దక్షణ గంగగా పేరొందిన గోదావరి భక్తులతో పొంగిపొర్లింది. భారీగా తరలివచ్చిన యాత్రికులతో పరవళ్లు తొక్కింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర మొదలుక...
దక్షణ గంగగా పేరొందిన గోదావరి భక్తులతో పొంగిపొర్లింది. భారీగా తరలివచ్చిన యాత్రికులతో పరవళ్లు తొక్కింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర మొదలుకొని చెన్నూరు వరకు జిల్లాలో ప్రతి ఘాటు పరవశించింది. భక్తి తన్మయత్వం ఉప్పొంగింది. శనివారం జిల్లాలోని పుష్కరఘాట్లకు భక్తుల తాకిడి వూహించని దానికంటే ఎక్కువే పెరిగింది. తెల్లవారు జామున 4.30 గంటల నుంచే భక్తుల రాక ప్రారంభమైంది. బాసర, సోన్, మంచిర్యాల, చెన్నూరు, గూడెం ఘాట్లల్లో సాయంత్రం వరకు తాకిడి కనిపించింది. బాసరలో పుణ్యస్నానాలు తర్వాత చదువుల అమ్మను దర్శించుకునేందుకు భక్తులు మూడువరుసల క్యూకట్టారు. అమ్మవారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్నలు బాసర, బ్రహ్మేశ్వర ఘాట్లను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. గోదావరి పుష్కరాల అయిదో రోజు శనివారం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. బాసర నుంచి చెన్నూరు వరకు అన్ని పుష్కర ఘాట్ల వద్ద భక్తుల రద్దీతో గోదావరి నిండిపోయింది. కొత్తగా ఏర్పాటుచేసిన పుష్కర ఘాట్ల వద్దా పరిసర గ్రామాల భక్తులు పుణ్యస్నానాలు చేశారు. బాసర, సోన్, మంచిర్యాల, చెన్నూరు, గూడెం ఘాట్ల వద్ద గతం కంటే భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పలు రాష్ట్రాల వారు తరలిరావడంతో పుష్కరఘాట్లు, దేవాలయాలు, రహదారులు జనంతో నిండిపోయాయి. బాసరలో భక్తుల రద్దీతో జనసంద్రమైంది. వేకువజామున నుంచే గోదావరి పొడవున పుణ్యస్నానాలకు పోటీపడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీ కొనసాగింది. పుణ్యస్నానం చేసుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. బాసరనే కాకుండా మిగిలిన చోట్లా పుష్కర స్నానం చేసిన వారూ బాసరకు వచ్చి దైవదర్శనం చేసుకున్నారు. వాహనాలు భారీ సంఖ్యలో రావడంతో నిజామాబాద్ నుంచి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ అంతరాయం తప్పలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బాసరకు మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్నలు బాసర చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మహారాష్ట్ర నుంచి పుష్కరాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని ఐకే రెడ్డి స్పష్టం చేశారు. ఆయన పుష్కర స్నానం చేశారు. జిల్లా న్యాయమూర్తి గ్రంథిµ గోపాలకృష్ణమూర్తి కుటుంబం సహా వచ్చి పుష్కర స్నానం చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అదనపు డీజీపీ బ్ఘీఎల్ మీనా బాసరలో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీ తరుణ్‌జోషితో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. తోగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతిస్వామి దేవాలయంలో పూజలు చేశారు. నిర్మల్ మండలంలో రెండు పుష్కర ఘాట్ల వద్ద భారీ సంఖ్యలో భక్తులు వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. వాహనాల రద్దీ పెరగడంతో నిజామాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను మాదాపూర్ పుష్కర ఘాట్‌కు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి పుష్కర స్నానం చేశారు. మంచిర్యాలకు గతానికంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో రెండోరోజు బహ్మయజ్ఞం, నక్షత్రయాగం కొనసాగింది. చెన్నూరుకు భారీగా భక్తులు వచ్చి పుష్కర స్నానం చేశారు. హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి పుష్కరస్నానమాచరించారు. రాత్రి పొద్దుపోయే దాకా భక్తులు తరలివస్తూనే ఉన్నారు. గూడెంలో పోలీసు ఆంక్షలు తొలగిపోయాయి. నదీ స్నానానికి భారీగా తరలివచ్చారు. సత్యనారాయణ స్వామిని 40 వేల మందికి పైగా దర్శనం చేసుకున్నారు.