ఉగ్రవాదం అణచివేతపై ఒప్పందానికి అంగీకారంమరిన్ని నగరాల్లో భారత్ ఐ.టి. కేంద్రాలునాలుగు ఒప్పందాలపై మోదీ సంతకాలుబిష్కెక్: ప్రపంచవ్యాప్తంగా ...
ఉగ్రవాదం అణచివేతపై ఒప్పందానికి అంగీకారంమరిన్ని నగరాల్లో భారత్ ఐ.టి. కేంద్రాలునాలుగు ఒప్పందాలపై మోదీ సంతకాలుబిష్కెక్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉగ్రవాదం, అతివాదాల పట్ల భారత్, కిర్గిస్థాన్ ఆందోళన వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ ఉగ్రవాదం, ఇతర నేరాలను అణచివేయడానికి శీఘ్రంగా ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించాయి. రక్షణరంగంలో సహకారం పెంపొందించుకోవడం, సంయుక్త మిలిటరీ విన్యాసాలు నిర్వహించడం సహా నాలుగు ఒప్పందాలపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. కిర్గిస్థాన్‌లో పర్యటించడానికి వచ్చిన భారత ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం వీటిపై సంతకాలు చేసిన అనంతరం- దేశాధ్యక్షుడు అల్మజ్బెక్ అతంబయేవ్తో సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సరిహద్దులతో సంబంధం లేకుండా ఉగ్రవాదం అందరికీ ముప్పేననీ, అది ఎక్కడ ఉన్నా అణచివేయాల్సిందేనని చెప్పారు. సురక్షితమైన, శాంతియుతమైన పొరుగుదేశాలనే ఇరుదేశాలూ కోరుకుంటున్నాయని చెప్పారు. రక్షణరంగంలో, సాంస్కృతికంగా, ఎన్నికల సంఘాల మధ్య సహకారం, ప్రమాణాలకు సంబంధించిన అంశాలపై సంతకాలు చేశామనీ, ఇవన్నీ ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను బలోపేతం చేస్తాయని వివరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కిర్గిస్థాన్ చేపడుతున్న చర్యల్ని భారత్ అభినందించినట్లు తెలిపారు. భారత్‌తో దూర వైద్యం (టెలీ మెడిసిన్) మొదలు కావడం కోసం తాను ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. కిర్గిస్థాన్ నుంచి భారత్‌కు వైద్యం కోసం వెళ్తున్న రోగులకు అందుబాటు ధరలో అందుతున్న సేవలు, భారత్ నుంచి కిర్గిస్థాన్‌కు వెళ్లి వైద్యులు అందిస్తున్న సేవల పట్ల ఉభయులు సంతృప్తి వ్యక్తం చేశారు.మీ సహకారానికి ధన్యవాదాలు...ఐరాస భద్రత మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కోసం కిర్గిస్థాన్ అందించిన బలమైన సహకారానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఐరాసలో సంస్కరణలు త్వరగా పూర్తయ్యేందుకూ మద్దతు ఇవ్వాలని కోరారు. భారత్ తరఫున సమాచార-సాంకేతిక కేంద్రాలను మరిన్ని నగరాల్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. క్షేత్రస్థాయిలో ఉపయోగించే వైద్యపరికరాలను కిర్గిజ్ సైన్యం కోసం మోదీ కానుకగా అందించారు. తమ సైన్యానికి భారత్ అందించిన శిక్షణ పట్ల కిర్గిస్థాన్ కృతజ్ఞతలు తెలిపింది. రెండుదేశాల నడుమ ఇప్పుడున్న ఆర్థిక సంబంధాలు వాటి స్థాయికి తగ్గట్టు లేవనీ, దీనిని పెంచుకోవాలని నిర్ణయించాయి. యూరేషియా ఆర్థిక సంఘం, భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని భారత్, కిర్గిజస్థాన్ నిర్ణయించాయి. ఆర్థిక బంధాలను బలోపేతం చేసుకోవడంలో భాగంగా తమ దేశంలో గనులు, ఔషధాల రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కిర్గిస్థాన్ ఆహ్వానించింది.ఉభయతారకంగా సేవలుసంప్రదాయ వైద్య సేవల్ని అందించే 'ఆయుష్' కేంద్రాన్ని నెలకొల్పడానికి భారత్ ముందుకు రావడం పట్ల కిర్గిస్థాన్ కృతజ్ఞతలు తెలిపింది. వాణిజ్యం, పర్యాటకాలను ప్రోత్సహించడం కోసం కొన్ని వర్గాల పౌరులకు వీసా నిబంధనలు సరళతరం చేయాలని ఇరువురు నేతలు తమ అధికారులను ఆదేశించారు. బిష్కెక్ నగరంలో నెలకొల్పిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. భారత్ పర్యటనకు రావాల్సిందిగా అతంబయేవ్ను ఆహ్వానించగా ఆయన అంగీకరించారు.