చెన్నూరు, : పుష్కర పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నదీతీరాన అన్ని ఏర్పాట్లు చేయాలని దేవాదాయ ధర్మాదాయ ...
చెన్నూరు, : పుష్కర పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నదీతీరాన అన్ని ఏర్పాట్లు చేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం చెన్నూరు పుష్కరఘాట్‌ను అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలుతో కలిసి సందర్శించిన ఆయన సౌకర్యాల కల్పన తీరును పరిశీలించారు. పుష్కరఘాట్ వద్ద వస్త్రాలు మార్చుకునే గదులు, మరుగుదొడ్ల నిర్మాణాలు, జల్లుస్నానాల ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పుష్కర ఘాటు నుంచి గోదావరి నదిలోని నీటి వద్దకు వెళ్లేందుకు కిలోమీటరు దూరం ఉండటంతో భక్తులు స్నానాలు ఆచరించడం కష్టమవుతుందని స్థానికులు చెప్పగా స్పందించిన ఆయన సింగరేణి అధికారులతో మాట్లాడి దూరంగా ఉన్న నీటిని పుష్కరఘాట్ల వద్దకు మళ్లించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సింగరేణి సంస్థ అధికారుల సహాయంతో డోజర్ల ద్వారా నది నుంచి పాయలను తీసి పుష్కరఘాటు వరకు నీరు వచ్చేలా వెంటనే ఏర్పాట్లు చేపట్టాలని మంచిర్యాల ఆర్డీఓ అయిషా, నీటిపారుదల శాఖ ఈఈ వినోద్‌కుమార్‌లను ఆదేశించారు. కడెం, బాబ్లీ, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నీటినివిడుదల చేస్తున్నా చెన్నూరు గోదావరికి ఎల్లంపల్లి నీరు మాత్రమే వచ్చే అవకాశం ఉందన్నారు. నీరు గోదావరికి చేరకుంటే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడం కష్టమవుతున్నందున అధికారులు వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరిస్తూ ఘనంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం నదీతీరంలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు పుష్కరాల ప్రారంభోత్సవానికి శృంగేరి శివగంగ పీఠాధిపతి భారతి పురుషోత్తమ స్వామి ఇక్కడికి రానున్నారని వేదపండితుడు గట్టు నరహరిశర్మ అవధాని మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఈకార్యక్రమంలో జడ్పీ ఉపాధ్యక్షుడు మూల రాజిరెడ్డి, ఎంపీపీ మైదం కళావతి, సర్పంచి కృష్ణ తెరాస నాయకులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణం: రాష్ట్రం ఏర్పడిన తర్వత తొలిసారిగా నిర్వహించే గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాలను ఈ నెల 14న ఉదయం 6.21 గంటలకు కరీంనగర్ జిల్లా ధర్మపురిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. మంచిర్యాలలో శనివారం ఆయన అటవీ శాఖ మంత్రి జోగు రామన్నతో కలిసి పుష్కర ఘాట్ల వద్ద అభివృద్ధి పనులను పరిశీలించారు. త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలకు నీళ్లు విడుదల చేస్తుందన్నారు.ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, ఆర్డీఓ అయిషా మస్రత్ ఖానం, పురపాలక సంఘం అద్యక్షురాలు మామిడిశెట్టి వసుంధర, కమిషనర్ తేజావత్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.