తాండూరు, : జిల్లాలో పుష్కరాల తొలిరోజు భక్తులు పుణ్యస్నానాలకు జాతరలా తరలి వచ్చారు. తొలిరోజు సుమారుగా 2లక్షలకు పైగా భక్తులు జిల్లాలో పుణ్య ...
తాండూరు, : జిల్లాలో పుష్కరాల తొలిరోజు భక్తులు పుణ్యస్నానాలకు జాతరలా తరలి వచ్చారు. తొలిరోజు సుమారుగా 2లక్షలకు పైగా భక్తులు జిల్లాలో పుణ్య స్నానాలు ఆచరించారు. బాసర పుణ్యక్షేత్రంలో లక్ష మంది పుణ్యస్నానాలకు రాగా.. మంచిర్యాలలో 50వేలకు పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. చెన్నూరులో 15వేల మంది, గూడెం సత్యనారాయణ స్వామి సన్నిధి, లక్షెట్టిపేటలో కలిపి 10వేల మంది పుణ్య స్నానాలాచరించారు. మొదటి రోజునే భక్తులు పెద్దఎత్తున పుణ్యస్నానాలకు తరలిరావడంతో గోదారమ్మ పులకించిపోయింది. మంగళవారం ఉదయం పుష్కరాలు ప్రారంభ ముహూర్తం తర్వాత అన్ని ఘాట్లలోనూ భక్తుల తాకిడి కనిపించింది. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఘాట్ల వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది, అధికారులు ఎండ తీవ్రతకు ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం తర్వాత మంచిర్యాల, బాసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మిగిలిన చోట్ల మబ్బులతో వాతావరణం చల్లబడింది. జిల్లాలో మొదటి రోజునే పుష్కరాలకు భక్తులు పుణ్యస్నానాలకు వరుసలు కట్టడం కనిపించింది. జిల్లాలో అన్ని పుష్కర ఘాట్లతో పోలిస్తే గూడెం సత్యనారాయణ స్వామి సన్నిధిలో పుష్కర ఘాట్ వద్ద భక్తులు అసంతృప్తికి గురయ్యారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ పుణ్యస్నానాలకు వచ్చిన భక్తులను కేవలం జల్లు స్నానాలకే పరిమితం చేశారు. నదిలోని ఎవరినీ అనుమతించలేదు. కనీసం పిండప్రధానం తర్వాత పిండాలను నదిలో వేయడానికి అనుమతి ఇవ్వకపోవడంతో భక్తులు, పురోహితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం సమయంలో ఇక్కడ స్నానాలకు వచ్చిన వారి సంఖ్య ఎక్కువగానే కనిపించినా ఇలాంటి అసౌకర్యాలతో భక్తులు రాయపట్నం ఘాట్‌కు వెళ్లారు. అవతలి ఒడ్డుకు కరీంనగర్ జిల్లా రాయపట్నం ఘాట్‌లో ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో ఇక్కడికి వచ్చిన భక్తులు తిరిగి వెళ్లారు. ఇది గమనించిన ఇక్కడి ప్రత్యేకాధికారులు రెండోరోజు నుంచి గోదావరి నదిలో పిండాలు వదిలేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ప్రారంభిచారు. గూడెం వద్ద గోదావరి నదిలో లోతైన ప్రమాదకర స్థలాలుండటంతో భక్తులను నేరుగా నదిలోనికి అనుమతించలేదని అధికారులు తెలిపారు. దీంతో ఇక్కడ భక్తులకు కేవలం జల్లు స్నానాలేకే పరిమితమైంది.