రోజూ ఎంతో మంది ఫోన్ చేస్తారు అనారోగ్యంవల్లే తొలుత విచారణకు రాలేదు ఏసీబీ అధికారులకు సండ్ర వివరణ హైదరాబాద్,: ''నేను ఎమ్మెల్యేన...
రోజూ ఎంతో మంది ఫోన్ చేస్తారు అనారోగ్యంవల్లే తొలుత విచారణకు రాలేదు ఏసీబీ అధికారులకు సండ్ర వివరణ
హైదరాబాద్,: ''నేను ఎమ్మెల్యేను. ప్రతిపక్షానికి చెందిన సభ్యుడిని. నాకు ప్రతిరోజు ఎన్నో ఫోన్లు వస్తుంటాయి. అందులో సగంమందిని చూస్తేగానీ గుర్తుపట్టలేని పరిస్థితి'' అని ఓటుకు నోటు కేసులో నిందితుడైన సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. రెండు రోజుల కస్టడీలో భాగంగా గురువారం ఉదయం ఏసీబీ అధికారులు సండ్రను చర్లపల్లి జైలులో అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు వైద్య పరీక్షలు నిర్వహించి... ఉదయం 9.30 గంటలకు ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ శివశంకర్ నేతృత్వంలో డీఎస్పీ, ఇతర అధికారులు సండ్రను ప్రశ్నించారు. కేసు దర్యాప్తులో భాగంగా రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహాతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వేం నరేందర్ నుంచి సేకరించిన సమాచారం, ఎఫ్‌ఎ్‌సఎల్ నివేదిక ఆధారంగా ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నావళి ప్రకారం వివరాలు ఆరా తీశారు. ముఖ్యంగా సెబాస్టియన్‌తో జరిగిన ఫోన్ సంభాషణ, డబ్బులపైనే అధికారులు ఎక్కువ ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఎమ్మెల్యేగా ఉన్న తనకు ప్రతిరోజు ఎంతోమంది ఫోన్ చేస్తుంటారని, వారిలో చాలామందిని ప్రత్యక్షంగా చూస్తేగానీ గుర్తుపట్టలేనని సండ్ర వివరించారు. పార్టీలో సహచరులకు ఫోన్ చేయడం, వారు తనకు ఫోన్ చేయడం సహజమేనని... ఫోన్ సంభాషణలకు, తనపై చేస్తున్న ఆరోపణలకు సంబంధం లేదని తెలిపారు. 'తొలుత సెక్షన్ 160 ప్రకారం నోటీసులు జారీ చేసినప్పుడు ఎందుకు విచారణకు రాలేదు?' అని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అనారోగ్యం వల్లే రాలేకపోయానని సండ్ర బదులిచ్చారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇచ్చేందుకు తెచ్చిన రూ. 50 లక్షలు, ఓటింగ్ తర్వాత ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న రూ.4.5 కోట్ల విషయమై ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే... ఆ విషయాలేవీ తనకు తెలియదని సండ్ర స్పష్టం చేసినట్లు సమాచారం. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 70 ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. తొలిరోజు కస్టడీ ముగిసిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి... రాత్రి బస నిమిత్తం సిట్ కార్యాలయానికి తరలించారు. ''ఏసీబీ అడిగిన అన్ని ప్రశ్నలకు సండ్ర ఎక్కడా తడబడకుండా సమాధానాలిచ్చారు. మధ్యాహ్నం భోజనం, టీ తీసుకున్నారు. వెన్ను నొప్పితో బాదపడుతున్నందున కొంత ఇబ్బందికి గురయ్యారు. తెలంగాణ, ఆంరధప్రదేశ్కు చెందిన ఏసీబీ కార్యాలయాలు ఒకే దగ్గర ఉండటంతో సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందునే ఆయనను సిట్ కార్యాలయానికి తరలించారు'' అని సండ్ర తరఫు న్యాయవాది సుధీర్ కుమార్ చెప్పారు. బెయిల్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి సండ్ర బెయిల్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. బెయిల్ పిటిషన్‌పై గురువారం వాదనలు జరగాల్సి ఉన్నప్పటికీ దర్యాప్తు అధికారులు గడువు కోరడంతో ఏసీబీ 4వ అదనపు కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి విచారణ వాయిదా వేశారు. నా ఫోన్ ట్యాప్ చేశారు! అందులో రికార్డింగ్‌లు లేవు: సెబాస్టియన్ 'ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు ఇవే'... అంటూ ఏసీబీ అధికారులు విడుదల చేసిన రికార్డులు తప్పని ఓటుకు నోటు కేసులో నిందితుడైన సెబాస్టియన్ తెలిపారు. తన ఫోన్లో ఎలాంటి సంభాషణలు రికార్డు కాలేదని... తన ఫోన్‌ను ట్యాప్ చేశారని చెప్పారు. గురువారం ఏసీబీ కార్యాలయానికి వచ్చినపుడు ఆయన మీడియాతో మాట్లాడారు. ''నా ఫోన్లో రికార్డింగ్‌లు లేవు. ట్యాపింగ్ జరిగింది. జగన్‌కు చెందిన చానల్ డబ్బింగ్ వాయి్‌సతో రికార్డింగ్ చేసి నా సంభాషణ పేరిట ప్రసారం చేస్తోంది. బైబిల్ పట్టుకుని రాజకీయ ప్రసంగాలు చేయరాదని నేను గతంలో (వైఎస్ విజయలక్ష్మిని ఉద్దేశించి) చెప్పినందునే నాపై కక్ష సాధిస్తున్నారు'' అని తెలిపారు. ఫోన్ సంభాషణల్లో 'జనార్దన్' పేరు వచ్చిన విషయాన్ని ప్రస్తావించగా... టీడీపీ కార్యాలయ కార్యదర్శి జనార్దన్‌కు, ఈ కేసుకూ సంబంధం లేదని చెప్పారు.