జి ల్లాలో సాధారణ సాగు 5.75 లక్షల హెక్టార్లు. వాతావరణం అనుకూలిస్తే ఆరు లక్షల హెక్టార్లకు పైగా పంటలు సాగయ్యే అవకాశముంది. అయితే జూన్‌లో సాధా...

జిల్లాలో సాధారణ సాగు 5.75 లక్షల హెక్టార్లు. వాతావరణం అనుకూలిస్తే ఆరు లక్షల హెక్టార్లకు పైగా పంటలు సాగయ్యే అవకాశముంది. అయితే జూన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురిసినా.. ఈ నెల ముఖం చాటేయడంతో ఇప్పటి వరకు 70 శాతం మాత్రమే పంటలు సాగయ్యాయి. అధికారుల లెక్కల ప్రకారం శుక్రవారం నాటికి నాలుగు లక్షల హెక్టార్లలో విత్తనం వేశారు. పత్తి 3.50 లక్షల హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా, 2.66 లక్షల హెక్టార్లలో సాగయింది. పత్తి విత్తనం వేయడానికి ఈనెల 30 వరకు గడువు ఉండటంతో అంచనా మేరకు సాగవుతుందని అధికారులు ఆశిస్తున్నారు. సోయా పంట జులై 15లోగా విత్తుకోవాలి. మరో నాలుగైయిదు రోజుల్లో వర్షం కురవకపోతే సోయా పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగుచేసుకోవాల్సి వస్తుంది. సోయా 1.25 లక్షల హెక్టార్లలో సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు 77 వేల హెక్టార్లలోనే సాగయింది. ఇతర పంటల సాగు విస్తీర్ణం తక్కువే ఉంది. ఈ నెలలో అసలు వర్షాలు కురవక పోవడం.. ప్రస్తుతం భూమిలో తేమ లేకపోవడంతో మొక్కల ఎదుగుదల సరిగా లేదు. దీనికితోడు తెగుళ్ల బెడద, కలుపు అధికమైంది. జిల్లాలో గత రెండు రోజులుగా వర్షం కురిసేందుకు వీలుగా వాతావరణం మారుతుండటంతో
రైతులు ఆశలు పెట్టుకున్నారు. జూన్ నెల సాధారణ వర్షపాతం 200 మి.మీ.లు కాగా 300 మి.మీ.లు కురిసింది. అదే ఈనెలలో శుక్రవారం నాటికి 284 మి.మీ.లు వర్షం కురవాల్సి ఉండగా 320 మి.మీ.ల వర్షపాతం నమోదయింది. 22 మండలాలు సాధారణ వర్షానికి చేరువగా ఉండగా, ఎనిమిది మండలాల్లో ఇంకా లోటు కనిపిస్తోంది. ఈ రైతుపేరు మన్యం అడెల్లు. ఆదిలాబాద్ మండలం చాందా(టి) గ్రామానికి చెందిన ఈయనకు రెండెకరాల భూమి ఉంది. తనను ఎవరూ టేకు చెట్లు పెట్టుకుంటావని అడగలేదని ఆయన చెబుతున్నారు. గట్ల మీద టేకు మొక్కలు పెట్టుకునేందుకు ఆసక్తి ఉన్నా మొక్కలు ఎవరిస్తారో తనకు తెలియదని పేర్కొంటున్నాడు. చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు మాధవ్‌రావ్. ఈయనకు రెండెకరాల భూమి ఉంది. హరితహారం కింద టేకు మొక్కలు ఇస్తున్నట్లు ఆయనకు తెలియదు. టేకు మొక్కలు పెట్టేందుకు ఆసక్తి ఉన్నా గ్రామసభలు పెట్టకపోవడంతో తనకు విషయం తెలియదని ఈయన ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఈ రైతు పేరు జాదవ్ రమేష్. ఇచ్చోడ తండాకు చెందిన ఈయనకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. టేకు మొక్కలు పెట్టాలని ఆసక్తి ఉంది. అయితే మొక్కలు ఇస్తారనే విషయం ఈయనకు తెలియదు. గ్రామంలో ఎక్కడా సభలు నిర్వహించలేదని ఈయన చెబుతున్నారు. జిల్లాలో హరితహారం పథకం కింద టేకు మొక్కలకు పోటీ తీవ్రంగా ఉంది. ఎంపికలో మాత్రం అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో నర్సరీలను తమకు ఇష్టమున్న రైతులకు అప్పగించి విమర్శలను ఎదుర్కోగా తాజాగా మొక్కల పంపిణీలోనూ అదే వైఖరి అవలంబిస్తున్నారు. ఎక్కడా గ్రామ సభలు నిర్వహించకుండా, తీర్మానాలు చేయకుండానే రైతులను ఎంపిక చేయడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా రైతుల పొలాల గట్లపై నాటేందుకు టేకు మొక్కలు ఇస్తున్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) కార్యాలయం ద్వారా వీటిని పంపిణీ చేస్తున్నారు. మొత్తం 1.19 లక్షల మొక్కల లక్ష్యం నిర్దేశించుకోగా అందులో 77 లక్షలు టేకు మొక్కలే ఉన్నాయి. మిగతావి వివిధ రకాల పండ్ల మొక్కలు. ఇందులో 70 శాతం కూడా మొలకెత్తలేదనేది బహిరంగ రహస్యం. అయితే ముందుగా నిర్దేశించుకున్నట్లు మొక్కల పంపిణీ కోసం గ్రామసభలు నిర్వహించామని డ్వామా అధికారులు చెబుతున్నారు. గ్రామసభల్లో తీర్మానాలుచేసి రైతుల పేర్లు ఎంపిక చేసినట్లు పేర్కొంటున్నారు. ఒక్కో రైతుకు 200 మొక్కల నుంచి 1000 మొక్కల వరకు ఇవ్వవచ్చు. ఇలా డ్వామా ద్వారా 34,100 రైతులను ఎంపిక చేశారు. కానీ ఎక్కడా గ్రామసభలు నిర్వహించలేదు. ఎంపికలో తీర్మానాలు జరగలేదు. అంతా అధికారుల ఇష్టారాజ్యంగానే సాగింది. వాస్తవానికి అనుకున్న దానికంటే మొక్కలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. నాసిరకం విత్తనాల కారణంగా చాలాచోట్ల మొక్కలే మొలకెత్తలేదు, నిర్వహణ సరిగా లేక ఎండిపోయాయి. దీంతోనే తమ బండారం బయట పడకుండా తమకు అనువుగా ఉండే రైతులనే ఎక్కువగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వారికి తక్కువ మొక్కలు ఇచ్చి ఎక్కువ చూపేందుకే సభల్లేకుండానే ఎంపిక చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సర్పంచుల నుంచి ఇబ్బందులు రాకుండా వారు చెప్పిన కొన్నిపేర్లు కూడా జాబితాలో చేర్చి జాగ్రత్తపడ్డారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 200 మొక్కల పరిక్షణ కోసం ఏడాదికి రూ.32 వేల వరకు ఉపాధిహామీ కింద చెల్లించనున్నారు. దీంతోనే చేన్లగట్లమీద మొక్కల పెంపకోసం రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ మాత్రం ఎంపికలోనూ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఈ విషయమై డ్వామా పథక సంచాలకుడు శ్రీనివాస్‌ను సంప్రదించగా అందరు రైతులకు మొక్కలు అందజేస్తామన్నారు. సభల ద్వారానే వారిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా అందరి కంటే ముందుగా వస్తే టేకు మొక్కలు అందజేస్తామన్నారు.