(3 Jul) అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాలో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు 'హరిత హారం' పథకాన్ని శుక్రవారం ప్రారంభించనున్నార...
(3 Jul) అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాలో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు 'హరిత హారం' పథకాన్ని శుక్రవారం ప్రారంభించనున్నారు. జిల్లాలో ఈ ఏడాది 4.19 కోట్ల మొక్కలు నాటేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. శుక్రవారం సాయంత్రం మూడు గంటలకు చిలుకూరులో తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్క నాటిన తర్వాత జిల్లాలో దీన్ని ప్రారంభించనున్నారు. వారం రోజుల పాటు పచ్చదన వారోత్సవం(గ్రీన్వీక్)ను నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో పర్యటించి పలు చోట్ల మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. జిల్లాలో 25శాతం ఉన్న పచ్చదనాన్ని 33శాతానికి పెంచి వాతావరణం సమతుల్యతను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో మొక్కలు నాటేందుకు హరితహారం పథకాన్ని చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 575 నర్సరీల్లో మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం మొక్కలు నాటేందుకు అనుకూలంగా ఉంది. శుక్రవారం సాయంత్రం 3గంటలకు మొక్కలునాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలో అసెంబ్లీ నియోజక వర్గా వారీగా మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి నియోజక వర్గానికి 40లక్షల చొప్పున మొక్కలు నాటనున్నారు. మూడేళ్ల పాటు కొనసాగే ఈ పథకం ద్వారా ప్రతి ఏటా నాలుగు కోట్ల మొక్కల చొప్పున 12కోట్ల మొక్కలు నాటాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు కూడా పంచారు. గ్రామ స్థాయిల్లో 'గ్రామ హరిత మిత్ర' గ్రూపులను ఏర్పాటు చేశారు. జిల్లాలో దాదాపు 70 రకాలైన మొక్కలను నర్సరీల్లో పెంచారు. కలప, నీడ, పూలు, పండ్లు ఇచ్చే వాటినే పంపిణీకి సిద్ధంగా ఉంచారు. ఏ ఏ మొక్కలను ఏ ఏ ప్రాంతాల్లో నాటాలో కూడా నిర్ణయించారు. రహదారులకు ఇరువైపులా గుల్మొహర్, పెల్టోఫాం, రైన్ట్రీ, సీమతంగేడు, రావి, మర్రి, కానుగ, వేప, నేరేడు, సిస్సు, ఆకాశమల్లే వంటి మొక్కలను నాటనున్నారు. కాలనీల్లో గుల్మొహర్, సీమతంగేడు, వేప, పెల్టోఫాం, పొగడ, టెకోమా మొక్కలు నాటనున్నారు. ఇంటి ఆవరణలో నిమ్మ, దానిమ్మ, గన్నేరు, గులాబి, కరివేపాకు, మామిడి, మందారం, మునగ, బొప్పాయి, సీతాఫలం, ఉసిరి, పొలాల గట్లపైన టేకు, నీలగిరి, బ్లెరిసిడియా, వెదురు, సుబాబుల్, నీరు నిలుచునే ప్రాంతాల్లో నల్లతుమ్మ, ఈత, సిల్వర్ఓక్ వంటి మొక్కలు నాటడానికి ప్రణాళికలు తయారు చేశారు. బోడిగుట్టలపైన నెమలినార, కానుగ, సీమరూబ, వెలగతుమ్మ, పరిశ్రమలు, ఇతర సంస్థలు, పరిసరాల్లో వేప, కానుగ, నెమలినార, సీమచింత, మామిడి, రావి, మర్రి, సిల్వర్ఓక్, సీమతంగేడు, నేరేడు, పల్టోఫాం, సిస్సు, గుల్మోహర్, టేకు వంటి రకాలను నాటాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. పచ్చదన వారోత్సవాలు.. హరిత హారం పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వారం రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు. విస్తృతంగా ప్రచారం చేసి అందరినీ భాగస్వాములను చేసే దిశగా కార్యక్రమాలను చేపట్టనున్నారు. వారోత్సవాలను ఈ నెల 6వ తేదీ నుంచి మొదలు పెట్టాలని చూసినా.. వాతావరణం అనుకూలంగా ఉండటంతో శుక్రవారం నుంచే ప్రారంభిస్తున్నారు. 3వ తేదీన మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కళాజాతల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. 4వ తేదీన పాఠశాలల విద్యార్థులతో ప్లకార్డులతో ప్రదర్శన (గ్రీన్ర్యాలీ) నిర్వహిస్తారు. 5వ తేదీన విద్యార్థులకు చిత్రలేఖన, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి పిల్లల్లోనూ హరిత హారం ప్రాముఖ్యతను వివరిస్తారు. 6వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని ఆవరణల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 7వ తేదీన ఇక్కడి వాతావరణానికి తగ్గట్లుగా ఎటువంటి మొక్కలు నాటాలనే అంశంపై రైతులు, సర్పంచులను ఇప్పటికే ఆదర్శవంతంగా ముందుకెళుతున్న రైతుల వద్దకు తీసుకెళ్లి వారి అనుభవాలతో అవగాహన కల్పిస్తారు. 8వ తేదీన మహిళల భాగస్వామ్యంతో ఇంటి ఆవరణల్లో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నారు. 9వ తేదీన మానవహారం, ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. జిల్లాలో 575 నర్సరీల ద్వారా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టారు. వాటిల్లో 4,19,59,220 మొక్కలు పెంచినట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. కానీ.. విత్తనాలు మొలకెత్తకపోవడం, సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో పలు నర్సరీల్లో మొక్కలు చనిపోయాయి. ప్రస్తుతం అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం జిల్లాలో నర్సరీలు... వాటిల్లో పెరుగుతున్న మొక్కల వివరాలు ఇలా ఉన్నాయి. హరిత హారం కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 5వ తేదీన జిల్లాకు వస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దండేపల్లి మండలం గూడెంలోని దేవస్థానంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత లక్సెట్టిపేట, జన్నారం, కడెం, మామడ, నిర్మల్ ప్రాంతాల్లో హరితహారం కార్యక్రమంలో పాల్గొంటారు.