-పాలమూరు జిల్లాలో జోరుగా దందా -అల్పాజోలమ్ డ్రగ్‌ను కలుపుతున్న వ్యాపారులు -అనారోగ్యంబారిన పడుతున్న ప్రజలు -టాస్క్ఫోర్స్దాడుల్లో ...
-పాలమూరు జిల్లాలో జోరుగా దందా
-అల్పాజోలమ్ డ్రగ్‌ను కలుపుతున్న వ్యాపారులు
-అనారోగ్యంబారిన పడుతున్న ప్రజలు
-టాస్క్ఫోర్స్దాడుల్లో భారీగా దొరికిన మాదకద్రవ్యాలు
మహబూబ్‌నగర్ జిల్లాలో మాదకద్రవ్యాల జోరు పెరిగింది. అల్ఫాజోలమ్ అనే నార్కొటిక్ డ్రగ్ జిల్లాకు విచ్చలవిడిగా దిగుమతి అవుతున్నది. కల్లులో కల్తీకోసం దీన్ని వాడుతున్నారు. క్లోరోఫాం, డైజోఫాం కన్నా ఇది ఎక్కువ మత్తు కలిగిస్తుండడంతో ప్రజలు ఇది కలిపిన కల్తీకల్లుకు బానిసలవుతున్నారు. దీనితో కల్తీకల్లు వ్యాపారులకు కాసుల పంట పడుతున్నది. జిల్లాలో కల్లువ్యాపారంలో బడాబాబులు, రాజకీయనాయకులే అధికంగా ఉండడంతో స్థానిక ఆబ్కారీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఇటీవల నాగర్‌కర్నూల్ పరిధిలోని బండరాయి పాకులలో కల్తీ కల్లు వికటించి చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు ఏక కాలంలో దాడులు చేశారు. 13 టాస్క్‌ఫోర్స్ బృందాలు జిల్లా అంతటా కల్లుదుకాణాలు తనిఖీ చేసినపుడు భారీ మొత్తంలో క్లోరల్ హైడ్రేడ్ లభించింది. కొన్ని చోట్ల కల్లులో ప్రమాదకర స్థాయిలో మాదకద్రవ్యాలను కలిపినట్టు గుర్తించారు. పేలుడుతో బయటపడిన గుట్టు.. కాగా, అంతకు కొద్ది రోజుల ముందు జడ్చర్ల పోలీస్‌స్టేషన్ పక్కనే ఒక ఇంట్లో మైక్రోఓవెన్లో వేడి చేస్తున్న అల్ఫాజోలమ్ డ్రగ్ ఒక్క సారిగా పేలి కొంతమంది గాయపడ్డారు. కల్లులో ఉపయోగించడం కోసం వేడి చేస్తున్న తరుణంలో ఈ పేలుడు సంభవించిందని పోలీసుల విచారణలో తేలింది. తీగలాగితే డొంక కదిలినట్టు ఈ వ్యవహారంలో ముంబాయి డ్రగ్స్ ముఠా జిల్లాకు అల్ఫాజోలమ్ డ్రగ్‌ను అక్రమంగా పంపుతున్నదని బయటపడింది. వీరితో చేతులు కలిపిన స్థానికులు కొందరు ముంబాయి నుంచి 15కిలోల అల్ఫాజోలమ్ తెచ్చి అందులో ఇతర ముడిపదార్థాలు చేర్చి 40కిలోలకు పెంచి కిలోకు 40నుంచి 45వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. వాస్తవానికి అల్ఫాజోలమ్ను కొన్ని ప్రత్యేకపరిస్థితులలో రోగులకు నిద్రమత్తుకోసం ఉపయోగించాలి. జిల్లాలో ఉన్న కొన్ని డ్రగ్ ఫ్యాక్టరీల కోసమని చెప్పి తీసుకువచ్చి కల్లులో కలిపి విక్రయిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ పేలుడు కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసినా పెద్దగా వివరాలు దొరుకలేదు. అయితే ఈ కేసును అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని జడ్చర్ల సీఐ అంజయ్య నమస్తేతెలంగాణకు చెప్పారు. పట్టించుకోని అధికారులు.. ఇంత పెద్ద సంఘటన జరిగినా ఎక్త్సెజ్ శాఖ అధికారులు, సిబ్బంది పట్టనట్టే ఉన్నారని, డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా పత్తా లేరని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో కల్లుదుకాణాలు చాలా వరకు బడా రాజకీయనాయకులు కనుసన్నలలో నడుస్తున్నాయని, స్థానిక కల్లు సిండికేట్‌తో ఎక్త్సెజ్ శాఖ అధికారులు కలిసిపోయారని రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. ఈ కారణం వ్లలనే బండరాయి పాకులలో కల్తీ కల్లుతో అస్వస్థత ఘటన చోటుచేసుకోగా స్థానిక సిబ్బందిని పక్కనబెట్టి హైదరాబాద్, రంగారెడ్డి నుంచి 13 టాస్క్‌ఫోర్స్ బృందాలతో మెరుపుదాడులు జరిపించారు. ఇందులో ఒకే రోజు 22కల్తీ కల్లు కేసులను నమోదు చేసి 26మందిని అరెస్ట్ చేశారు. ప్రాణాంతక పదార్థాలే.. ఈ జిల్లాలో క్లోరోఫామ్, డైజోఫాం, అల్ఫాజోలమ్ తదితర మత్తు పదార్థాల వినియోగం ఎక్కువగా ఉంది. వీటి ప్రభావం వల్ల కల్లు తాగిన వెంటనే మత్తు ఆవహిస్తుంది. అయితే క్రమంగా మెదడులో నరాలు, కండరాలు బలహీన పడుతాయి. చివరకు ఆ మత్తులేక పోతే నిలబడలేని పరిస్థితి ఏర్పడి ప్రాణాంతకంగా మారుతుంది. మాదకద్రవ్యాలను రవాణాను అరికట్టండి-నార్కొటిక్ బ్యూరో, డ్రగ్ కంట్రోల్ తో ఆబ్కారీ కమిషనర్ కల్లులో మాదకద్రవ్యాల కల్తీని సీరియస్‌గా తీసుకోవాలని నార్కొటిక్ బ్యూరో, డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఆబ్కారీ కమిషనర్ ఆర్వీ చంద్రవదన్ ఆదేశించారు. ఇటీవల ఆ రెండు శాఖల అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. మాదకద్రవ్యాలు ఎక్కడి నుంచి దిగుమతి అవుతున్నాయో తెలుసుకుని అక్కడే నిరోధించాలని ఆయన సూచించారు. త్వరలో ప్రమాదకర మాదకద్రవ్యాల పై సమావేశం నిర్వహించనున్నారు.