హైదరాబాద్ : ప్రత్యామ్నాయం చూపించిన తరువాతే పేదలు వేసుకున్న గుడిసెలను తొలగించాలని ఆందోళన చేస్తున్న సీపీఎం నేతలు..పేదలను పోలీసులు అరెస్టు చ...
హైదరాబాద్ : ప్రత్యామ్నాయం చూపించిన తరువాతే పేదలు వేసుకున్న గుడిసెలను తొలగించాలని ఆందోళన చేస్తున్న సీపీఎం నేతలు..పేదలను పోలీసులు అరెస్టు చేశారు. గత నాలుగు రోజులుగా మూసారాంబాగ్ లో ని వడ్డెర బస్తీలో గుడిసెలను పోలీసులు కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. పేదలకు అండగా ఉన్న సీపీఎం ఈ విషయాన్ని ఆర్డీఓ, ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే గురువారం ఉదయం గుడిసెలను తొలగించేందుకు ప్రొక్రెయన్లతో పోలీసులు చేరుకున్నారు. తమ గుడిసెలను కూల్చివేయవద్దంటూ పేదలు ప్రాథేయపడ్డారు. కానీ పోలీసు వారి ఆర్తనాదాలను వినకుండా గుడిసెలను తొలగించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న సీపీఎం నేతలు ఘటనా ప్రాంతానికి చేరుకుని పోలీసులు..ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పేదలను..సీపీఎం నేతలను ఈడ్చుకెళ్లి వాహనాలలో పడేశారు. 20-25 సంవత్సరాలుగా నివాసం... మూసారాంబాగ్ వద్ద వడ్డెర బస్తీలో 20-25 సంవత్సరాల నుండి గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఒకవేళ కూల్చితే పేదలకు ప్రత్యామ్నాయం చూపెట్టాలని సీపీఎం డిమాండ్ చేసింది. సమీపంలో ఉన్న ఓ వ్యక్తి ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని, వారికి పోలీసులు, అధికారులు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కట్టుబట్టలతో తాము రోడ్డుపై నిలబడ్డామని, తమను ఆదుకోవాలని పేదలు కోరుతున్నారు.