♦ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపణ ♦ తరచూ గచ్చిబౌలి, ఢిల్లీలో కలుస్తున్నది నిజం కాదా? ♦ 'పాలమూరు'ను ఆపాలని ఏపీ ప్రభుత్వం...
♦ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపణ
♦ తరచూ గచ్చిబౌలి, ఢిల్లీలో కలుస్తున్నది నిజం కాదా?
♦ 'పాలమూరు'ను ఆపాలని ఏపీ ప్రభుత్వం కోరలేదని స్పష్టీకరణ
మహబూబ్‌నగర్ : కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు డెరైక్షన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ యాక్షన్ చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌లోని తన గృహంలో నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ కమీషన్ల కోసం కక్కుర్తి పడి కేవీపీతో దోస్తీ చేశారని, ఆంధ్రాకు చెందిన కేవీపీతో ఆయనకు ఉన్న దోస్తీ ఏమిటని ప్రశ్నించారు. కేవీపీని తరచుగా గచ్చిబౌలిలో కలుస్తున్నది నిజం కాదా.? అని నిలదీశారు. కేసీఆర్ కుటుంబసభ్యులు ఆయనను ఢిల్లీలో కలుస్తున్నది కాదనగలరా అన్నారు. దీన్ని ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు ఎవరు ఖండించినా తాను ఆధారాలతో బయటపెడతానని సవాల్ విసిరారు. పాలమూరు ఎత్తిపోతల, నక్కలగండి ప్రాజెక్టులకు సంబంధించి జూన్ 11న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీకి లేఖ రాసిందని.. రాష్ట్ర పునర్విభజన ప్రకారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును) ఇచ్చి ప్రాజెక్టులను చేపట్టాలని పునర్విభజన చట్టంలో ఉందన్నారు. ఆ మేరకే ఆ ప్రభుత్వం లేఖ కోరిందన్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్ ఇచ్చింది లేనిది చెప్పాల్సింది పోయి ఎందుకు అడిగారని రాద్ధాంతం చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. 2019 ఎన్నికల నాటికి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం పూర్తిచేస్తే పాలమూరు జిల్లాలో టీడీపీ పోటీచేయదని.. ఒకవేళ ప్రాజెక్టు పూర్తికాకపోతే జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు టీడీపీ జెండా మోయడానికి సిద్ధమేనా అని సవాల్ విసిరారు. పాలమూరు ఎత్తిపోతలపై మంత్రి హరీశ్‌రావుకు చిత్తశుద్ధి ఉంటే ఎత్తిపోతల పూర్తి కోసం ఆమరణ నిరాహారదీక్ష చేయాలని, ఆయన ఆత్మత్యాగం చేస్తే మహబూబ్‌నగర్‌లోని గడియారం సెంటర్లో ఆయన శిలా విగ్రహం కట్టించే బాధ్యత తనదేనన్నారు. సీఎం కేసీఆర్ బావమరుదుల మధ్య అంతర్గత పోరును భరించలేక వారి శాఖల పరిధిలో చెరి రూ.60 వేల కోట్ల పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి కమీషన్లకు ఇబ్బంది లేదన్న భావన కలిగించారన్నారు. బంద్‌ల పేరుతో ప్రజలను రెచ్చగొట్టడానికి వచ్చే అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను చెట్లకు కట్టి వేయాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.