గోదావరిపై ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంవాప్కోస్ సంస్థకు బాధ్యతలు50 లక్షల ఎకరాలకు నీరందించేలా చర్యలుండాలని సూచనమన నీటి వాటాను ...
గోదావరిపై ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంవాప్కోస్ సంస్థకు బాధ్యతలు50 లక్షల ఎకరాలకు నీరందించేలా చర్యలుండాలని సూచనమన నీటి వాటాను పూర్తిగా వినియోగించుకోవాలని వెల్లడిగోదావరి బేసిన్ ప్రాజెక్టులపై సుదీర్ఘంగా సమీక్షించిన సీఎం
హైదరాబాద్ణహిత ప్రవేశించే ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి మొదలుకొని ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెం వరకు గోదావరి ప్రతి ప్రాజెక్టును మళ్లీ డిజైన్ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశించారు. ప్రాణహిత-చేవెళ్లను మళ్లీ డిజైన్ (రీడిజైన్) చేస్తున్న కన్సల్టెన్సీ సంస్థ వాప్కోస్కే ఈ బాధ్యత అప్పగించారు. గోదావరి బేసిన్ పరిధిలోని 50 గ్రామీణ నియోజకవర్గాల్లో 50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని సీఎం సూచించారు. గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులు, నీటి వినియోగంపై గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిపారుదల శాఖ అధికారులు, కన్సల్టెన్సీ సంస్థ వాప్కోస్‌తో సుధీర్ఘ సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, సలహాదారు విద్యాసాగర్‌రావు, ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు మురళీధర్, విజయప్రకాశ్, ప్రాణహిత-చేవెళ్ల చీఫ్ ఇంజినీర్ హరిరాం, కన్సల్టెన్సీ సంస్థ వాప్కోస్ జనరల్ మేనేజర్ శంభుఅజాద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన ప్రకారం... గోదావరి నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న వాటా పూర్తిగా వినియోగించుకొనే విధంగా ప్రాజెక్టుల రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గోదావరి బేసిన్లో 54 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా... నాలుగు పట్టణ నియోజకవర్గాలుపోనూ మిగిలిన 50 నియోజకవర్గాలకు సగటున లక్ష ఎకరాల చొప్పున సాగునీరందించాలని సూచించారు. ఎస్సారెస్పీ, కడెం, నిజాంసాగర్ లాంటి ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే పది లక్షల ఎకరాలకు అందుతుందని, మిగిలిన 40 లక్షల ఎకరాలకు 400 టీఎంసీల నీటిని అందించే విధంగా ప్రాజెక్టుల రూపకల్పన జరగాలన్నారు. ప్రాణహిత-చేవెళ్ల, దేవాదుల, కంతనపల్లి, ఎల్లంపల్లి, దుమ్ముగూడెం తదితర ప్రాజెక్టుల కోసం ఇప్పటికే 400 టీఎంసీలు కేటాయించారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. తెలంగాణకు ఉన్న నీటి కేటాయింపులు, అవసరాలు, ప్రస్తుత ప్రాజెక్టులు, రిజర్వాయర్లకు అనుగుణంగా డిజైన్లు తయారు చేయాలని, వీలైనంత త్వరగా వాటిని ఇవ్వాలని కన్సల్టెన్సీ సంస్థ వాప్కోస్ను సీఎం కోరారు. సమైక్య రాష్ట్రంలో గోదావరిపై ప్రతిపాదించిన ప్రాజెక్టులన్నీ కాగితాలకే పరిమితం అయ్యాయని, వాటి డిజైన్లు కూడా సాగునీటి అవసరాలు తీర్చే విధంగా లేవని ముఖ్యమంత్రి అన్నారు. గోదావరిపై ఎక్కడెక్కడ లిప్టులు పెట్టాలి, ఎక్కడ ఎంత నీటి ప్రవాహ ఉద్ధృతి ఉంటుంది, ఏ ప్రాంతానికి ఏ మార్గం ద్వారా తీసుకుపోవాలి, ఇప్పటికే తవ్విన కాల్వలు, తీసిన సొరంగాలు, వేసిన పైపులైన్లను ఎలా వినియోగించాలి, లిప్టుద్వారా గురుత్వాకర్షతో ఎక్కడెక్కడికి నీటిని మళ్లించడానికి అవకాశం ఉందన్న దానిపై... నీటిపారుదల శాఖ అధికారులు, వాప్కోస్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి విస్తృతంగా చర్చించారు. ఎక్కడ కాల్వలు తవ్వాలి, ఎక్కడ రిజర్వాయర్లు కట్టాలి, ఎక్కడ కాలువల సామర్థ్యం పెంచాలి తదితర అంశాలపై గూగుల్ ఎర్త్, మ్యాపులు, నివేదికల ఆధారంగా చర్చించారు.తెలంగాణకు 953 టీఎంసీలు వాడుకొనే హక్కుందిగోదావరి జలాల్లో తెలంగాణకు 953 టీఎంసీలు వాడుకొనే హక్కు ఉంది. 433 టీఎంసీల కోసం ప్రాజెక్టులున్నాయి. మరో 521 టీఎంసీలు వాడుకొనేందుకు ప్రాజెక్టులు కట్టుకోవాలి. ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల ద్వారా 400 టీఎంసీలు వాడుకొనే అనుమతులు వచ్చాయి. వీటికి అనుగుణంగానే ఇప్పుడు నిర్మాణాలు జరగాలని ముఖ్యమంత్రి సూచించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తయారుచేసిన ప్రాజెక్టులు తెలంగాణ సాగునీటి అవసరాలు తీర్చే విధంగా లేవని, అంతర్ రాష్ట్ర వివాదాలు, అశాస్త్రీయ డిజైన్లు తదితర అడ్డంకులు ఉండే విధంగా రూపొందించడంతోపాటు అరకొరనిధులు కేటాయించారని అన్నారు. అసలు తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కావద్దనే దురుద్దేశం ఆ పాలకులకు ఉండేదని, అందుకే గోదావరి ప్రాజెక్టులకు అతీగతీలేకుండా పోయిందని పేర్కొన్నారు. ఇప్పుడు మనం శాస్త్రీయంగా అధ్యయనం చేసి సమర్థంగా నీటిని వినియోగించే విధంగా డిజైన్లు తయారు చేయాలన్నారు. ప్రాజెక్టుల రూపకల్పనలో విశేష అనుభవం ఉన్న వాప్కోస్కే ఆ బాధ్యత అప్పగిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.ప్రాణహిత-చేవెళ్లను రెండు భాగాలుగా చేయాలిప్రాణహిత-చేవెళ్ల ప్రస్తుత డిజైన్ పనికొచ్చేది కాదని, దీనిని రెండు భాగాలుగా చేయాలని సీఎం పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్‌కు నీళ్లివ్వాలన్నారు. కాళేశ్వరం దిగువన మరో ప్రాజెక్టు కట్టి నిజామాబాద్, కరీంనగర్, మెదక్‌తోపాటు వరంగల్, నల్గొండ జిల్లాలోని కరవు పీడిత జనగామ, భువనగిరి డివిజన్లకు నీరందించాలని చెప్పారు. అదే ప్రాజెక్టును నిజాంసాగర్‌కు, ఎస్సారెస్పీకి అనుసంధానం చేయాలన్నారు. దేవాదుల ప్రాజెక్టు కూడా నీరందించలేకపోతోందని, కంతనపల్లిని దేవాదులకు ఉపయోగపడే విధంగా డిజైన్ చేయాలని ఆదేశించారు. ఇప్పుడు కంతనపల్లి కోసం ప్రతిపాదించిన ప్రాంతం కాకుండా కొంచెం ముందుకు కడితే దేవాదులకు ఉపయోగమన్నారు. గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసే క్రమంలో దారిమధ్యలో ఎక్కువ రిజర్వాయర్లు ఉండాలని, గ్రావిటీ-లిప్టు పద్ధతిలో నీటి సరఫరా ఉండాలని, అవసరమైన చోట ఎస్సారెస్పీ సామర్థ్యం పెంచాలని, ఈ ప్రాధాన్యతలతో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా, పొలాలకు నీరందించడమే లక్ష్యంగా డిజైన్లు రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు.