-మిసైల్ మ్యాన్‌కు కన్నీటి వీడ్కోలు.. రామేశ్వరంలో అంత్యక్రియలు పూర్తి -హాజరైన ప్రధాని మోదీ, రాహుల్.. కేంద్ర మంత్రులు, పలు రాష్ర్టాల సీఎ...
-మిసైల్ మ్యాన్‌కు కన్నీటి వీడ్కోలు.. రామేశ్వరంలో అంత్యక్రియలు పూర్తి
-హాజరైన ప్రధాని మోదీ, రాహుల్.. కేంద్ర మంత్రులు, పలు రాష్ర్టాల సీఎంలు
-చివరిచూపుకోసం వేల సంఖ్యలో తరలివచ్చిన జనం
-మాజీ రాష్ట్రపతికి త్రివిధ దళాల చివరి శాల్యూట్
అఖండ భారతావనినుంచి కడపటి వీడ్కోలు తీసుకుని.. బదులుగా స్ఫూర్తిని చిమ్ముకుంటూ మిస్సైల్ మ్యాన్ నింగికెగిశాడు! సవాళ్ల నడుమ సాగించిన ప్రయాణాన్ని ముగించి.. వైజ్ఞానిక ప్రపంచంలో తనదైన.. విశిష్ట స్థానాన్ని నిలుపుకొని.. కనుమరుగైపోయాడు! తన కలల భారతాన్ని దేశ యువత చేతిలో పెట్టి.. వాటిని ఆచరణలోకి తేవాలని బాధ్యతనిచ్చి.. సెలవు తీసుకున్నాడు! వేల మంది అశ్రుధారల మధ్య.. తన సొంత ఊరిలో నేల తల్లి ఒడికి చేరాడు! భారతదేశ చరిత్రలో ఏపీజే అబ్దుల్ కలాం అధ్యాయం ముగిసింది! మరెప్పుడో.. మరెక్కడో.. ఏ తరగతి గదిలోనో.. ఏ ప్రయోగశాలలోనో మరో అమేయ మేధస్సు చిగురించేదాకా.. ఇది కలాం శకం!!
రామేశ్వరం, జూలై 30: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాంకు వేలమంది ప్రజలు, నాయకులు కన్నీటితో తుది వీడ్కోలు పలికారు. ఈ నెల 27న మేఘాలయలోని షిల్లాంగ్‌లో గుండెపోటుతో మరణించిన కలాంకు తమిళనాడులోని ఆయన స్వస్థలం రామేశ్వరంలో గురువారం ఉదయం అంత్యక్రియలు జరిగాయి. ప్రత్యేక ప్రార్థనల అనంతరం రామేశ్వరం సమీపంలోని పైకరుంబులో పూర్తి సైనికలాంఛనాల మధ్య ముస్లిం సంప్రదాయం ప్రకారం కలాం భౌతికకాయాన్ని ఖననం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతోపాటు పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. కలాంకు త్రివిధ దళాలు చివరి వందనం సమర్పించాయి. ప్రియతమ నేతకు పార్లమెంటు ఘనంగా నివాళులర్పించింది.
రామేశ్వరం శోకసంద్రం
గొప్ప మానవతావాదిగా, జీవితాంతం కార్యసాధనకోసం యువతలో స్ఫూర్తి రగిలించిన అబ్దుల్‌కు దేశం బరువెక్కిన హృదయాలతో వీడ్కోలు పలికింది. కలాం చివరిచూపుకోసం దేశవిదేశాల నుంచి తరలివచ్చిన వేలమంది ప్రజలతో రామేశ్వరం, దాని పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. జాతీయ జెండాలు చేతబట్టి యువత భారత్ మాతాకీ జై అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. కలాంను దూరం నుంచైనా చూడాలన్న కోరికతో వందలమంది జనం ఇండ్లు, చెట్లపైకి ఎక్కటంతో ఎటుచూసినా జనమే కనిపించారు. ప్రియతమ నాయకుడికి తుది వీడ్కోలు పలికేందుకు దేశం నలుమూలల నుంచి అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చారు. అమెరికా తదితర విదేశాల నుంచి కూడా కలాం విద్యార్థులు, ఆయన వల్ల ప్రేరణ పొందినవారు బుధవారమే రామేశ్వరం చేరుకున్నారు.
వందలమంది జనం బుధవారం రాత్రంగా రోడ్లపైనే గడిపారు. కలాం అంతిమయాత్ర గురువారం ఉదయం 7.30 గంటల సమయంలో ప్రారంభమైంది. భౌతికకాయాన్ని స్థానిక మసీదుకు తీసుకెళ్లి మౌల్వీ ఎస్ఎం అబ్దుల్ రహమాన్ నేతృత్వంలో నమాజ్ ఈ జమాజా నిర్వహించారు. అనంతరం కలాం కుటుంబసభ్యులు, మతపెద్దలు పైకరుంబులోని ఒకటిన్నర ఎకరాల్లో సిద్ధంచేసిన శ్మశానవాటికకు భౌతికకాయాన్ని తరలించారు. అక్కడ ప్రధాని సహా ప్రముఖులంతా నివాళులర్పించిన తర్వాత 11 గంటల సమయంలో మరోసారి ప్రార్థనలు నిర్వహించారు. సైనిక దళాలు తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించిన తర్వాత కలాం భౌతికకాయాన్ని ఖననం చేశారు.
ప్రధాని నివాళులు
అబ్దుల్‌కలాం అంత్యక్రియలకు ప్రధాని నరేంద్రమోదీ హాజరై దేశం గర్వించదగ్గ ఆ శాస్త్రవేత్తకు నివాళులర్పించారు. గురువారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో మండపం చేరుకున్న ఆయన అక్కడి నుంచి కారులో రామేశ్వరం వెళ్లారు. పైకరుంబులో కలాం భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. దుఃఖసాగరంలో మునిగిపోయిన కలాం అన్నయ్య మొహమ్మద్ ముథు మీరన్ ల్బ్బై మరైకర్ (99)ను ఓదార్చారు. మాజీ రాష్ట్రపతికి తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య, కేంద్ర మంత్రులు మనోహర్ పారికర్, వెంకయ్యనాయుడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఊమెన్‌చాందీ, సిద్దరామయ్య, చంద్రబాబు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆ పార్టీ నేత గులాంనబీ ఆజాద్, కేరళ సీపీఎం సీనియర్ నేత వీఎస్ అచ్యుతానందన్, తమిళనాడు రాష్ట్ర మంత్రులు నివాళులర్పించారు. త్రివిధ దళాల అధిపతులు కూడా కలాంకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రముఖుల రాక సందర్భంగా రామేశ్వరం చుట్టూ పటిష్ఠ భద్రతా వలయాన్ని సృష్టించారు. పట్టణం చుట్టూ సముద్రంలో నౌకాదళం, కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియలకు హాజరైన ప్రజలకు రామకృష్ణమఠ్, రోటరీక్లబ్ తదితర స్వచ్ఛంద సంస్థలు ఆహారం, తాగునీరు సరఫరా చేశాయి. కలాం గౌరవార్థం తమిళనాడులో బందుకు పిలుపునివ్వడంతో రాష్ట్రం స్తంభించిపోయింది.
కలాంకు పార్లమెంటు ఘన నివాళి
శాస్త్రసాంకేతికరంగంలో భారత్‌ను ప్రపంచ యవనికపై నిలిపిన అబ్దుల్‌కలాంకు పార్లమెంటు ఉభయసభలు ఘనంగా నివాళులర్పించాయి. కలాం అంత్యక్రియల సందర్భంగా లోక్‌సభను గురువారం ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా శుక్రవారానికి వాయిదా వేయగా, రాజ్యసభను మధ్యాహ్నం 2గంటలవరకు వాయిదా వేశారు. లోక్‌సభ ప్రారంభం కాగానే కలాం అంత్యక్రియల సందర్భంగా స్పీకర్ సుమిత్రామహాజన్ సంతాప సందేశం వినిపించారు. ఇటీవల మరణించిన లోక్‌సభ మాజీ సభ్యులు శ్రీభల్లవ్ పాణిగ్రాహి, ఆర్ఎస్ గవాయ్, బీకే హండిక్లకు కూడా సభ సంతాపం తెలిపింది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన ఎస్పీ బల్జీత్‌సింగ్, హోంగార్డులు సుఖ్‌దేవ్‌సింగ్, బోధ్‌రాజ్, దేశ్రాజ్ తదితరులందరి పేర్లను స్పీకర్ చదవి వినిపించి, వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. తరువాత సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ కూడా గురుదాస్‌పూర్ దాడిని తీవ్రంగా ఖండించి, మృతులకు శ్రద్ధాంజలి ఘటించింది. అనంతరం అబ్దుల్ కలాం అంత్యక్రియలు జరుగుతున్నందున అవి పూర్తయ్యేవరకు సభను మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ హమీద్ అన్సారీ ప్రకటించారు.
అసోంలో కలాం ఇన్నోవేషన్ సెంటర్
-బీహార్ వ్యవసాయ కాలేజీకి కలాం పేరు
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గౌరవార్థం అసోంలో ఏపీజే అబ్దుల్‌కలాం సెంటర్ ఫర్ ఇన్నోవేషన్‌ను ఏర్పాటుచేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్‌గొగోయ్ ప్రకటించారు. అసోంతోపాటు ఈశాన్య రాష్ర్టాల యువతలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సృష్టి, నవకల్పనలు, సృజనాత్మకతను పెంపొందించేందుకు ఈ సెంటర్‌ను త్వరలోనే ఏర్పాటుచేస్తామని గురువారం ఆయన తెలిపారు. కలాం గౌరవార్థం బీహార్‌లోని కిషన్‌గంజ్ వ్యవసాయ కళాశాలకు ఆయన పేరు పెట్టాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర రాజధాని పాట్నాలో నిర్మించతలపెట్టిన సైన్స్ సిటీకి కూడా కలాం పేరు పెట్టాలని నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర కో ఆర్డినేషన్ విభాగం ప్రిన్సిపల్ కార్యదర్శి శిశిర్‌కుమార్ సిన్హా గురువారం తెలిపారు. కాగా, కలాం గౌరవార్థం ఆగస్టు 2న ఆదివారం కేరళలోని ప్రభుత్వ కార్యాలయాలకు పనిదినంగా ప్రకటించటంపై సందిగ్ధం నెలకొంది.