గోదావరి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. జిల్లాలోని అన్ని ఘాట్ల వద్ద భక్తజన సందోహంతో గోదావరి కిటకిటలాడింది. నదిలో పుణ్యస్నానం ఆచరించిన భక్త...
గోదావరి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. జిల్లాలోని అన్ని ఘాట్ల వద్ద భక్తజన సందోహంతో గోదావరి కిటకిటలాడింది. నదిలో పుణ్యస్నానం ఆచరించిన భక్తులు చెంతనే ఉన్న ఆలయాల్లో దేవతామూర్తుల దర్శనం చేసుకుని భక్తిపారవశ్యమయ్యారు. వరుసగా మూడురోజులు సెలవులు రావడం, శుభ శుక్రవారం గంగమ్మకు ప్రసిద్ధి కావడంతో పుష్కర స్నానాలకు భక్తులు వరుస కట్టారు. భక్తుల రద్దీ కారణంగా బాసరలో అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. గోదావరి పుష్కరాల్లో నాలుగో రోజు శుక్రవారం భక్తుల తాకిడి ఎక్కువైంది. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా అన్ని ఘాట్ల వద్దకు భక్తులు భారీగా తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. గడచిన మూడు రోజులతో పోల్చితే జిల్లాలో బాసర మొదలుకొని చెన్నూరు వరకు అన్ని పుష్కర ఘాట్ల వద్ద భక్తుల తాకిడి పెరిగింది. బాసరకు మొదటి రోజు తరహాలోనే భక్తుల రద్దీ పెరిగింది. వేకువజాము నుంచి మధ్యాహ్నం వరకు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పుష్కరస్నానాలతో పాత ఘాట్ భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తుల రద్దీ పెరగడంతో కొత్తఘాట్ వద్ద ఏర్పాటుచేసిన జల్లుస్నానాల వద్ద కూడా వరుస కట్టారు. బాసర నుంచి రెండు వంతెనలను అవతలి వైపు దాదాపు 2 కి.మీ. వరకు భక్తులు పుష్కరస్నానాలు చేశారు. భక్తులు పుష్కర స్నానాల తర్వాత అమ్మవారి దర్శనం కోసం వరుస కట్టారు. భక్తుల రద్దీ పెరగడంతో దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పట్టింది. సాయంత్రం మూడు గంటల వరకు 1.20 లక్షల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు లెక్కలు వేశారు. మంచిర్యాలలో మిగిలిన రోజుల కంటే భక్తుల సంఖ్య పెరిగింది. సాయంత్రం 3 గంటల వరకు 50 వేల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. మహారాష్ట్ర నుంచీ భక్తులు వచ్చారు. ఇక్కడి పుష్కర ఘాట్‌ను ఎంపీ బాల్క సుమన్ పరిశీలించారు. గురువారం సాయంత్రానికే మంచిర్యాల చేరుకున్న చిన జీయర్ స్వామి బ్రహ్మయజ్ఞం కార్యక్రమాలను ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెన్నూరు ఉత్తరవాహిని గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. భక్తులు భారీగా తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. మధ్యాహ్నానికే 50 వేలకు పైగా భక్తులు వచ్చారని అంచనా. ఇక్కడ మెదక్ జిల్లా తొగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి పుష్కరస్నానం ఆచరించారు. నిర్మల్ మండలం సోన్ తీరానికి నీటి కళ వచ్చింది. రెండు ఘాట్లకు మధ్యాహ్నానికే 60 వేల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. ఉత్తర మఠ పీఠాధిపతి సత్యాత్మతీర్థస్వామి గోదావరిలో స్నానం చేసి ప్రత్యేక పూజలు కొనసాగించారు. గూడెంలో పోలీసుల ఆంక్షల మధ్యనే పుష్కరస్నానాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ జల్లు స్నానాలతోనే భక్తులు సరిపెట్టుకుంటున్నారు. గతం కంటే ప్రస్తుతం భక్తుల రద్దీ పెరిగింది. జన్నారం మండలంలో మూడు ఘాట్ల వద్ద భక్తుల రద్దీ పెరిగింది. బాదంపల్లి పుష్కరఘాట్ వద్ద మాజీ ఎంపీ రాఠోడ్ రమేశ్ పుష్కరస్నానం చేశారు. వసతులను ఆర్డీవో అయిషా మస్రత్ ఖానం పరిశీలించారు. కడెం మండలంలోని రెండు ఘాట్ల వద్దకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎస్సారెస్పీ నీళ్లు దిగువకు చేరడంతో కడెం ప్రాజెక్టు నుంచి నీటి విడుదలను తగ్గించారు. ప్రస్తుతానికి 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.