(5 Jul) ఎన్నికల ముందు ప్రాజెక్టుపై ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, మంత్రులు హరీష్‌రావు, జోగు రామన్నలు ప్రాజెక్టు నిర్మాణ వ...
(5 Jul) ఎన్నికల ముందు ప్రాజెక్టుపై ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, మంత్రులు హరీష్‌రావు, జోగు రామన్నలు ప్రాజెక్టు నిర్మాణ విషయమై పలుమార్లు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించారు. ఫలితంగానే ఏడాదిలోగా అన్ని అనుమతులను పొందడంతో పాటు నిధులను కేటాయించి ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. అయితే ప్రాజెక్టు నిర్మాణం మహారాష్ట్రలో చేపడుతున్నారు. అక్కడ పనులు జరుగుతున్న సమయంలో ఇక్కడ ప్రాజెక్టు పరిధిలో లబ్ధి పొందే ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాల్వ నిర్మాణం, నష్టపరిహారం తదితరాల పూర్తికి వీలుంటుంది. పెన్‌గంగా ప్రాజెక్టు నిర్మాణానికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సిద్ధంగా ఉండటంతో పనులు ముందుకు సాగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులొచ్చినా పనులకు సంబంధించి స్థానికులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఇన్నేళ్లు జాప్యం జరిగింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు జల వనరులు, అటవీ శాఖ తదితర అనుమతులు పొందారు. ఏటా బడ్జెట్లో నిధులూ కేటాయిస్తున్నారు కానీ ముంపు గ్రామాల ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ప్రస్తుత నిబంధనల మేరకు పరిహారం ఇవ్వాలని అక్కడి రైతులు కోరుతున్నారు. ప్రాజెక్టులో ఎక్కువ భాగం మహారాష్ట్రలోనే నిర్మాణం కానుంది. జిల్లా నుంచి తిరిగి మహారాష్ట్రకు వెళ్లే కాల్వ ద్వారా జిల్లాలోని ఆదిలాబాద్ నియోజకవర్గంలో 41 వేల ఎకరాలకు సాగు నీరందే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా, ఘాటంజి తాలుకాలోని తడ్సోలి గ్రామ సమీపంలో పెన్‌గంగపై ప్రాజెక్టు నిర్మించనున్నారు. అంచనా వ్యయం ఇప్పుడు రూ.10,480 కోట్లకు చేరుకుంది. ప్రాజెక్టు నిర్మాణంతో మహారాష్ట్రలోని యావత్మాల్, చంద్రాపూర్ జిల్లాలోని 4.50 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుంది. అయితే గతంలో అనేక సార్లు గత ప్రభుత్వాలు జలాశయ నిర్మాణం విషయమై చర్చలు జరిపినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందాల్సిన అనుమతులు, నిధుల కేటాయింపులు చేయలేదు. మహారాష్ట్రలోనూ నిర్మాణానికి సంబంధించిన అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతుండటం.. తెలంగాణ ప్రభుత్వం ఇన్నేళ్లు పెండింగ్‌లో ఉన్న పలు అనుమతుల్ని పొందడమేగాకుండా నిర్మాణానికి రాష్ట్ర వాటాగా నిధులను కేటాయించడంతో ప్రాజెక్టు నిర్మాణంపై ఆశలు చిగురించాయి. పెన్‌గంగా నీటిని సాగుకు మళ్లించేందుకు వీలుగా అదనంగా మూడు బ్యారేజిలను నిర్మించేందుకు ఇరు ప్రభుత్వాలు నిర్ణయించాయి. మహారాష్ట్రలోని రాజపేట, రూడ, పంపరాడ్ల వద్ద నిర్మించే వీటి వల్ల ముందే ప్రాజెక్టు నీటిని వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. మూడు బ్యారేజిల నుంచి కేవలం 1.5 టీఎంసీ నీటిని వినియోగించుకుంటున్న నేపథ్యంలో అనుమతులు సులువుగా లభించే వీలుందని ఈ మేరకు నిర్మాణానికి వీలుగా సర్వే నిమిత్తం రూ.2.84 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. నిధులు మంజూరైతే జిల్లా పరిధిలో సర్వే పూర్తి చేసి ఉమ్మడిగా ప్రతిపాదనలు పంపనున్నారు. వీటి నిర్మాణ వ్యయంలో మన రాష్ట్ర వాటా రూ.150 కోట్లు ఉంటుంది. తాంసి మండలం కరంజీ సమీపంలో రాజంపేట వద్ద ఒక బ్యారేజి నిర్మించనున్నారు. ఇందులో సమానంగా నీటి వినియోగం ఉంటుంది. దీని వల్ల సమీప గ్రామాల్లో 2500 ఎకరాలకు సాగు నీరందుతుంది. రెండో బ్యారేజి రూడ వద్ద నిర్మించనున్నారు. దీంట్లో 70 శాతం నీటి వాటా జిల్లాకు 30 శాతం మహారాష్ట్రకు ఉంటుంది. దీనివల్ల 13500 ఎకరాలకు సాగు నీరు అందుతుంది. మూడో బ్యారేజి బేల తర్వాత మహారాష్ట్రలోని పింపరాడ్ వద్ద నిర్మించనున్నారు. ఇందులో 30 శాతం వాటా జిల్లాకు చెందుతుంది. దీనివల్ల 4500 ఎకరాలకు సాగు నీరందుతుంది. నిర్మాణ వ్యయం నీటి వాటాలను బట్టి ఉంటుంది. పెన్‌గంగా ప్రాజెక్టుతో పాటు అదనంగా మూడు బ్యారేజీల నీటి వాటాకు ప్రతిపాదనలు సిద్ధం చేయడంపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పెన్‌గంగా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పరిపాలన అనుమతులు, నిధులు కేటాయింపు ఉత్తర్వులు జారీ చేస్తూ ముఖ్యమంత్రి ఇది తన జన్మదిన కానుకగా చెప్పారని మంత్రి జోగు రామన్న 'న్యూస్‌టుడే'కు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి ప్రాజెక్టు నిర్మాణానికి చెందిన పర్యావరణ, అటవీ, పరిపాలన అనుమతులు, నిధులు కేటాయింపులు తదితరాలను ఏడాదిలోగా పూర్తి చేశారన్నారు. పెన్‌గంగా ద్వారా రైతులు త్వరగా లబ్ధి పొందేందుకు మూడు బ్యారేజీలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇందులో నియోజకవర్గ రైతులు ఎక్కువగా లబ్ధి పొందే బ్యారేజీ నిర్మాణ పనులు తొలి విడతలో పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయన్నారు.