(5 Jul) పిల్లల దినచర్యపై ముందుగా తనిఖీలు సంగారెడ్డి : ప్రభుత్వం వీధి బాలలు, బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు ఈనెల 1 నుంచ...
(5 Jul) పిల్లల దినచర్యపై ముందుగా తనిఖీలు
సంగారెడ్డి : ప్రభుత్వం వీధి బాలలు, బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు ఈనెల 1 నుంచి ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అందులో పట్టణ, గ్రామీణ స్థాయిలో న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, చైల్డ్ లైన్, సీడబ్ల్యూసీ, డీపీవో సభ్యులు, స్థానిక ఎస్ఐ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.మురికి వాడల్లో నివాసముంటున్న నిరుపేద వర్గాల పిల్లల దినచర్యపై ముందుగా తనిఖీలు చేసి కమిటీ తీర్మానం చేసుకుని ఆ ప్రాంతాలలో దాడులు చేసి చిన్నారులకు విముక్తి కలిగించే ఉద్దేశంతో ఏర్పాటు చేశారని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో కార్యదర్శి కనకదుర్గా, జేజేబీ ఇన్చార్జి న్యాయమూర్తి దుర్గాప్రసాద్‌లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ఉదయం 6 గంటలకు సంగారెడ్డి పట్టణంలోని సంజీవనగర్ కాలనీ మార్క్స్‌నగర్, నారాయణరెడ్డి కాలనీలలో ఏకకాలంలో దాడులు నిర్వహించి 14 సంవత్సరాల లోపు 30 మంది చిన్నారులకు విముక్తి కలిగించారని తెలిపారు. ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థపై కఠినంగా వ్యవహారించడంతో ముందుగా చేసుకున్న ప్రణాళికల ప్రకారం కమిటీ చిన్న పిల్లలతో పని చేయిస్తున్న వారి నుంచి విడిపించేందుకు చర్యలు చేపట్టిందన్నారు.బృందం సభ్యులకు చిక్కిన 30 మంది చిన్నారులలో ఆరుగురు బాలికలు, 24 మంది బాలురు కాగా అందులో 7 మంది బాలురు ఇతర రాష్ర్టాల వారు కావడంతో వారిని విడిచిపెట్టడం జరిగిందన్నారు. కమిటీ సభ్యులకు చిక్కిన చిన్నారులను ఎస్పీ కార్యాలయం ముందున్న బాలసదనంలో బాలికలు, ఈ సేవా ముందున్న దివ్యదిశ వసతి గృహంలో బాలురకు వసతి కల్పించామన్నారు. బాల కార్మికులను రక్షించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 14సంవత్సరాల లోపు పిల్లలతో భిక్షాటన చేయించినా ఇతర పనులకు పురమాయించినా తల్లిదండ్రులు, సంరక్షకులతో పాటు పనుల్లో పెట్టుకున్న యజమానులపై కేసులు నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు. బడీడు పిల్లలు బడిలోనే ఉండాలని, వీధి బాలలుగా భిక్షాటన చేస్తూ పెరిగి పెద్దయ్యాక పెడదారి పట్ట్టి సంఘ విద్రోహశక్తులుగా మారే అవకాశంలేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా అంతటా భవిష్యత్తులో బాల కార్మికులను కాపాడేందుకు ఇలాంటి దాడులు నిర్వహించి విముక్తి కలిగిస్తామని తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి పోలీసులు, అధికారులకు సహకరించాలని సూచించారు. త్వరలో పటాన్చెరు, ఆర్సీపురం పట్టణాలలో తనిఖీలు చేసి పిల్లలకు విముక్తి కలిగించే కార్యక్రమానికి అధికార యంత్రాంగం ప్రణాళికలు చేస్తుందని వివరించారు. డీఎల్ఎస్, సీడబ్ల్యూసీ, జేజేబీ ఆధ్వర్యంలో పట్టణ సీఐ ఆంజనేయులు సహకారంతో శనివారం బాల కార్మికులుగా ఉన్న ప్రాంతా న్ని ముందుగా గుర్తించడంతో మూకుమ్మడిగా దాడి చేసి చిన్నారులకు విముక్తి కలిగించామన్నారు. ఈ సమావేశంలో డీసీపీవో రత్నం, డీపీవో సంగమేశ్వర్, సీడబ్ల్యూసీ సభ్యులు నిజామోద్ద్దీన్, డి. అశోక్, దివ్యదిశ ప్రతినిధులు సత్తిరెడ్డి, పద్మ, వెంకటేశ్, సిరాజ్‌లు ఉన్నారు.