- చివరి దశలో పనులు - జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పుష్కరాలకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి ఇబ్బంద...
- చివరి దశలో పనులు
- జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పుష్కరాలకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, ప్రత్యామ్నాయ నీటి విడుదలకు ప్రభుత్వ పరంగా చర్యలకు ప్రతిపాదనలు పంపించామని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్తెలిపారు. శుక్రవారం కలెక్టర్చాంబర్లో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కందకుర్తి, పరిసర పుష్కర ఘాట్లలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయించుటకు రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతుందని తెలిపారు. అదేవిధంగా పోచంపాడ్,తడపాకల తదితర పుష్కర ఘాట్లకు కూడా గోదావరి నీటిని విడుదల చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించామని పేర్కొన్నారు. ఆలోపుగా జిల్లా యంత్రాంగం పుష్కర ఘాట్లకు హాజరయ్యే ప్రజలకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసిందన్నారు. 95 శాతం పనులు పూర్తయ్యాయని, ఇందులో ఘాట్ల వరకు రహదారులు, దుస్తులు మార్చుకునే గదులు, శాశ్వత మరుగుదొడ్లు పూర్తయ్యాయని, తాత్కాలిక మరుగుదొడ్లు, 2-3 రోజుల్లో పూర్తి కానున్నాయన్నారు. హాజరయ్యే భక్తులకు ప్రత్యేకంగా 400 బస్సులు నడుపనున్నామని, భక్తులు భద్రపరుచుకోవడానికి క్లోక్ రూమ్‌లు, సామాను, పాదరక్షలు భద్రపరుచుకునే గదులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొన్ని చోట్ల ఉచిత అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని, బస్సులు పార్కింగ్ ప్రాంతాల్లో ప్రజలను దించగానే అక్కడినుంచి ఉచిత షటిల్ బస్సులు ఘాట్ల వరకు నడపనున్నామన్నారు. పిండ ప్రదానం చేసుకోవడానికి ప్రత్యేకంగా ఘాట్‌ను కేటాయించామని తెలిపారు. ఇందుకోసం పురోహితులకు చెల్లించడానికి ధరలు నిర్ణయించామని, ఇప్పటికి 250 మంది పురోహితులు పేర్లు నమోదు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు. పుష్కరాల్లో ప్లాస్టిక్ ప్రీజోన్గా తీర్చిదిద్దనున్నామని తెలిపారు. అన్ని ఘాట్లలో మొరం వేసి బురదమయం కాకుండా ముందే చర్యలు తీసుకున్నామన్నారు. ఇంజనీరింగ్ పనులు నాణ్యంగా ఉంటేనే బిల్లులు చెల్లించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాలకై ముద్రించిన పుస్తకాలను, టెలిఫోన్ బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఎటువంటి అక్రమాలకు తావులేకుండా ముందు జాగ్రత్తగా సిసి కెమెరాలు, పోలీసు అవుట్ పోస్టు, వాచ్ టవర్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిజామాబాద్ నుంచి బాసరకు వెళ్లే భక్తులకు తిరుగు ప్రయాణం బైంస, నిర్మల్ మీదుగా వెళ్లేలా రెండు జిల్లాల అధికారులను నిర్ణయించుకున్నామని, తద్వారా రద్ది సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఎ.రవిందర్‌రెడ్డి, గోదావరి పుష్కరాల లైజనింగ్ అధికారి సుధాకర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.