స్వయంగా మంత్రి ఇచ్చిన ఆదేశం బేఖాతరైంది. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధుల బంధువులే గుత్తేదారులు కావడంతో పుష్కర పనుల ప్రక్రియ ...
స్వయంగా మంత్రి ఇచ్చిన ఆదేశం బేఖాతరైంది. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధుల బంధువులే గుత్తేదారులు కావడంతో పుష్కర పనుల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. బాసర మొదలుకొని చెన్నూరు వరకు జిల్లాలో 240 కి.మీ. మేరకు ప్రవహిస్తున్న గోదావరి నదీ తీరంలో ఏ పుష్కర ఘాట్‌ను పరిశీలించినా అసంపూర్తిగానే దర్శనమిస్తోంది. కుంభమేళా తరహా పుష్కరాలను నిర్వహిస్తామన్న నేతల హామీలు కార్యరూపం దాల్చడానికి క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులు అవరోధంగా మారుతున్నాయి. గోదావరి మహా పుష్కర వేడుక ఈ నెల 14వ తేదీ భానోదయం నుంచి ప్రారంభం కానుంది. అందుకు భక్తజనం కోటి ఆశలతో ఎదురు చూస్తోంది. వరుణుడు కరుణించక.. నీళ్లులేక గోదావరి గోస పడుతోంది. నదీ పరివాహక ప్రాంతంలో జలకళ కనిపించడం లేదు. నీరు లేకపోయినా జల్లు స్నానం(షవర్లు) కోసం అధికార యంత్రాంగం భారీ కసరత్తు చేసింది. కానీ, పుష్కరఘాట్ల నిర్మాణం మట్టి తరలింపు, రహదారుల మరమ్మతులు, విద్యుద్దీపాల ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు. బాసరలో ఘాట్ల నిర్మాణ పనులకు ప్రభుత్వం రూ.9.70 కోట్లు మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న గుత్తేదారులు సకాలంలో పనులు పూర్తిచేయక పోగా.. నాణ్యత ప్రమాణాలను సైతం పాటించడం లేదు. బాసరలోని 450 మీటర్ల పొడవున ఉన్న ఘాట్ల నిర్వాహణ అస్తవ్యస్తంగా తయారైంది. ఘాట్ల కోసం గోదావరిలో తవ్విన ఇసుక మేటలు, మట్టి కుప్పలను తరలించే ప్రయత్నమే చేయలేదు. ఘాట్ల సమీపంలోనే జేసీబీలతో కాల్వలు తవ్వారు. భారీ వర్షం కురిస్తే తప్పా ఆ మట్టి నదిలోకి కొట్టుకుపోయే పరిస్థితి లేదు. వాస్తవానికి గుత్తేదారులే ఈ నల్లమట్టిని బయటకు తరలించాల్సి ఉంది. ఇప్పుడు యుద్ధప్రాతిపదికన తరలించినా నాలుగైదు రోజుల గడువు పట్టే అవకాశం ఉంది. మంగళవారం నుంచి పుష్కరాలు ప్రారంభం కానుండగా ఆ మట్టిని తరలించే యత్నమే చేయడం లేదు. ఒకవేళ వర్షం కురిసినా భక్తులకు మరింత ఇబ్బందులు తప్పేలాలేవు. బాసరను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాలనే ఆశ నెరవేరేలా లేదు. సెంట్రల్ లైటింగ్ కోసం ఇంకా తవ్వకాలు కొనసాగుతున్నాయి. రోడ్ల మరమ్మతులు అస్తవ్యస్తంగానే దర్శనమిస్తున్నాయి. ప్రముఖులు వచ్చి వెళ్లే మార్గంలో రహదారులను అన్ని విధాలా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ సామాన్య భక్తులు పడే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఆర్టీసీ, రైల్వే, ప్రైవేటు వాహనాల పార్కింగ్ ప్రయాణాలపై ఇంకా స్పష్టత రాలేదు. పుష్కర స్నానఘట్టాల వద్ద పారిశుద్ధ్య పనులు పూర్తిచేయలేదు. భక్తుల సంఖ్యకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయలేదు. ఇప్పటికీ క్యూలైన్ల పనులు పూర్తికాలేదు. నిర్మల్ నుంచి భైంసా వరకు నిర్మిస్తున్న జాతీయరహదారి పనులు అస్తవ్యస్తంగా మారడంతో పుష్కరాలకు వచ్చే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. వంతెనల నిర్మాణాలు, విస్తరణ సందర్భంగా రహదారిని ఒకవైపు తవ్వకాలతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే పరిస్థితి ఉంది. అంతేకాకుండా మరమ్మతులు సాగుతున్నా ఎటువంటి భద్రత ఏర్పాట్లు చేయలేదు. కనీసం మరమ్మతులు సాగుతున్నట్లు సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. రహదారిపైనే నల్లమట్టిని కుప్పలు కుప్పలుగా పోసి ఉంచారు. దీని వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పుష్కరాల పనులను నేను స్వయంగా పరిశీలించాను. పుష్కరాలు మొదలయ్యే సమయం ఆసన్నమైనా ఇప్పటికీ పనులు పూర్తిచేయకపోవడం భక్తులను ఆందోళన కలిగిస్తోంది. ఘాట్ల వద్ద నల్లమట్టిని తొలగించక పోవడంతో భక్తులు జారిపడే ప్రమాదం ఉంది. జరుగుతున్న పనులు కూడా నాణ్యతగా నిర్మించడంలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.