ప్ర భుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన మిషన్ కాకతీయ పథకం ప్రగతి నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడి పనులు అక్కడే అన్నచందంగ...

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన మిషన్ కాకతీయ పథకం ప్రగతి నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడి పనులు అక్కడే అన్నచందంగా మారింది. వేసవిలోనే పూర్తి చేయాల్సిన పనులు ఇప్పటికీ పావలా వంతు కూడా పూర్తిచేయలేని దుస్థితి నెలకొంది. వర్షాలకు నీళ్లు చేరని చెరువుల్లో ఇప్పటికీ పూడికతీత పనులు చేసుకునే వెసులుబాట ఉన్నా.. అప్పుడే పనులను ఆపేశారు. ఈ పనుల తీరును 'ఈనాడు' పరిశీలించింది. నత్తనడకన పనులు జరగడమే కాకుండా నాసిరకంగా చేసిన పనులు ప్రభుత్వానికి అపకీర్తి తెచ్చిపెట్టేలా ఉన్నాయి. జిల్లాలో 3,951 చెరువులు, కుంటలున్నాయి. ఈ ఏడాది 608 చెరువుల పనులు చేయడానికి అనుమతికి ప్రభుత్వానికి పంపారు. ఇప్పటి వరకు 570 చెరువుల పనులకు మాత్రమే టెండర్లు పూర్తిచేశారు. గుత్తేదారులతో 557 చెరువులకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వాటిల్లో 541 చెరువుల పనులు మాత్రమే మొదలయ్యాయి. 1830 ట్రాక్టర్లను ఉపయోగించి 21 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని మాత్రమే తొలగించారు. పూర్తిస్థాయిలో ఇప్పటి వరకు ఒక్క చెరువు పనికూడా పూర్తికాలేదు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయకపోవడంతో ఈ ప్రభావం మళ్లీ రెండో ఏడాదిలో చేపట్టే పనులపై పడనుంది. నీటిపారుదల శాఖ డివిజన్ల వారీగా పనులు పరిశీలిస్తే పురోగతిలో అత్యంత వెనుకంజలో ఉన్నామని ఆ శాఖ అధికారులు ఇచ్చిన ప్రగతి నివేదికలే చెబుతున్నాయి. పనుల వేగవంతానికి ప్రభుత్వపరంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినా అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. డివిజన్లు ఏర్పాటు చేసి.. పర్యవేక్షణకు అవసరమైనంత మందిని నియమించడమే కాకుండా ఖాళీలను పూర్తిచేసినా.. పనుల నిర్వాహణ అస్తవ్యస్తంగా మారింది. వేసవి కాలంలోనే పూడిక తీత పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం పలుమార్లు హెచ్చరించినా అధికారులు, గుత్తేదారుల్లో మాత్రం స్పందన లేదు. నిర్మల్ డివిజన్ పరిధిలో 1149 చెరువులు ఉండగా ఈ ఏడాదిలో 176 చెరువుల పనులు పూర్తిచేయాలి. వాటిల్లో 166 చెరువులకు టెండర్లు పూర్తిచేసి గుత్తేదారులతో ఒప్పందం కుదిరింది. అన్ని చెరువుల పనులు ప్రారంభించి ఇప్పటి వరకు 7.30 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని తొలగించారు. ఆదిలాబాద్ డివిజన్లో 277 చెరువులున్నాయి. 58 చెరువులను ఈ ఏడాదిలో పూర్తిచేయాల్సి ఉన్నా 47 చెరువులకు అంచనాలు తయారు చేశారు. వాటిల్లో 46 చెరువులకు టెండర్లు నిర్వహించి గుత్తేదారులతో ఒప్పందం కుదుర్చుకొని అన్ని పనులు మొదలు పెట్టారు. ఇప్పటివరకు 1.29 లక్షల క్యూబిక్‌మీటర్ల పూడిక మట్టిని మాత్రమే తొలగించారు. ఇప్పటి వరకు ఆరు చెరువులకు రూ.1.36 కోట్లు చెల్లింపులకు బిల్లులు సిద్థం చేశారు. మిషన్‌కాకతీయ ద్వారా చెరువుల పూడికతీత పనులు పారదర్శకంగా నిర్వహించాల్సి ఉన్నా.. నాసిరకంగా చేశారు. పూడిక తీత పనుల్లోనూ అవకతవకలు చోటు చేసుకున్నాయనే విమర్శలున్నాయి. ఒక్కో చోటా ఒక్కోరకంగా పనులు అస్తవ్యస్తంగా కొనసాగించారు. కొన్ని చోట్ల పూర్తిస్థాయిల్లో పూడిక తీయకుండానే వర్షాలు రావడంతో మమ అనిపించారు. కట్టలను ప్రతిష్టం చేయడానికి పూడిక మట్టినే వాడారు. దానిపైన రోలింగ్ చేయకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురికావడమే కాకుండా కట్టకు నెర్రెలు బారాయి. కాగజ్‌నగర్ మండలంలో కోటేపల్లి దాసరికుంటకు రూ.28లక్షలు మంజూరయ్యాయి. మత్తడి, కట్టను వెడల్పు పనులు చేశారు. పూడిక పనులు ఆరంభ శూరత్వంగా మారాయి. గత వర్షాకాలంలో ఈ చెరువుకు పడిన గండిని పూడ్చకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు నీళ్లు నిల్వ లేదు. అదే గ్రామంలోని పాతపెద్దచెరువు కట్ట ప్రతిష్టం చేయడానికి చెరువులో పూడిక మట్టినే వాడారు. రోలింగ్ చేయకపోవడంతో పోసిన మట్టి కిందకు జారిపోతోంది. బోరుకుంట చెరువుకు తూము షట్టర్లు సక్రమంగా బిగించక పోవడంతో నీళ్లు కారుతున్నాయి. బెజ్జూరులో 13చెరువు పనులు మొదలు పెట్టినా ఒక్క చెరువు కూడా పూర్తి చేయలేదు. అన్ని చెరువులు అసంపూర్తిగానే ఉన్నాయి. పూడికతీత పనులు కూడా చేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కౌటాల మండలంలో 31 చెరువులకు కేవలం ఒక్క చెరువు పనులు మాత్రమే పూర్తయ్యాయి. దహెగాంలో 10చెరువులకు నిధులు మంజూరైనా రెండు తప్ప మిగిలిన చెరువుల పనులు పూర్తికాలేదు. సిర్పూరు(టి)లో 16 చెరువులకు ఒక్కటీ పూర్తిచేయలేదు.