బెల్లంపల్లి మండలం వేమనపల్లి మండలం ముల్కలపేటలో మెట్టపల్లి రాజేశ్వర్రావుకు చెందిన సర్వే నెం. 105లో 12 ఎకరాలు, సర్వే నెం.106లో ఐదు ఎకరాల భూ...
బెల్లంపల్లి మండలం వేమనపల్లి మండలం ముల్కలపేటలో మెట్టపల్లి రాజేశ్వర్రావుకు చెందిన సర్వే నెం. 105లో 12 ఎకరాలు, సర్వే నెం.106లో ఐదు ఎకరాల భూమిని దళిత బస్తీకి ఇచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ భూమిలో నీటి వనరులు లేవని భూగర్భ జల వనరుల శాఖ అధికారులు నివేదిక ఇచ్చారు. సాగుకు పనికిరాదంటూ వ్యవసాయశాఖ అధికారులు కూడా తేల్చి చెప్పారు. ఆ నివేదికలు అధికారులకు చేరడంతో కొన్నాళ్లపాటు ఈ భూముల వ్యవహారాన్ని పక్కన పెట్టారు. ఆ తర్వాత కొందరు ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు కలిసి ఇదే భూమిని కొనుగోలు చేయడానికి సిద్ధపడి మరోమారు విచారణ జరిపించారు. ఈసారి ఇచ్చిన నివేదికల్లో మాత్రం గతంలో ఇచ్చిన అధికారులే నీటి వనరులున్నాయని భూగర్భజల వనరుల శాఖ అధికారులు.. సాగు యోగ్యమైనవే అని వ్యవసాయ శాఖ అధికారులు అంతకు ముందటి దానికి భిన్నంగా నివేదికలు ఇచ్చారు. ఇలా నివేదికలు ఇవ్వడంలో భారీగానే ఒత్తిడి చేశారనే విమర్శలున్నాయి. అయినా.. అవే భూములను కొనుగోలు చేయడానికే అధికారులు మొగ్గు చూపి అవే భూములకు ఎకరానికి రూ.2.70 లక్షల చొప్పున మొత్తం రూ.45.90 లక్షలు చెల్లించి గత నెల 16న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవ లేదన్నట్లుగా రెవెన్యూ అధికారులు తలచుకుంటే చేయలేని పనేమీ లేదని చెప్పడానికి ఇదో మచ్చుతునక. ఒక సారి సాగుకు పనికి రాదని.. నీటి వనరులు లేవని నివేదికలిచ్చినా అవే భూములను రెవెన్యూ అధికారులు పట్టుబట్టి కొనుగోలు చేశారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో రెవెన్యూ అధికారులు నాటకీయంగా వ్యవహరించారు. మొదటిసారి భూముల పరిశీలనకు వెళ్లినప్పుడు పనుల ఒత్తిడి వల్ల సాంకేతిక పరికరాలు తీసుకెళ్లలేదని.. పైపైన భూములు పరీక్షించామని.. మొదటిసారి ఇచ్చిన నివేదికలు తప్పుగా ఇచ్చినవే అంటూ అధికారులతో రాయించుకుని డబ్బుల చెల్లింపులు జరిపారు. ఒక వేళ మొదటి సారి ఇచ్చిన నివేదికలే తప్పయితే.. అంతగుడ్డిగా భూముల పరిశీలన చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక పరికరాలు లేకుండానే నివేదికలు ఇచ్చిన అధికారులపైన ఎందుకు చర్యలు తీసుకోలేదో ఉన్నతాధికారులకే తెలియాలి. ఈ వ్యవహారంలోనూ ఓ బడా ప్రజాప్రతినిధి, మంచిర్యాలకు చెందిన మరో రెవెన్యూ అధికారి కీలకంగా వ్యవహరించి చక్రం తిప్పారనే విమర్శలున్నాయి. జిల్లా అధికారుల కళ్లు కప్పి అక్రమానికి తెగబడ్డా ఒక్కరూ నోరు మెదపకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.