ్ఛభారత్పైన పట్టీపట్టనట్లుగా వ్యవహరించాయి. ఆఖరుకు విద్యార్థులే స్వచ్ఛభారత్‌లో పాల్గొని పారిశుద్ధ్య పనులు చేపట్టే ప్రయత్నం చేసినా అది పూర్తిగా నెరవేరలేదు. పుష్కరాలపై ఇప్పటికే పలు మార్లు సమీక్షించిన అధికార యంత్రాంగం ఇక్కడి అపరిశుభ్రతపైన దృష్టి పెట్టలేదు. బాసర వద్ద పనులను ఇటీవల పుష్కరాల ప్రత్యేక అధికారి అధర్‌సిన్హా పరిశీలించారు. అపరిశుభ్రతపైన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. భక్తులకు అత్యంత ముఖ్యమైన స్నాన ఘట్టాల వద్దే పారిశుద్ధ్యం లోపిస్తే ఎలా అంటూ సంబంధిత అధికారులను నిలదీశారు. ఇప్పటి నుంచైనా గోదావరి నదిలోని అపరిశుభ్రతను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అయినా.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా అధికారుల తీరు ఏమాత్రం మారలేదు. ఇప్పటి వరకు చెత్తను తొలగించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఘాట్ల నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలకే పరిమితమైన నీటిపారుదలశాఖ అధికారులు పారిశుద్ధ్యంపైన పట్టించుకున్న దాఖలాలు లేవు. గ్రామపంచాయతీ, దేవాదాయ, నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపట్టకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడం పలు విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని బాసర వద్ద గోదావరిని శుభ్రం చేయాలని పలువురు కోరుతున్నారు.