పన్నెండేళ్లకోసారి (పుష్కరం) జరిగే గోదావరి పుష్కరాలు మంగళవారం నుంచి మొదలు కానున్నాయి. జిల్లాలో 31చోట్ల 35 పుష్కరఘాట్లను ఏర్పాటు చేశారు. ము...
పన్నెండేళ్లకోసారి (పుష్కరం) జరిగే గోదావరి పుష్కరాలు మంగళవారం నుంచి మొదలు కానున్నాయి. జిల్లాలో 31చోట్ల 35 పుష్కరఘాట్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బాసరలో చివరి నిమిషం వరకు పనులు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర నుంచే ఎక్కువమంతి భక్తులు ఇక్కడి స్నానాలకు వస్తారు. అయినా ఆ రాష్ట్ర ప్రభుత్వం పుష్కరస్నానాలకు నీటి విడుదల చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో వర్షాలు కురవకుంటే ప్రస్తుతం నిల్వ ఉన్న నీటితో పాటు అక్కడ జల్లు స్నానాలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులే దాపురించాయి. బాసరలో పుష్కర స్నానాలకు మంత్రి జోగు రామన్న హాజరవుతున్నారు. ఈ నెల 14 నుంచి 25వ తేదీ వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. జిల్లాలో బాసర నుంచి మొదలు కొని అష్టా, కౌఠా, సావర్గాం, బ్రహ్మేశ్వరం, వాస్తాపూర్, టెంబూర్ని, పార్పల్లి, మునిపల్లి చింతల్చాందా,కమల్‌కోట్, పోన్కల్, ఖానాపూర్, లింగాపూర్, బెల్లాల్, చింతగూడ, రాంపూర్, ద్వారక, గూడెం, లక్సెట్టిపేట, ముల్కల్ల, మంచిర్యాల, సీతారాంపల్లి, వేలాల, చెన్నూరులలో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. గతంలో లేనివిధంగా ఈసారి భారీగా పుష్కర ఘాట్లను నిర్మించి వాటికి తగ్గట్లుగా వచ్చిపోయే భక్తుల కోసం వసతులు కల్పించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. బాసరలో జరగనున్న గోదావరి పుష్కరాలలో జిల్లాకు చెందిన మంత్రి జోగురామన్న, జిల్లా పాలనాధికారి జగన్మోహన్లు బాసర గోదావరిలో స్నానం చేయనున్నారు. మిగిలిన ఘాట్ల వద్ద ఆసక్తి కలిగిన ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు పుణ్యస్నానం ఆచరించనున్నారు. మిగిలిన చోట్లా స్థానిక తహసీల్దార్లు, ఎంపీడీవోలు పుష్కరాలను మొదలు పెట్టనున్నారు. బాసరలో ఇంకా పనులు పూర్తికాలేదు. ఆర్టీసీ బస్సులు నిలిపేందుకు తాత్కాలిక బస్టాండ్ పనులు కొనసాగుతున్నాయి. రహదారుల మరమ్మతులు పూర్తికాలేదు. విద్యుత్తు స్తంభాలను ఇంకా నిలబెట్టలేదు. దీంతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కష్టంగా మారింది. పుష్కర ఘాట్ల వద్ద మట్టి తొలగించలేదు. ఘాట్ల నుంచి గోదావరిలోపలికి నీళ్లు ఉండటంతో అక్కడికి చేరుకునేలా ఇసుక బస్తాలు వేస్తున్నారు. క్యూలైన్ల పనులు సాగుతున్నాయి. పుష్కరాలు ప్రారంభం నాటికి వరుణుడు కరుణిస్తాడని లేదంటే మహారాష్ట్రలోని గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తారని అంతా భావించారు. అయినా.. ఇప్పటికీ ఎగువన వర్షాలు రాకపోవడం, వుహారాష్ట్ర నుంచి నీటిని విడుదల చేస్తామనే హామీ రాకపోవడంతో కొంత గందరగోళం నెలకొంది. ప్రస్తుతం నిల్వ ఉన్న నీటితోనే గోదావరి స్నానాలు చేయాల్సిన పరిస్థితి. ఫూట్ల వద్ద జల్లు స్నానాలకోసం షవర్లను ఏర్పాటు చేశారు. షవర్ల ద్వారా వచ్చే నీరు కూడా గోదావరిలోనిదే కావడం వల్ల జల్లు స్నానాలు చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పుష్కరాల పుణ్యస్నానాలాచరించే భక్తుల కోసం 700 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి బాసరకు 450 బస్సులను ఏర్పాటు చేయగా.. ఆదిలాబాద్ నుంచి 150 బస్సులు, నిజామాబాద్ నుంచి 100 బస్సులను భక్తుల కోసం అందుబాటులో ఉంచారు. భక్తుల రద్దీని బట్టి అదనంగా బస్సులను పంపడానికి కూడా ఆర్టీసీ సిద్ధంగానే ఉంది. ప్రస్తుతం ఉన్న ఛార్జీలకు అదనంగా 50శాతం పెంచారు. గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి ఘాట్లకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎస్సారెస్పీ నుంచి ప్రస్తుతం 3,500 క్యూసెక్కుల నీటిని దిగువనకు విడుదల చేస్తున్నారు. ఈ నీరు రేపటి వరకు ఖానాపూర్ వరకు వచ్చే అవకాశం ఉంది. కడెం నుంచి నాలుగువేల క్యూసెక్కులు చొప్పున నీరు విడుదల అవుతోంది. ఎల్లంపల్లి నుంచి ప్రస్తుతం వెయ్యి క్యూసెక్కుల చొప్పున విడుదల అవుతోంది మంచిర్యాల పుష్కరాలను స్థానిక ఎమ్మెల్యే దివాకర్‌రావు ప్రారంభించనున్నారు. ఎల్లంపల్లి నుంచి నీటి విడుదల చేయడంతో నీటి ప్రవాహం అక్కడకు చేరుకున్నా.. గోదావరికి అవతలి ఒడ్డు కరీంనగర్ జిల్లా ఘాట్ల వైపునే నీళ్లున్నాయి. కానీ.. మంచిర్యాల వైపు పుష్కర ఘాట్ల వద్ద స్నానాలు చేసే అవకాశం అంతగా లేదు. 17 నుంచి 21వరకు చిన్నజీయర్ స్వామి మంచిర్యాలలో బ్రహ్మయజ్ఞం , నక్షత్రయాగంలో పాల్గొంటారు. ప్రస్తుతం జీయర్ స్వామి శిష్యుడు దేవానాదన్ చిన్న జీయర్ స్వామీ హాజరుకానున్నారు. రైల్వే స్టేషను నుంచి బీటీ రోడ్డు పనులు నిలిచిపోయాయి. సీసీ రోడ్డు వేయకుండానే వదిలేశారు. నిర్మల్ మండలంలోని సోన్ వద్ద ఎస్సారెస్పీ నీళ్లు రావడంతో ఇబ్బంది లేకుండా పోయింది. ఇక్కడ జెడ్పీ ఛైర్పర్సన్ శోభారాణి కుటుంబ సభ్యులతో పుణ్యస్నానం ఆచరించనున్నారు. దిలావర్పూర్ మండలంలోని మూడు ఘాట్లకు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ లేకపోవడంతో గోదావరిలో బోర్లు వేసి జల్లుస్నానాలకు ఏర్పాట్లు చేశారు. గూడెం ఘాట్ పుష్కరాల నిర్వాహణకు సిద్ధమైంది. ఇక్కడ కూడా కొంత నీటి ఇబ్బందులున్నాయి. కడెం నుంచి నాలుగువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. చెన్నూరు, జైపూరు మండలాల్లో గోదావరి వెడల్పు దాదాపు 2కి.మీ వెడల్పు ఉండటంతో జిల్లా వైపు ఉన్న ఘాట్ల చెంతకు నీరు చేరేఅవకాశం తక్కువగాఉంది. నీటిని ఘాట్లవైపునకు మళ్లించే ప్రయత్నం చేస్తామన్నా ప్రస్తుతం అధికారులు చేతులెత్తేశారు. పుష్కరాలను ప్రారంభించేందుకు శృంగేరి శివగంగా పీఠాధిపతి పురుషోత్తమ భారతీ మహాస్వామి ఇప్పటికే చెన్నూరుకు చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే నల్లాలు ఓదేలు అధికారికంగా పుణ్యస్నానం చేయనున్నారు. పుష్కరాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తులు అనుమానాలకు తావులేకుండా భారీగా తరలి రావాలి. బాసరతోపాటు కొన్ని చోట్ల జల్లుస్నానాలను ఏర్పాటు చేశాం. గోదావరిలో స్నానం చేయడమే కాకుండా జల్లుస్నానాలు కూడా చేసుకోవచ్చు. జల్లుస్నానాలకు వచ్చే నీళ్లు కూడా గోదావరి నీరే. కాబట్టి భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేసుకోవచ్చు.