అన్ని దారులూ గోదారి వైపే..ప్రాజెక్టుల నుంచి ప్రత్యేకంగా నదిలోకి నీటి విడుదలనేటి సాయంత్రం ధర్మపురికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులురేపు ఉదయం...
అన్ని దారులూ గోదారి వైపే..ప్రాజెక్టుల నుంచి ప్రత్యేకంగా నదిలోకి నీటి విడుదలనేటి సాయంత్రం ధర్మపురికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులురేపు ఉదయం 6.26 గంటల తర్వాత పుష్కరస్నానంఅంతా వస్తున్నారు.. వరుణుడు తప్ప!గోదారమ్మ పుష్కర మాతగా... సకల పుణ్య ప్రదాతగా రూపుదిద్దుకొంటున్న శుభవేళ ఇది. పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కర వైభవం ఆధ్యాత్మిక విశ్వాసపరాయణులైన భక్తకోటికి ముక్తిప్రదాయకం. తెలంగాణ ఏర్పడ్డాక జరుగుతున్న తొలి పుష్కరాలు కావడంతో కోలాహలం మిన్నంటుతోంది. కనీవినీ ఎరుగని రీతిలో సన్నాహాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో జన్మించి... తెలంగాణ గడ్డపైకి అడుగుపెట్టిన గోదారమ్మ ఒడిలో కాసేపు సేద తీరాలని భక్తజనం ఎదురుచూస్తోంది.కరీంనగర్ నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధిక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులంతా వస్తున్నారు.. దేశవిదేశాల్లోని బంధువులొస్తున్నారు.. ఎన్నాళ్లుగానో కలవని మిత్రులొస్తున్నారు.. అందరి అడుగులూ పుష్కరఘాట్ల వైపే.. దారులన్నీ గోదారి వైపే.. కానీ, ఒక్కరు మాత్రం ఇంకా అటువైపు తొంగిచూడట్లేదు.. రావల్సిన సమయమొచ్చినా రావట్లేదు.. ఆయనే వరుణుడు. పుష్కలంగా నీరివ్వని వానదేవుణ్ని వేడుకుంటూ.. పుష్కరుడిని తలచుకుంటూ 144 ఏళ్ల తర్వాత వచ్చిన మహా పర్వానికి సంబరంగా సిద్ధమైంది తెలంగాణ ప్రజానీకం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరుగుతున్న గోదావరి తొలి పుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం తన యంత్రాంగం అంతటినీ తరలించింది. ప్రజల సౌకర్యార్థం భారీసంఖ్యలో ఘాట్లు, ప్రత్యేక బస్సులు, రైళ్లు, వైద్యఆరోగ్య సహాయకేంద్రాల ఏర్పాటు చేస్తోంది. పుష్కలంగా నీరు లేని చోట్ల గోదావరిలోకి నీటిని తరలించడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండడం విశేషం. పంచక్రోశ ఉత్తరవాహిని చెన్నూరు, త్రివేణీ సంగమ క్షేత్రం కాళేశ్వరంల నుంచి భద్రాచలం దాకా గోదావరిలో నీరు సంతృప్తికర స్థాయిలో ఉండగా.. రాష్ట్రంలో గోదావరి అడుగుపెట్టే నిజామాబాద్ జిల్లా కందకుర్తి నుంచి మంచిర్యాల వరకు మాత్రం తగినంత నీరు లేదు. రాష్ట్రంలో భద్రాచలం తర్వాత అత్యధికంగా రోజూ ఆరు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్న ధర్మపురిలోనూ అదే పరిస్థితి. ఆదివారానికి ఇక్కడ గోదావరి చిన్నపాయలా కొద్దిపాటి నీటితో పారుతోంది. ఎగువనున్న మహారాష్ట్రలో భారీవర్షాలు పడితేగాని ఇక్కడ నీరు రాదు. బాసరలో ఒక ఘాట్‌లోనే స్నానాలకు ఇబ్బంది లేకుండా నీరుంది. మహారాష్ట్రలో భారీగా వానలు పడడం; లేదా ఆ రాష్ట్ర ప్రభుత్వం నీరు వదిలితేనే బాసర ఘాట్లలో నీరు చేరుతుంది. పుష్కరాలకు వస్తున్న ప్రజల కోసం ఎగువనున్న ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రను అభ్యర్థించింది. అయినా ఇప్పటివరకు నీటి విడుదల సూచనలు కనిపించడం లేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం తన ప్రయత్నాలు తాను ప్రారంభించింది. సోన్, ఖానాపూర్, ధర్మపురి, గూడెం, మంచిర్యాలల్లో స్నానాలకు ఇబ్బంది లేకుండా ఎస్సారెస్పీ నుంచి రోజుకు 3వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. 14 రోజుల్లో మొత్తం 3.89 టీఎంసీల నీటిని వదిలే అవకాశముందని సమాచారం. అలాగే కడెం ప్రాజెక్టు నుంచి కూడా నీటిని వదులుతున్నారు. శనివారం 3వేల క్యూసెక్కులు వదిలారు. వానలు పడకుంటే రోజూ ఇదే సంఖ్యలో వదిలే అవకాశముంది. ఆదివారం నాలుగు వేల క్యూసెక్కులు విడిచిపెట్టారు. సోమవారం సాయంత్రం, లేదా రాత్రికి ఈ నీరు ధర్మపురికి చేరుకునే అవకాశం ఉంది.తొలుత యతిస్నానం... వెంటనే రాజస్నానంమంగళవారం ఉదయం 6.21 నుంచి 6.26 నిమిషాల మధ్య సింహరాశిలోకి బృహస్పతి ప్రవేశంతో గోదావరి నదికి పుష్కర పర్వణి ఆరంభమవుతోంది. ఏడాది పాటు సాగే ఈ పర్వణిలో ఆది పుష్కరంగా భావించే తొలి 12 రోజులు, అంత్య పుష్కరంగా పిలిచే తుది 12 రోజులను (వచ్చే ఏడాది) విశిష్టంగా పరిగణిస్తారు. ముక్కోటి దేవతలతోపాటు పితృదేవతలంతా కూడా స్నానమాచరించే ఈ వేళలో పుష్కర స్నానం చేయాలన్నదే భక్తుల తపన. అందుకే గోదావరి ఒడ్డునున్న ప్రాంతాలు, గ్రామాలు, దేవాలయాలు, పుణ్యక్షేత్రాలన్నీ పుష్కరశోభతో కళకళలాడుతున్నాయి. కొత్త ఘాట్లతో భక్తులకు ఆహ్వానం పలుకుతున్నాయి. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పుష్కరస్నానం చేయబోతున్నారు. సోమవారం సాయంత్రమే ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా ధర్మపురి చేరుకుంటున్నారు. సంప్రదాయం ప్రకారం ఉదయం పర్వణి పుణ్యకాలం రాగానే తొలుత దేవతా స్నపనం ఉంటుంది. బ్రహ్మకలశ స్థాపన చేసి గోదావరి జలాల్ని ఆవాహన చేసి ధర్మపురి నృసింహస్వామికి అర్చకులు అభిషేకం చేస్తారు. ఆ తర్వాత యతి స్నానం ఉంటుంది. పుష్పగిరి పీఠాధిపతి విద్యా నృసింహభారతి, హంపి విరూపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతి, రాంపూర్ గురు మదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద సరస్వతి, రాఘవేంద్రమఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థలు ధర్మపురిలోని గోదావరిలో స్నానమాచరించి వస్తారు. వారు ఎదురు వస్తుండగా ముఖ్యమంత్రి దంపతులు పుష్కరస్నానానికి వెళతారు.సీఎం పర్యటకు విస్తృత ఏర్పాట్లుసీఎం కేసీఆర్ ధర్మపురి రాక సందర్భంగా విసృత ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ధర్మపురిలో ఆయన ఆదివారం విలేకర్లకు సీఎం పర్యటన వివరాలను వెల్లడించారు. 'ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం 5 గంటలకు ధర్మపురికి ప్రత్యేక హెలికాప్టర్లో వస్తారు. ఐదుగురు పీఠాధిపతులను కలిసి ఆశీర్వాదాలు తీసుకుంటారు. రాత్రి ధర్మపురిలోని హరిత హోటల్లో బస చేస్తారు. 14న ఉదయం 5.45కు దేవస్థానానికి చేరుకొని పుష్కరాల ప్రారంభ శోభాయాత్రలో పాల్గొంటారు. 6.21 నిమిషాలకు గోదావరిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం పుష్కర స్నానం చేస్తారు. ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించి మొక్కులను తీర్చుకుంటారు. ఆ తర్వాత ఆలయ అభివృద్ధిపై అధికారులతో చర్చించి విలేకర్ల సమావేశంలో మాట్లాడతారు. తదనంతరం పుష్కరాల కోసం ఏర్పాటు చేసిన పైలాన్ వేదికను ప్రారంభిస్తారు' అని చెప్పారు.