-పునర్వ్యవస్థీకరణ చట్టానికి ప్రాజెక్టు వ్యతిరేకమని ఫిర్యాదు -ఢిల్లీలో కేంద్రమంత్రి ఉమాభారతితో చంద్రబాబు భేటీ -ఉమ్మడి రాష్ట్రంలోని జ...
-పునర్వ్యవస్థీకరణ చట్టానికి ప్రాజెక్టు వ్యతిరేకమని ఫిర్యాదు
-ఢిల్లీలో కేంద్రమంత్రి ఉమాభారతితో చంద్రబాబు భేటీ
-ఉమ్మడి రాష్ట్రంలోని జీవో జూరాలదని బుకాయింపు
-సెక్షన్ 8పై కుట్రలు ఆపని ఏపీ సీఎం చంద్రబాబు
-కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌తో భేటీలో మళ్లీ పాతపాట
న్యూఢిల్లీ (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రంపై నిలువెల్లా విషం నింపుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి వ్యతిరేకమని కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విడుదలై జీవో, మంజూరైన పరిపాలనాపరమైన అనుమతులు జూరాల ప్రాజెక్టుకు చెందినవని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రస్తావనకు వచ్చిన ప్రాజెక్టు అంటూ కపటనీతిని ప్రదర్శించారు. ఆ జీవోను పూర్తిగా చదవాలని, చదివిన తర్వాత వివరాలు చెప్పగలనని మరో సందర్భంలో దాటవేత ధోరణి ప్రదర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టును వృథాగా సముద్రంలోకి పోతున్న గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌లోకి లిఫ్టు ద్వారా తరలించడానికి ఏర్పాటైందేనని, దీనికి అపెక్స్ కమిటీ అనుమతి అవసరం లేదని, పోలవరం ప్రాజెక్టులో భాగమేనని వ్యాఖ్యానించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయిన చంద్రబాబు మరోమారు సెక్షన్ 8పై పాత పాట పాడారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలపై రెండు రాష్ర్టాల మధ్య సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కోరారు. కొత్త రాష్ర్టాలు ఏర్పడి సంవత్సరం పూర్తయినా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని, గవర్నర్ సమక్షంలో కూర్చుని పరిష్కరించుకునే పరిస్థితి లేనందువల్ల కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. -పాలమూరుపై ఏకపక్ష నిర్ణయం కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, రాజ్‌నాథ్‌సింగ్, ప్రకాశ్ జవదేకర్‌తో భేటీ అయిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధమని, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో చర్చించకుండానే నిర్ణయం తీసుకున్నదని ఆరోపించారు. కేంద్ర జలవనరుల మంత్రి నేతృత్వంలోని అపెక్స్ కమిటీకి కూడా సమాచారం ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో పట్టిసీమ ప్రాజెక్టుకు అనుమతుల గురించి పాత్రికేయులు ప్రస్తావించగా.. పోలవరం ప్రాజెక్టులో పట్టిసీమ భాగమన్నారు. సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి జలాలను లిఫ్టు ద్వారా కృష్ణా బేసిన్‌లోకి తరలించడానికి ఉద్దేశించినదని, దీనికి అపెక్స్ కమిటీ అనుమతులుగానీ, తెలంగాణతో చర్చించాల్సిన అవసరంగానీ లేదన్నారు. పాలమూరుపై మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు (2013లో) సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీకి మంజూరు చేసిన నిధులు పాలమూరు ప్రాజెక్టు కోసం కాదని, జూరాల ప్రాజెక్టుకు సంబంధించిదని బుకాయించారు. దీనిగురించి మరింత వివరంగా పాత్రికేయులు ప్రశ్నించడంతో ఆ జీవోను మరోసారి చూడాల్సి ఉందన్నారు. అనంతరం కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతితో చంద్రబాబు భేటీ అయ్యారు. పాలమూరు ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. బంధువుల ఆరోగ్యం బాగాలేదని ఫోన్ సమాచారం రావడంతో.. రెండు రాష్ర్టాల ప్రాజెక్టుల గురించి చర్చించకుండానే మంత్రి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. గోదావరి పుష్కరాలకు రావాల్సిందిగా చంద్రబాబు ఆహ్వానించినట్లు తెలిసింది. అనంతరం అధికారులతో చంద్రబాబు చర్చలు కొనసాగించారు. -ఉమాభారతితో భేటీ మూడుసార్లు వాయిదా ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయిన చంద్రబాబు ఉమాభారతితో భేటీ కావడానికి తొలుత మధ్యాహ్నం 1.30 గంటలకు అపాయింట్మెంట్ కుదుర్చుకున్నారు. ఆ తర్వాత దానిని 12.30 గంటలకు మార్చాల్సిందిగా కోరడంతో మంత్రి కార్యాలయం ఆ విధంగానే మార్చింది. మళ్లీ 1.30 గంటలకు మార్చాల్సిందిగా కోరడంతో జలవనరుల మంత్రిత్వ శాఖ అధికారులు నిరాకరించారు. 12.30 గంటల నుంచి ఇరవై నిమిషాలపాటు ఉమాభారతి వేచి చూసినా చంద్రబాబు రాలేదు. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు అపాయింట్మెంట్ కుదిరింది. 6.15 గంటలకు చంద్రబాబుతో భేటీ అయిన ఉమాభారతి.. కొన్ని నిమిషాలు మాత్రమే మాట్లాడారు. బంధువుల ఆరోగ్యంపై సమాచారం రావడంతో ఆమె సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు.