జిల్లాలో ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిశాయి.. అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిసింది.. సమయానికి విత్తు పడితే ఇక ఢోకా ఉండదని భావించారు.. అంతా అను...
జిల్లాలో ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిశాయి.. అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిసింది.. సమయానికి విత్తు పడితే ఇక ఢోకా ఉండదని భావించారు.. అంతా అనుకున్నట్లే జరిగింది.. జూన్ నెలలో కురిసిన వర్షాలతో విత్తుకున్నారు. మొలకలొచ్చాయి.. పంటలపై పెట్టుకున్న ఆశలు ఇక నెరవేరినట్లే అని ఆశించారు.. ఇంతలోనే వరుణుడు ముఖం చాటేశాడు. చినుకు జాడ కరవై.. మొక్కలు వాడిపోతుండగా, పంటలను కాపాడుకునేందుకు కర్షకులు కనిపించిన దేవుళ్ళందరినీ మొక్కుతున్నారు.. వూరించిన వర్షం ఉసూరుమనిపించడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. నీటి సౌకర్యం ఉన్న రైతులు ఏదోలా పంటలను కాపాడుకునే ప్రయత్నంలో ఉండగా, మిగిలిన రైతులు వర్షం కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. మొలకలు వచ్చిన ఈ సమయంలో వర్షం కురిస్తే, మొక్కలకు జీవం పోసినట్లవుతుంది. గత నెల సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయినా, ఈ నెలలో వర్షం జాడ లేకపోవడం రైతులను కలవర పరుస్తోంది. వాస్తవంగా జిల్లా రైతులు జూలై15 లోగా పూర్తి స్థాయిలో విత్తుకుంటారు. ఈ ఏడాది సాధారణ సాగుతో పోలిస్తే.. జిల్లాలో ఆరు లక్షల హెక్టార్లలో పంటలు సాగు అవుతాయని అధికారుల అంచనా. వాస్తవంగా వాతావరణం అనుకూలిస్తే ఇంకా కొంత సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉండేది. అయితే ఈ ఏడాది వర్షాలు అనుకూలంగా కురియడంతో సాగు విస్తీర్ణం 6.50 లక్షలు అయ్యే అవకాశం ఉందని అధికారులు భావించారు. ఈ నెలలో తిరిగి వర్షాలు కురియకపోవడంతో విత్తుకున్న పంటలతోపాటు, సాగయ్యే పంటలపై ఆందోళన నెలకొంది. అధికారుల లెక్కల ప్రకారం మంగళవారం నాటికి 3.95 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. పత్తి 3.50 లక్షల హెక్టార్లలో సాగు కావల్సి ఉండగా, 2.62 లక్షల హెక్టార్లకు చేరుకుంది. పత్తి విత్తుకోవడానికి ఈ నెల 30 వరకు గడువు ఉండటంతో సాధారణ సాగు కంటే ఎక్కువే సాగు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. సోయా పంట జూలై 15 లోగా విత్తుకోవాలి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో విత్తుకోవల్సి ఉంది. జిల్లాలో సోయా సాగు ఇప్పటి వరకు 77వేల హెక్టార్లలకే పరిమితమయింది. గత ఏడాదితో పోలిస్తే జూన్ నెలలో అవసరం మేరకు వర్షాలు కురియడంతో సాగు పనులు ముమ్మరంగా జరిగాయి. జిల్లాలో జూన్ నెలలో సాధారణం కంటే వర్షం ఎక్కువే కురిసింది. అయితే ఈ నెలలో 300 మిమీలు వర్షం కురియాలి. కాని ఇప్పటి వరకు ఈ నెలలో చెప్పుకోదగ్గ వర్షం పడలేదు. జూన్ నెల సాధారణ వర్షపాతం 200 మిమీలు కాగా 328.0 మిమీలు కురిసింది. జిల్లాలోని 52 మండలాల్లో సాధారణం కంటే 30 మండలాల్లో వర్షం ఎక్కువే కురిసింది. మరో 11 మండలాలు సాధారణ వర్షపాతానికి చేరువలో ఉన్నాయి. కడెం, ఖానాపూర్ మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయింది. గత ఏడాది జూన్ నెలలో కేవలం 73మిమీల వర్షపాతం నమోదై వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది జూలైలో కురవాల్సిన వర్షం కురిస్తే పంట సాగుకు సమస్య ఉండదు. జూన్ నెలలో కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి, పోర్లిన, జలాశయాల్లోకి చేరే స్థాయిలో నీళ్ళు రాలేదు. ఒకటి రెండు ప్రాజెక్టులు మినహా ఇతర ప్రాజెక్టులు గరిష్ఠ నీటి మట్టానికి దూరంగానే ఉన్నాయి. చాలా మంది రైతులు వర్షాలు కురుస్తాయనే ఆశతో ఇప్పటికే నారు పోసుకొని సిద్ధంగా ఉన్నారు. నాట్లు వేసే సమయం వస్తోంది. జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చెందిన సరస్వతి కాలువ, కడెం, సదర్మాట్, స్వర్ణ, చెలిమెల తదితర ప్రాజెక్టుల కింద వరి సాగు చేస్తారు. ఆయా ప్రాజెక్టుల్లో నీటి మట్టం ఆశాజనకంగా లేదు. గత ఏడాది వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులు, చెరువుల, కింద సాగయ్యే వరి సాగు విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది. జిల్లాలో కాలువల కింద 29 వేల హెక్టార్లలో, బావుల కింద 11 వేలు, చెరువుల కింద 8559 హెక్టార్లలో వరి సాగు అవుతుంది. ప్రస్తుతం కొంత మంది నారు పోసి సిద్ధంగా ఉన్నారు. మరి కొంత మంది నారు మడుల ఏర్పాట్లలో ఉన్నారు. జిల్లాలో సాగుకు ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉంది. జూన్ నెలలో కురిసిన వర్షాలతో నల్లరేగడి భూముల్లో ఇంకా తేమ ఉంది. మరో నాలుగయిదు రోజుల వరకు మొలకలకు సమస్య లేదు. వర్షభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వ్యవసాయాధికారులకు సూచించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా మూడు దశల్లో ప్రణాళిక రూపొందించాం. ఈ నెల పదో తేదీలోగా వర్షాలు కురిస్తే సాగు ఎప్పటి మాదిరిగా కొనసాగించవచ్చు, నీటి పారుదల సౌకర్యం ఉన్న రైతులు నీటి తడులు ఇచ్చి పంటలు కాపాడుకోవాలి. మొలకలు ఎండిపోయిన చోట ప్రత్యామ్నయ పంటలు సాగు చేసుకోవల్సిందే. జూలై నెలాఖరులో వర్షాలు కురిస్తే ఏం చేయాలి, జూలై నెలలో వర్షాలు పడకుండా ఆగస్టు 15 లోగా వర్షాలు కురిస్తే ఏయే పంటలు సాగు చేసుకోవచ్చు వాటికి ఏ మేరకు విత్తనాలు అవసరం అనేది ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించాం. జిల్లాలో 6.50 లక్షల హెక్టార్లలో పంటలు సాగు అవుతాయని అంచనా వేశాం. జిల్లాలో ఇప్పటి వరకు 3.95 లక్షల హెక్టార్లలో విత్తుకున్నట్లు గుర్తించాం. జిల్లా వ్యాప్తంగా పంటలు మొలక దశలో ఉన్నాయి. ఈ సమయంలో వర్షాలు కురిస్తే రైతులకు మేలు జరుగుతుంది. జిల్లాలో ఎక్కువగా సాగయ్యేది పత్తి కావడంతో అది విత్తుకునేందుకు ఈ నెలాఖరువరకు అవకాశం ఉంది. వర్షాలు కురియడంతో ఆలస్యం అయితే ఆరుతడి పంటలకు సంబంధించిన విత్తనాలు రాయితీపై సరఫరా చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాం. జిల్లాలో ప్రధానంగా పత్తి, సోయా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. అదునులోగా వర్షాలు కురియకపోతే వీటి స్థానంలో ఇతర పంటలు వేసుకోవాలి. జిల్లాలో ఇలాగే వర్షాభావ పరిస్థితులు కొనసాగితే పిచికారి రూపంలో ఎరువులు వేయాలి. 13.0.45 పది గ్రాములు లీటరు నీటికి, లేదా 19.19.19 పది గ్రామలు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. లేదా 28.28.0, 0.50.50 రెండింటిని కలిపి పది గ్రాముల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి ఒక వేళ పత్తి పంటలో మొక్కల దశ 8-10 ఆకుల మధ్యలో ఉంటే యూరియా 10 గ్రాములు లీటరు నీటికి లేదా డీఏపీ పది గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అదే సోయాబీన్ 30 రోజుల దశలో ఉన్నట్లయితే యూరియా అయిదు గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. తేమను నిలుపుకోవడానికి తరుచూ అంతరకృషి చేసుకోవాలి. జిల్లాలో మరో రెండు లక్షల హెక్టార్లలో పంటలు సాగు కావల్సి ఉంది. ఇలాగే వర్షభావ పరిస్థితులు ఉంటే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి. వరి నాట్లకు ఇంకా సమయం ఉంది. అయితే నారు జూలై నెలాఖరులోగా సిద్ధం చేసుకుంటే ఆగస్టు నెలలో నాట్లు వేసుకోవచ్చు. జూలై మొదటి పక్షం తరువాత సోయా వేసుకుంటే దిగుబడులు తగ్గుతాయి. జూలై నెల చివరలో వర్షాలు కురిస్తే సోయా సాగు చేసే భూముల్లో పత్తి వేసుకోవచ్చు. జూలై నెల వరకు వర్షాలు లేనట్లయితే పత్తి, సోయా ప్రత్యామ్నాయంగా ఆగస్టు నెలలో నువ్వు, పొద్దుతిరుగుడు పంటలు సాగుకు అనుకూలం. వర్షధారపు టమాటలో పంటను సాగు చేసుకునే రైతులు తప్పనిసరిగా వర్ష సూచనను దృష్టిలో పెట్టుకొని నారును పెంచుకోవాలి. 35-40 రోజులు పైబడిన నారును నాట్లకు వాడకూడదు. దానికి బదులుగా కొత్తగా నారును పెంచుకోవాలి. ఖరీఫ్ కందిని సరైన సమయంలో విత్తుకోలేని పరిస్థితులో స్వల్పకాలిక బెట్టను తట్టుకునే కంది రకాలు వేసుకోవాలి. పత్తి 3,50,281 2,62,826 సోయా 1,05,600 77,179 కంది 42,291 36,177 జొన్న 22,181 3,088 మొక్కజొన్న 14,182 5,313 పెసర 8,739 2,936 మినుములు 10,117 3,222 వరి 53,843 -- పసుపు 6,379 4,298