ఐదు రోజులుగా మునిసిపల్ ఉద్యోగులు తొమ్మిది రోజులుగా పంచాయతీ ఉద్యోగులు 24 రోజులుగా ఉపాధి హామీ సిబ్బంది హైదరాబాద్,: ఒకటి ముఖ్యమంత్రి కే...
ఐదు రోజులుగా మునిసిపల్ ఉద్యోగులు తొమ్మిది రోజులుగా పంచాయతీ ఉద్యోగులు 24 రోజులుగా ఉపాధి హామీ సిబ్బంది
హైదరాబాద్,: ఒకటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న శాఖ! మరొకటి ఆయన తనయుడు కేటీఆర్ చూస్తున్న శాఖ! ప్రస్తుతం ఈ ఇరువురి శాఖల పరిధిలోని ఉద్యోగులే ఆందోళన బాటపట్టారు. సమ్మెలో ఉన్నారు! తమ డిమాండ్లపై మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల్లోని ఉద్యోగులు పలుమార్లు సర్కారు దృష్టికి తెచ్చినా స్పందించకపోవడంతో సమ్మె బాట పట్టారు. వీరు మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులంతా ఇప్పుడు సమ్మెలోనే ఉన్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పని చేసే సిబ్బంది సమ్మె బాట పట్టి గురువారం నాటికి 24 రోజులు. గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల సమ్మె మొదలై 9 రోజులు. మునిసిపాలిటీల్లో అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నాయి. మునిసిపల్ ఉద్యోగుల సమ్మె నోటీసు నేపథ్యంలో ఈపీఎఫ్, ఈఎ్‌సఐ వంటి కొన్ని చిన్న చిన్న సమస్యలను పరిష్కరించినా.. సమ్మె కొనసాగుతూనే ఉంది. దీని ప్రభావంతో సమస్యలు ఎక్కడివక్కడే తిష్టవేశాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్య దారుణంగా మారింది. స్వచ్ఛ భారత్.. స్వచ్ఛ తెలంగాణ.. స్వచ్ఛ హైదరాబాద్ అనే నినాదంతో నిరంతర ఉద్యమం నిర్వహిస్తున్నా పట్టణాల్లో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. ఏప్రిల్ మొదటి వారంలోనే సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చిన కేటీఆర్ రెండు నెలలైనా స్పందించటం లేదని, అందుకే తాము సమ్మె బాట పట్టామని ఉపాధి హామీ క్షేత్ర సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముదిగొండ శ్యామలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధిహామీ సిబ్బంది తిమ్మాపూర్ మండలంలోని అల్గునూర్ చౌరస్తాలో రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు.