(6 Jul) తొలకరి పలకరించింది.. పుడమి తల్లి పులకించింది. ఖరీఫ్ సాగు మొదలైంది.. విత్తుకోవడం దాదాపు పూర్తయింది. కానీ బ్యాంకర్లు మాత్రం రైతుల ...
(6 Jul) తొలకరి పలకరించింది.. పుడమి తల్లి పులకించింది. ఖరీఫ్ సాగు మొదలైంది.. విత్తుకోవడం దాదాపు పూర్తయింది. కానీ బ్యాంకర్లు మాత్రం రైతుల అవసరం మేరకు రుణాలను అందించలేకపోయారు. పంట రుణాలివ్వాలని బ్యాంకులు భారీగా లక్ష్యాలను నిర్దేశించుకున్నా ఆ మేరకు ఇవ్వడం లేదు. రుణ మాఫీకి, రుణాల మంజూరుకు జతచేయడంతో రైతులకు సకాలంలో లభించని పరిస్థితి నెలకొంది. ఫలితంగా సాగు పెట్టుబడులకు దళారులపై ఆధారపడాల్సి వస్తోంది. రుణ మాఫీకి సంబంధించి రెండో విడత డబ్బు(25 శాతం)ను జమ చేయాల్సిన ప్రభుత్వం అందులో సగం (12.5 శాతం) మాత్రమే విడుదల చేసింది. ఎంతో కొంత జమ కావడంతో బ్యాంకర్లు రుణాల మంజూరు ప్రక్రియను మొదలుపెట్టారు. అయితే ఈ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇప్పటి వరకు 10 శాతం మాత్రమే రుణాలు ఇచ్చారు. జిల్లాలో ఈ ఏడాది జూన్ నెలలోనే వర్షాలు కురవడంతో ఖరీఫ్ సాగు వూపందుకుంది. ఇప్పటికే 3.92 లక్షల హెక్టార్లలో పంటలు సాగైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పంట సాగుకు కావాల్సిన ఎరువులు, పురుగు మందులు, కూలీలకు తదితరాలకు పెట్టుబడి అవసరం. రెండోవిడతగా ప్రభుత్వం జమ చేయాల్సిన 25 శాతంలో 12.5 శాతమే జమ చేయడంతో ఆ డబ్బులు గతేడాది తీసుకున్న రుణం వడ్డీకే సరిపోయిందని రైతులంటున్నారు. గతంతో పోలిస్తే జిల్లాలో పంట రుణాల లక్ష్యం భారీగా పెంచినా ఆ మొత్తం రైతులకు చేరితేనే ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. లక్ష్యం భారీగా పెంచిన బ్యాంకులు రుణమంజూరులో జాప్యం చేస్తుండటంతో గడువులోగా రైతులకు రుణాలు అందడం లేదు. గతేడాది రూ.2228 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా సీజన్ చివరి వరకు కేవలం రూ.1600 కోట్లు ఇచ్చారు. ఏడాది మొత్తంలో నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలను ఇవ్వలేకపోయారు. గతేడాది రుణ మాఫీ మొత్తం ఆలస్యంగా రావడంతో రుణాల పునరుద్ధరణలో జాప్యం జరిగింది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి నెలకొంది. రుణమాఫీ డబ్బులు తాజాగా జమ చేయడంతో ఇప్పుడిప్పుడు మంజూరు ప్రక్రియను మొదలు పెట్టారు. జిల్లా మొత్తంలో ఇప్పటి వరకు రూ.250 కోట్లు మాత్రమే రుణాలు అందాయి. ఇందులో ఎక్కువ భాగం గ్రామీణ బ్యాంకులు రూ.214 కోట్లు మంజూరు చేయగా, మిగిలిన బ్యాంకులు రూ.36 కోట్లు మాత్రమే ఇచ్చాయి. సీజన్ మొదలైనా బ్యాంకులు రుణ మంజూరును వేగవంతం చేయకపోవడంతో విత్తనాలు, ఎరువులను దళారుల దగ్గర తీసుకుంటున్నారు. నిబంధన ప్రకారం గతంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లిస్తేనే ఈ ఏడాది తిరిగి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తాయి. గత ఏడాది 90 శాతం మంది రైతుల రుణాలు కేవలం పునరుద్ధరణకు నోచుకున్నాయి. ఈ ఏడాది సంబంధిత రైతులకు రుణాలు అందాలంటే గత ఏడాది బాకీ చెల్లిస్తేనే తిరిగి కొత్తగా రుణం ఇస్తారు. వాస్తవంగా సీజన్ ప్రారంభంలో రుణ మంజూరు ప్రక్రియను మొదలుపెడితే జూన్, జులై నెలాఖరులోగా రైతుల చేతికి డబ్బులు అందుతాయి. అలాంటిది ఈ ఏడాది జులై నెల ప్రారంభమైనా నిర్దేశించిన లక్ష్యంలో పది శాతం మాత్రమే రుణాలు ఇచ్చారు. జిల్లాలో రైతుల సంఖ్య - 4.54 లక్షల మంది రుణమాఫీ పొందిన రైతులు- 3.09 లక్షల మంది రుణ మాఫీ మొత్తం- రూ.1462.13 కోట్లు మొదటి విడత జమ- రూ.365.53 కోట్లు (25శాతం) రెండో విడత జమ- రూ.182.76 కోట్లు (12.5శాతం) రుణాల అవసరం- రూ.5000.00 కోట్లు గత ఏడాది లక్ష్యం- రూ.2228.60 కోట్లు ఇచ్చింది- రూ.1603 కోట్లు ఈ ఏడాది బ్యాంకుల లక్ష్యం- రూ.2,553 కోట్లు ఇప్పటి వరకు ఇచ్చింది- రూ.250 కోట్లు రైైెతుల గత బకాయిలను మాఫీ చేసిన ప్రభుత్వం రుణమాఫీ పథకం కింద విడతల వారీగా బ్యాంకుల్లో జమ చేస్తోంది. ఇందులో భాగంగా తొలివిడతగా రుణమాఫీ మొత్తంలో 25 శాతం విడుదల చేయగా గత ఏడాది రైతులకు రుణాలు ఇచ్చారు. ఈ ఏడాదికి చెందిన రెండో విడత 25 శాతం డబ్బులు మంజూరు చేయాల్సి ఉండగా ప్రభుత్వం అందులో సగం(12.5శాతం) విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండో విడతలో జిల్లాకు చెందిన 3.09 లక్షల మంది రైతులకు 25 శాతం చొప్పున రూ.365.52 కోట్లు జమకావాలి. కానీ అందులో సగం అంటే 12.5 శాతం చొప్పున జిల్లాకు రూ.182.76 కోట్లు విడుదల అయ్యాయి. వీటిని బ్యాంకుల వారీగా జమ చేయడంతో ఈ ఏడాదికి చెందిన రుణమంజూరు ప్రక్రియ మొదలయింది. అయితే ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ మొత్తం, గత ఏడాది రైతులు తీసుకున్న రుణానికి చెందిన వడ్డీకే సరిపోతోంది. ఏకకాలంలో మాఫీ కాకపోవడంతో రైతులు రుణమాఫీ ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు. జిల్లాలోని బ్యాంకర్లు రుణమాఫీ పథకం కింద లబ్ధి పొందే రైతుల జాబితా తయారీకి భారీగా కసరత్తు చేసి చివరికి 3.16 లక్షల మంది రైతులకు చెందిన పాత బకాయిలు రూ.1556.54 కోట్లు మాఫీకి ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు ప్రభుత్వం వాటిని మాఫీచేసి అందులో 25 శాతం కింద రూ.387.16 కోట్లు విడుదల చేసింది. వీటిని రైతుల వారీగా జమ చేశారు. ఈ ప్రక్రియలో కొంతమంది అనర్హులున్నట్లు గుర్తించి వారికి సంబంధించిన రుణమాఫీ డబ్బులను వెనక్కి పంపారు. జిల్లా మొత్తంలో 3.09 లక్షల మందిని అర్హులుగా గుర్తించి రూ.365.53 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ ఏడాది కూడా ఇదే లెక్కన రెండో విడత డబ్బులు రావాలి. అయితే గత ఏడాదికి సంబంధించి రుణమాఫీలో జిల్లాలో కొన్ని అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో వాటిపై కమిటీలతో విచారణ చేపడుతున్నారు. విచారణ నివేదికలు వచ్చే వరకు రెండో విడత డబ్బులు జమ చేయవద్దని తొలుత భావించారు. అయితే రుణ మంజూరు గడువు సమీపించడంతో 25 శాతంలో సగం విడుదల చేశారు. ప్రస్తుతం సొమ్మును బ్యాంకుల్లో జమ చేయడంతో రుణాల మంజూరు ప్రక్రియ మొదలైంది. గత ఆర్థిక సంవత్సరం(2014-15)లో ఖరీఫ్, రబీల్లో బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలపై వడ్డీ వసూలు చేయకూడదని వ్యవసాయ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వడ్డీ మాఫీ పథకం అమలులో ఉంది. ఆ తర్వాత దీనిపై స్పష్టత లేకపోవడంతో రైతులు వడ్డీమాఫీకి దూరమయ్యారు. గతంలోనూ రైతులు తీసుకున్న రుణ మొత్తం వడ్డీ సహా చెల్లిస్తే తిరిగి ప్రభుత్వం రైతుల పేరున వడ్డీ జమ చేసేది. కొన్ని బ్యాంకులు నిర్ణీత గడువులోగా చెల్లించిన వారినుంచి రుణ మొత్తాన్ని మాత్రమే తీసుకున్నాయి. ఒక్కో బ్యాంకు ఒక్కో తీరున వ్యవహరించడంతో గందరగోళం నెలకొంది. తాజాగా తెరాస ప్రభుత్వం వడ్డీ మాఫీ ఉత్తర్వులు జారీ చేయడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్న రుణం చెల్లింపు గడువు విషయంలో స్పష్టత లేదు. మార్చి 31లోగా చెల్లిస్తేనే వడ్డీ మాఫీ వర్తిస్తుందని కొన్ని బ్యాంకులు అంటున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం రుణం తీసుకున్న నెల నుంచి తిరిగి ఏడాదిలోగా అదే నెల వరకు వడ్డీ మాఫీ వర్తిస్తుందని అంటోంది. అయితే దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు బ్యాంకులకు జారీ చేయాలని రైతులు కోరుతున్నారు.