తెలంగాణలో ఇంజినీరింగు ప్రవేశాలకు తొలగిన అడ్డంకులుసాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభంఉదయం పదింటికి వెబ్సైట్లో కళాశాలల తుది జాబితా28 వరకు మొదట...
తెలంగాణలో ఇంజినీరింగు ప్రవేశాలకు తొలగిన అడ్డంకులుసాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభంఉదయం పదింటికి వెబ్సైట్లో కళాశాలల తుది జాబితా28 వరకు మొదటి విడత కౌన్సెలింగు29 నుంచి రెండో విడతఆగస్టు 1 తేదీ నుంచే తరగతులుకడియం శ్రీహరి వెల్లడిఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి, ఇంజినీరింగు కళాశాలల్లో ప్రవేశాలకు మార్గం సుగమమయింది. కౌన్సెలింగు షెడ్యూలును ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి గురువారం ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం 5గంటల నుంచి వెబ్సైట్లో ఇంజినీరింగు కోర్సుల ఎంపిక కోసం ఐచ్ఛికాల(వెబ్ఆప్షన్ల) నమోదు ప్రారంభమవుతుందని తెలిపారు. ఈనెల 24న సీట్లను కేటాయిస్తామన్నారు. కౌన్సెలింగు రెండు విడతల్లోనే ఉంటుందన్నారు. తొలివిడత కౌన్సెలింగు ఈనెల 28వరకు, రెండోవిడత 29 నుంచి 31వరకు జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతానికి జేఎన్టీయూ గుర్తింపుపొందిన 220 కళాశాలల్లో 82795 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సంఖ్య పెరగొచ్చని, రాత్రికల్లా మొత్తం సీట్లసంఖ్యపై స్పష్టత వస్తుందని చెప్పారు. వివరాలను శుక్రవారం ఉదయం పదింటికి వెబ్సైట్లో పెడతామన్నారు. సుప్రీంకోర్టు నిర్దేశించినట్లే ఆగస్టు1 నుంచి ఇంజినీరింగు కళాశాలల్లో తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్ఆచార్య, వాణీప్రసాద్, శైలజారామయ్యర్, చిరంజీవులు, రమణారావు తదితర ఉన్నతాధికారులతో కలిసి కడియం గురువారం విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వుల మేరకు ప్రమాణాలున్న కళాశాలల్లోనే ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించామన్నారు. కళాశాలలను మూడు తరగతులుగా విభజించామని, జేఎన్టీయూ గుర్తింపుపొందిన కళాశాలలు ఒక కేటగిరీ, హైకోర్టు ఆదేశాల మేరకు షరతులకు లోబడి ప్రవేశాలకు అనుమతిపొందినవి రెండో కేటగిరీ, కోర్టుకెళ్లకుండాకౌన్సెలింగులో పాల్గొనేందుకు ముందుకొస్తున్నవి మూడో కేటగిరీవని వివరించారు.121 ఇంజినీరింగు కళాశాలలు న్యాయస్థానానికి వెళ్లగా వాటిని కౌన్సెలింగుకు అనుమతించి, తనిఖీలుచేయాలని, ఆ తర్వాత అవి జేఎన్టీయూ గుర్తింపు పొందని పక్షంలో విద్యార్థులకు వడ్డీతోపాటు రుసుము వాపసుచేయాలని, వారికి ఇతర కళాశాలల్లో ప్రవేశాలు కల్పించాలని హైకోర్టు సూచించిందని తెలిపారు. హైకోర్టును ఆశ్రయించిన కళాశాలల జాబితాను వెబ్సైట్లో పెడతామని తెలిపారు. హైకోర్టుకు వెళ్లని కళాశాలలు కౌన్సెలింగుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించాయని, అవి ఇప్పుడు ప్రవేశాలు చేపట్టినా, జేఎన్టీయూ గుర్తింపు పొందితేనే ప్రవేశాలను కొనసాగిస్తామనే షరతు విధిస్తున్నామన్నారు. హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఇంజినీరింగు కళాశాలల్లో తనిఖీలు చేపడతున్నామని, ఏఐసీటీఈ నుంచి ఇద్దరు, జేఎన్టీయూ నుంచి ఒకరు చొప్పున ముగ్గురు సభ్యుల కమిటీ ఈనెల 28లోపు తనిఖీలు నిర్వహిస్తుందని చెప్పారు. జేఎన్టీయూ అనుమతులు, హైకోర్టు ఉత్తర్వులు తదితర అంశాలను పరిగణిస్తూ విద్యార్థులు వెబ్ఆప్షన్ల ఎంపికలో అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు.