» హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక...
» హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టును అడ్డుకోవడానికి బాబు ప్రయత్నాలు చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టును అడ్డుకుంటే పాలమూరు ప్రజల ఉసురుతాకుతుందని శాపనార్థాలు పెట్టారు. హరీష్ రావు ఏమన్నారో ఆయన మాటల్లోనే.. వలసలు..ఆకలతో అలమటిస్తున్నారు... ''పాలమూరు జిల్లాలో 16 లక్షల మంది వలసలు పోతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. భారత దేశంలో ఏదైనా ప్రాజెక్టు కట్టాలంటే మొట్టమొదటి కట్టాల్సిన ప్రాజెక్టు ఇది. పేదరికం..వలసలు..తాగునీటి, ఫ్లోరైడ్..ఇతరత్రా అవసరాల మీద ప్రాజెక్టులు కడుతారు. జిల్లాకు సాగునీరు అందించి..ఆకలి తీర్చాలని ఇంతకాలం ఎవరు చేయని పనిని పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తే దానిని అడ్డుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కిరణ్ హాయాంలోనే జీవో... కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న హాయంలో జీవో నెంబర్ 72(08-08-2013)లో జీవో ఇచ్చారు. ఈ జీవో చెల్లదా ? జీవోలో పేర్కొన్న విధంగా పది లక్షల ఎకరాలకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ వాసులకు తాగునీరు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టు రూపొందుతోంది. వీరికి నీళ్లు ఇవ్వవద్దని బాబు పేర్కొంటున్నారు. నీళ్లు లేకపోతే బాబు హెరిటేట్ పాలు తాగి బతుకుతాడు. కానీ ఇతర ప్రజల సంగతేంటి ? హైదరాబాద్ అభివృద్ధి కాకుండా బాబు కుట్రలు పన్నుతున్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకుంటే హైదరాబాద్ లోని ప్రజలు బాబును తరిమికొడుతారు. ద్రోహం చేశాడు... పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి బాబు లేఖ రాస్తున్నారు. తెలంగాణ ముఖ్య కార్యదర్శికి లేఖ రాస్తున్నారు. బాబు దత్తత తీసుకుని చేసింది ఏమీ లేదు. పలకలు..మొక్కలు నాటి ద్రోహం చేశారు. తెలంగాణ ద్రోహి. మహబూబ్ నగర్ జిల్లా వాసుల ద్రోహి. ఇంతకంటే ఏదైనా పదం ఉంటే అన్నా తక్కువే. కొత్త ప్రాజెక్టు అని బాబు మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు ప్రచారం చేర వేస్తున్నారు. నోటికాడ బుక్కను ఎత్తికొడుతున్నాడు. ఏ అనుమతి లేకుండా పట్టిసీమ ప్రాజెక్టు కడుతున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొందర పడలేదు. మూడో పంట కోసం పట్టిసీమను కట్టుకోవచ్చు కానీ ఒక్క పంట కోసం అల్లాడుతున్న పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టకూడదా ? ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తారా ? మనస్సున్న వారు ఇలా చేస్తారా ? అబద్ధాల్లో బాబుకు నోబెల్ బహుమతి ఇవ్వవచ్చు.'' అని హరీష్ రావు పేర్కొన్నారు.