శ్రీరాంపూర్ : ప్రస్తుత వార్షిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో మొదటి త్రైమాసికం పూర్తయ్యేసరికి శ్రీరాంపూర్ ఏరియా వంద శాతం ఉత్ప...
శ్రీరాంపూర్ : ప్రస్తుత వార్షిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో మొదటి త్రైమాసికం పూర్తయ్యేసరికి శ్రీరాంపూర్ ఏరియా వంద శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని పూర్తి చేసిందని ఏరియా జనరల్ మేనేజర్ సుభాని అన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత వార్షిక సంవత్సరం జూన్ నెల చివరి నాటికి ఏరియా 105 శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించి సింగరేణి వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉందన్నారు. జూన్ ఒక్క నెలలోనే ఏరియా 100 శాతం ఉత్పత్తి సాధించగా అందులో ఏరియాలోని భూగర్భ గనులు 87 శాతం, ఉపరితల గని 115 శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించాయి. ఏరియాలో పని చేస్తున్న కార్మికులు, సూపర్వైజర్లు, అధికారుల కృషి ఫలితంగానే ఏరియా వార్షిక ఉత్పత్తి లక్ష్యసాధనలో ముందున్నామని, అందుకు ఆయన వారికి అభినందనలు తెలిపారు. ఏరియాలో నిర్వహించిన మీకోసం మీచెంతకు కార్యక్రమంలో కార్మిక కుటుంబాలు పేర్కొన్న సమస్యల్లో 30 శాతం పనులు పూర్తి చేశామన్నారు. ఇంకా మిగిలిన రూ.కోటిన్నర విలువైన పనులను టెండర్ల ద్వారా ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. కార్మిక కుటుంబాల కోరిక మేరకు శ్రీరాంపూర్ ప్రగతి మైదానంలోని నవజీవన్ పార్కులో, నస్పూర్ కాలనీలోని సరస్వతి శిశుమందిర్, సీసీసీలలో యోగా కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సింగరేణి ఆణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా గురువారం సీసీసీలోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో ఏరియాలోని మూడు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అభ్యర్థులకు అన్ని వసతులు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. హరితహారం కార్యక్రమం కోసం ఏరియాలోని సింగరేణి నర్సరీల్లో 10 లక్షల మొక్కలను పెంచుతున్నామని, ఇందుకు రూ.40 లక్షలు బడ్జెట్ కేటాయించినట్లు పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల కోసం సీతారాంపల్లి, చెన్నూరులోని గోదావరి వద్ద కంపెనీ ఆధ్వర్యంలో రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఎస్ఓటు జీఎం సత్యనారాయణ, డీజీఎం(పీ) శర్మ, డీజీఎం(సివిల్) శ్రీనివాసరావు, ఏజీఎం విజేందర్, డీవైసీఎంఓ లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. రెబ్బెన: సింగరేణి సంస్థ బెల్లంపల్లిఏరియాకు నిర్ధేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధికమించడానికి సమష్టిగా కృషి చేయాలని బెల్లంపల్లిఏరియా జీఎం కె.రవిశంకర్ అన్నారు. బుధవారం గోలేటిలోని జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జూన్ మాసంలో ఏరియా గనులు సాధించిన ఉత్పత్తి వివరాలను వెళ్లడించారు. జూన్ నెలలో ఏరియా గనులు 5,55,600 టన్నుల ఉత్పత్తి సాధించాల్సి ఉండగా 4,87,522(88శాతం) టన్నులు సాధించినట్లు తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా చూసుకుంటే మూడో స్థానంలో ఉందన్నారు. గోలేటి-1ఏ గనిలో 13,600ల టన్నులకు గాను 12,477(92శాతం), కైరిగూర ఓసీపీలో 3,30,000 టన్నులకు గాను 2,31,844(70శాతం), డోర్లి-1లో 1,27,000 టన్నులకు గాను 1,72,136(136శాతం), డోర్లి-2లో 85వేల టన్నులకు గాను 71,065(84శాతం) సాధించినట్లు తెలిపారు. జూన్ నెలలో బొగ్గు ఉత్పత్తిపై వర్షాల ప్రభావం పడిందని, దీంతో బొగ్గు ఉత్పత్తిని వందశాతం సాధించలేకపోయినట్లు తెలిపారు. బొగ్గు రవాణాను సైతం వేగవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే ఓసీపీ-2 విస్తరణ(అబ్బాపూర్) గనిని ప్రారంభించడం జరుగుతుందని, ఇప్పటికే అబ్బాపూర్, సోనాపూర్ గ్రామస్థులకు పునరాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సింగరేణి సంస్థ కార్మిక సంక్షేమానికి పెద్దపీఠ వేస్తుందన్నారు. యోగా, స్వచ్ఛభారత్, ఆణిముత్యాలు, హరితహారం కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. బెల్లంపల్లిఏరియాలో 15వేల మొక్కలను నాటేందుకు ప్రణాళికను తయారు చేసినట్లు తెలిపారు. వివిధ గనులలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన కార్మికులకు రావాల్సిన బెన్ఫిట్స్ గనుల వద్ద చెల్లించినట్లు తెలిపారు. సమావేశంలో బెల్లంపల్లి ఎస్ఓటు జీఎం కె.కొండయ్య, పర్సనల్మేనేజర్ రేవు సీతారాం, డీవైపీఎం ఎ.రాజేశ్వర్, ఐఈడీ ఎస్ఈ యోహన్లు పాల్గొన్నారు.
