కామారెడ్డి, నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మునిసిపల్ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా శుక్రవారం కామారెడ్డి మునిసిపల్ కార్యాలయ...
కామారెడ్డి, నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మునిసిపల్ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా శుక్రవారం కామారెడ్డి మునిసిపల్ కార్యాలయం ఎదుట కాంట్రాక్టు కార్మికులు బతుకమ్మ, కబడ్డి ఆటపాటలాడి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై వంటావార్పు చేపట్టారు. ఐదోరోజు సమ్మెలో కార్మికులు పాలు పంచుకున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తన మొండివైఖరి మానుకొని కార్మికులతో బేషరతుగా చర్చలు జరపాలని కోరారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న మునిసిపల్ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీక్షా శిబిరాన్ని పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మామిండ్ల అంజయ్య, తేలిక వాహనాల డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు రవి, ప్రజా సంఘాల నాయకులు సందర్శించి తమ సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మికుల జేఏసి నాయకులు లక్ష్మణ్, నర్సింగ్‌రావు, అబ్బాస్, రాజనర్సు, ప్రమీల, ప్రభు, దీవెన, కళావతి తదితరులు పాల్గొన్నారు.