(7 Jul) సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఈ నెల ఒకటో తేదీన బాబ్లీ ప్రాజెక్టు నుంచి దిగువనకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులోకి ఆశించిన స్థాయి...
(7 Jul) సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఈ నెల ఒకటో తేదీన బాబ్లీ ప్రాజెక్టు నుంచి దిగువనకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులోకి ఆశించిన స్థాయిలో నీళ్లు చేరకపోవడంతో ఒక్క రోజులోనే బాబ్లీ ఖాళీ అయింది. అందులో ఉన్న 0.17టీఎంసీ నీరు దిగువనకు ప్రవహించింది. బాసర నుంచి ఎస్సారెస్పీ వరకు నీళ్లు ఆగే పరిస్థితులు లేకపోవడంతో వచ్చిన నీరంతా దిగువన ఉన్న ఎస్సారెస్పీలో చేరింది. ప్రస్తుతం ప్రతికూల వాతావరణమే కనిపిస్తున్నా.. అధికారులు సకాలంలో మేల్కొనలేదు. బాబ్లీ నుంచి దిగువనకు నీటి విడుదల కంటే ముందే వచ్చే నీటిని ఏ విధంగా నిల్వ చేసుకోవాలో ప్రత్యామ్నాయ చర్యలవైపు దృష్టి సారించలేదు. పుష్కరాలు మొదలయ్యే వరకైనా వర్షాలు వస్తాయనే ఆశతోనే ఉన్నారు. 'పుష్కరాలను గట్టెక్కించడానికి దేవుడే ఉన్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి తుపాను వస్తుందని వాతావరణశాఖ చెబుతోంది. వర్షాల కోసమే ఎదురు చూస్తున్నాం'. అని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చెప్పారు. వర్షాలు రాకుంటే ప్రత్యామ్నాయం ఏం చేస్తారని ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అడుగగా.. మీరు కూడా విలేకర్లు అడిగినట్లు అడుగుతున్నారు. వర్షాలు వస్తాయనే ఆశిద్దాం అని ఐకే రెడ్డి చెప్పారు. నిజంగా వర్షాలు రాకపోతే ఏం చేయాలనే ప్రణాళికలేవీ అధికారులు సిద్థం చేసుకోలేదు. అన్ని రకాలైన ఏర్పాట్లు చేసినా.. పుణ్యస్నానాలకు నీళ్లులేకపోతే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో ఆలోచించడం లేదు. బాబ్లీ నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు ముందుగానే తెలిసినా.. కనీసం ఘాట్ల వద్దనైనా నీటిని ఆపేందుకు ప్రయత్నాలేవీ చేయలేదు. పుష్కరాల గడువు సమీపిస్తుండటంతో ఇప్పుడు మేల్కొన నీటిపారుదలశాఖ అధికారులు బాసర దిగువన గోదావరిపైన అయిదు అడుగుల మేరకు రాళ్లతో అడ్డుకట్ట ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. పుష్కరాల పనుల తీరుపైన మంత్రి హరీశ్‌రావు అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి పారుదలశాఖ ఎస్ఈ భగవంతరావు మాత్రం ఎస్సారెస్పీ ఎగువన ఉన్న ఏడు పుష్కరఘాట్ల వద్ద నీళ్లు లేవని.. గోదావరిపైన అయిదు అడుగుల మేరకు రాతికట్టడం ద్వారా నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉందని.. అందుకు ప్రభుత్వం అనుమతివ్వాలని కోరారు. వాస్తవానికి ఈ ఆలోచన బాబ్లీ నుంచి నీరు దిగువనకు పోకముందే చేసిఉంటే ఇప్పుడు బాసరతో పాటు దిగువన ఉన్న పుష్కర ఘాట్ల వద్ద స్నానాలు చేయడానికి అంతగా ఇబ్బందులు ఉండేవి కాదు. అధికారులు, పాలకులు కేవలం వరుణుడిపైనే భారం వేసి కాలయాపన చేశారే తప్ప.. వర్షాలు రాకుంటే ప్రత్యామ్నాయం ఏమిటనేదానిపైన దృష్టి సారించలేకపోయారు. ఇప్పటికే పుష్కర పనులు పూర్తిచేయలేక చతికిలపడ్డ అధికారులు ఈ ప్రత్యామ్నాయ చర్యలు ఎంతవరకు సఫలీకృతం చేస్తారో వేచిచూడాలి. ఇప్పటి వరకు పుష్కర స్నానాలకు వరుణుడిపైనే భారం వేసిన నేతలు, అధికారుల్లో ఇప్పుడు ఆందోళన మొదలైంది. ప్రత్యామ్నాయం ఏమిటనేదానిపైన దృష్టి సారించారు. తెలంగాణ ప్రాంతంలో కేవలం మన జిల్లాలోని ఏడు పుష్కరఘాట్ల వద్ద మాత్రమే పుణ్యస్నానాలకు నీళ్లు లేవు. ఇప్పుడు ఇక ప్రత్యామ్నాయంగా కేవలం మహారాష్ట్రనే కనిపిస్తోంది. పుష్కరాల వరకు వర్షాలు కురిస్తే.. సంతోషమే కానీ.. వర్షాలు కురవకపోతే మాత్రం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నీళ్లు రప్పించుకోవడం ఒక్కటే మార్గం. అందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అక్కడి ప్రభుత్వానికి లేఖ రాసింది. అయినా.. ఆ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లబించలేదు. పుష్కరాల సమయం సమీపించడం.. గోదావరిలో నీళ్లు లేక రోజు రోజుకు గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంపైన ఒత్తిడి పెంచే ప్రయత్నాలు మొదలు పెట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నీళ్లు రప్పించే ప్రయత్నం చేస్తామని హరీశ్‌రావు తెలియజేయడం కొంతమేరకు ఆశలు రేకెత్తిస్తోంది.