చదువుల తల్లి బాసర భక్తజన సంద్రమైంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం వేకువజామున 6.21 గంటలకు ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి జోగు రామన్న, ఎంపీ ...
చదువుల తల్లి బాసర భక్తజన సంద్రమైంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం వేకువజామున 6.21 గంటలకు ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి జోగు రామన్న, ఎంపీ నగేశ్, శాసన సభ్యులు విఠల్‌రెడ్డి, బాపు రావు, జిల్లా పాలనాధికారి జగన్మోహన్, ప్రత్యేక అధికారి అదర్ సిన్హాలు పుష్కర వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ఆదిలాబాద్ గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీయోగానంద సరస్వతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరుడి విగ్రహంతో ఘాట్ల వరకు వూరేగింపు చేపట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి వూరేగింపుగా బయలుదేరి గోదావరిలో పుష్కర స్నానం (మొదటి పేజీ తరువాయి) చేయించారు. గురువు సింహరాశిలో ప్రవేశించడంతో బృహస్పతి పూజలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి రామన్న నదిలో పుణ్యస్నానం చేసి వేడుకలు ప్రారంభించినట్లు ప్రకటించారు. దేవాలయాల పునరుద్ధరణ పీఠం వ్యవస్థాపకుడు శ్రీ కమలానంద భారతి సరస్వతి బాసర అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం తెల్లవారు జామునే సినీ నటుడు సుమన్ బాసర అమ్మవారిని దర్శించుకుని పుష్కర స్నానం చేశారు. సాయంత్రం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బాసర అమ్మవారిని దర్శించుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాంచందర్‌రెడ్డి హాజరయ్యారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, వివిధ ప్రాంతాలకు చెందిన ఎన్నారైలు బాసరకు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి 3 గంటల వరకు సమయం పడుతుండగా.. క్యూలైన్లలో తాగునీటి వసతి ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఎస్పీ తరుణ్ జోషి భద్రతను ఎప్పటికప్పుడు పరిశీలించారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచద్రారెడ్డి, దేవనాథ చినజీయర్ స్వామి పుష్కర విగ్రహానికి గోదావరి నదిలో స్నానం చేయించి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాళ్లంతా గోదావరిలో స్నానమాచరించారు. సీనియర్ సివిల్ జడ్జి హేమంత్‌కుమార్, మున్సిపల్ ఛైర్పర్సన్ వసుంధరలు పాల్గొన్నారు. మంచిర్యాల పరిసర ప్రాంతాల నుంచే కాకుండా హైదరాబాద్, మహారాష్ట్రల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. నిర్మల్ మండలంలోని సోన్ వద్ద వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య జిల్లా పరిషత్తు ఛైర్పర్సన్ శోభారాణి, ఐటీడీవో పీవో కర్ణన్‌లు పాల్గొని పుష్కరాలను ప్రారంభించారు. ఎస్సారెస్పీ నుంచి నీరు రావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేకాధికారి అదర్ సిన్హా పుష్కర ఏర్పాట్లను పరిశీలించారు. గూడెంలో సత్యనారాయణస్వామి, రమాదేవి, అయ్యప్ప, సాయిబాబా విగ్రహాలను దేవాలయాల నుంచి వేదమంత్రాల మధ్య గోదావరి తీరం వరకు వూరేగింపుగా తీసుకొచ్చారు. ఉత్సవ విగ్రహాలకు మహాసంకల్ప స్నానం చేయించారు. అనంతరం గోదావరికి మహా హారతి ఇచ్చి పుష్కర స్నానాలను మొదలు పెట్టారు. సబ్‌కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు దంపతులు, దేవాదాయ శాఖ సహాయ కమిషనరు విజయరామారావులు గోదావరిలో పుష్కర స్నానం చేశారు. ఎమ్మెల్యే దివాకర్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, కరీంనగర్ జడ్పీ ఛైర్పర్సన్ తుల ఉమ హాజరై పుష్కరాలను పరిశీలించారు. చెన్నూరులో శృంగేరి శివగంగ పీఠాధిపతి పురుషోత్తమ భారతి మహాస్వామి స్థానిక శివాలయం నుంచి మంగళవాయిద్యాలతో గోదావరి నదికి తరలివచ్చారు. నదిలో ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు. ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు పుష్కర ఘాట్‌ను ప్రారంభించారు. ఘాట్ వద్ద నీరు లేదు. జల్లు స్నానాలకు అధికారులకు ఏర్పాట్లు చేసినా భక్తులు ఆసక్తి చూపకుండా గోదావరిలోకి వెళ్లి స్నానం చేశారు. ఖానాపూర్‌లో పుష్కరాలను ఎమ్మెల్యే రేఖానాయక్ పూర్ణకుంభంతో వూరేగింపుగా బయలు దేరి గోదావరి వరకు చేరారు. నది ఒడ్డున ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో పుష్కర స్నానం చేశారు గంగమ్మ తల్లికి కానుకగా సారె సమర్పించారు.