(7 Jul) గోదావరి పుష్కరాల గడువు సమీపిస్తున్నా పనులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గుత్తేదారులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పుష్కరాలు ...
(7 Jul) గోదావరి పుష్కరాల గడువు సమీపిస్తున్నా పనులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గుత్తేదారులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పుష్కరాలు మొదలయ్యే నాటికి కూడా పనులు పూర్తయ్యే పరిస్థితులు కనిపించడంలేదు. ఇప్పటికే పలు మార్లు గడువు పెంచిన ప్రభుత్వం గుత్తేదారులకు మరో అవకాశాన్ని కల్పించింది. ఈ నెల పదోతేదీ అర్ధరాత్రి వరకు ఆఖరు గడువు విధించింది. 11వ తేదీన పనుల తీరుపైన జిల్లాలో మంత్రులు హరీశ్‌రావు, జోగురామన్న బాసర నుంచి చెన్నూరు అన్ని పుష్కర ఘాట్లను పరిశీలించనున్నారు. ఈ నెల 14నుంచి 25వ తేదీ వరకు జిల్లాలో 30చోట్లా 34 పుష్కరఘాట్ల పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రతి పుష్కరఘాట్‌కు వెళ్లడానికి రహదారులు, స్నానఘట్టాలు, మూత్రశాలలు, తాగునీరు వంటి అనేక వసతులు కల్పించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రహదారుల నిర్మాణ పనులను ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఘాట్ల పనులు నీటిపారుదల, తాగునీరు, మూత్రశాలలు, స్నానపుగదులు వంటివి ఆర్ డబ్ల్యూఎస్ , పారిశుద్ధ్యం పంచాయతీ, విద్యుత్తు ట్రాన్స్‌కోకు అప్పగించారు. దేవాలయాల్లో అభివృద్ధి పనులను ఆశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆయా పనులను దక్కించుకున్నగుత్తేదారులకు కుదిరిన ఒప్పందం ప్రకారం గత నెల 15వ తేదీ నాటికీ పూర్తిచేయాలి. కానీ.. గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా పనులు పూర్తికాకపోవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని గత నెలాఖరు వరకు గడువు పొడిగించారు. అయినా.. పనులు పూర్తిచేయలేదు. దీంతో మళ్లీ ఈ నెల 10వ తేదీ వరకు గడువు పెంచారు. ఆ రోజు అర్ధరాత్రి తర్వాత ఏ చిన్నపని కూడా ఇంకా మిగిలి ఉండటానికి వీల్లేదని మంత్రి హరీశ్‌రావు గట్టిగా చెప్పారు. అడిగినన్ని నిధులు ఇస్తామని.. పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో శ్రద్ధ వహించాలని చెప్పారు. ఇప్పటి వరకు ప్రగతి నివేదికలను బట్టి పురోగతిని తెలుసుకున్న ప్రభుత్వం ఇక నుంచి నేరుగా పనుల తీరును తెలుసుకునేందుకు సిద్ధమైంది. ప్రతి జిల్లాకు ఒక సీఈ ను కేటాయించారు. మన జిల్లాకు కేటాయించిన చీఫ్ ఇంజినీర్ బాసరలో ఉండి పనుల తీరును పరిశీలిస్తారు. జిల్లా కేంద్రంలో కాకుండా ఘాట్లపైనే విధులు నిర్వహిస్తారు. జిల్లా పాలనాధికారికి , ప్రభుత్వానికి వారధిగా సీఈ పనిచేస్తారు. ఎక్కడైతే పనులు వేగంగా లేవో అక్కడ దృష్టి సారిస్తారు. 10వ తేదీ నాటికి పనులు పూర్తిచేయడానికి గుత్తేదారులకు మరో అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వం 11వ తేదీ నుంచి పనుల పరిశీలనకు మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. ప్రతి జిల్లాకు ఇద్దరేసి చొప్పున మంత్రులను కేటాయించారు. జిల్లాలో జరుగుతున్న పనుల పరిశీలనకు మంత్రులు హరీశ్‌రావు, జోగురామన్నలు తనిఖీ చేయనున్నారు. జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఖమ్మం జిల్లాలో జరుగుతున్న పనుల పరిశీలన భాద్యతలు ఇచ్చారు. మంత్రులు వచ్చే నాటికీ అన్ని రకాలైన పనులు పూర్తిచేయాలని గట్టిగా హెచ్చరించడంతో అధికారులు పనుల్లో వేగాన్ని పెంచే యోచనలో ఉన్నారు. పుష్కరాల సందర్భంగా అవసరమయ్యే అధికారులు, సిబ్బందిని వెంటనే తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 12, 13వ తేదీల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ డిప్యూటేషన్లు తీసుకోవద్దని తేల్చిచెప్పడంతో ఆ లోగానే కార్యక్రమాన్ని ముగించడానికి అధికార యంత్రాంగం నడుం బిగించింది. ముఖ్యమైన ఘాట్ల వద్ద మంగళవారం నుంచే మున్సిపాలిటీ కమిషనర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లకు బాధ్యతలు కట్టబెట్టనున్నారు. పుష్కరాలు జరగనున్న ఘాట్లకు సమీపంలో ఉన్న పట్టణాలను అందంగా అలంకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రహదారి వెంట ఉండే కంపచెట్లను తొలగించి పట్టణాల్లో వీధిదీపాలు, పచ్చని చెట్లు, పెక్లీలతో సుందరంగా తీర్చిదిద్దనున్నారు. పార్కింగ్ స్థలాల్లో, ఘాట్ల వద్ద ఆంగ్లం, హిందీ, తెలుగు భాషల్లో సూచికబోర్డులను ఏర్పాటు చేయనున్నారు. గత పుష్కరాల కంటే ఈ సారి నాలుగైదు రేట్లు అధికంగా భక్తులు రావచ్చని ప్రభుత్వం భావిస్తోంది. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమైన ప్రాంతాల్లో వసతి ఏర్పాటు చేయనున్నారు. వాస్తవానికి బాసరలో ఉన్న అతిథిగృహాలను అధికారులకే సరిపోక.. ప్రైవేటు లాడ్జీలు, సత్రాలను 50శాతం వారికే కేటాయించాల్సి వచ్చింది. కనీసం రాత్రివేళల్లో వచ్చే భక్తులకు బహిరంగ ప్రదేశాల్లోనైనా కింద కార్పెట్లు, షామియానాలు ఏర్పాటు చేసి విశ్రాంతి తీసుకునే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం జిల్లా అధికారులకు సూచించింది. పుష్కరాలను గొప్పగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా.. అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా పనులు మందకొడిగా సాగుతున్నాయి. పాలనాప్రాంగణం: మంత్రి హరీశ్‌రావుతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాపాలనాధికారి జగన్మోహన్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని మంత్రికి వివరించారు. భక్తులకు ఇబ్బందులకు కలగకుండా సహాయకేంద్రాలను ఏర్పాటు చేసి తగు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సిబ్బందిని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ పనసారెడ్డి, డీఆర్వో సంజీవరెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల ఆర్డీవోలు సుధాకర్‌రెడ్డి, అయేషా, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఇంద్రసేన్ తదితరులు పాల్గొన్నారు.