(7 Jul) ఓటుకు నోటు కేసులో తాజా పరిణామంనేడు న్యాయస్థానం ముందుకు..ఈనాడు - హైదరాబాద్‌టుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఎమ్మెల్...
(7 Jul) ఓటుకు నోటు కేసులో తాజా పరిణామంనేడు న్యాయస్థానం ముందుకు..ఈనాడు - హైదరాబాద్‌టుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే అరెస్టయ్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సండ్ర వెంకట వీరయ్యను అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు సోమవారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఇదివరకే తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు మరో ఇద్దర్ని అనిశా అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సండ్రను మంగళవారం న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు పన్నిన కుట్రలో సండ్రకు కూడా భాగస్వామ్యం ఉందన్న ఆరోపణలపై ఆయనను అరెస్టు చేశారు. తాజా అరెస్టుతో కొద్దిరోజులుగా స్తబ్దుగా ఉన్న ఈ కేసు మరోమారు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే విచారించిన ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిని అనిశా మరోమారు విచారణకు పిలువనుంది. ఇందుకు సంబంధించి ఆయనకు నోటీసులు జారీ చేయనుంది.ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50లక్షలు ముందస్తుగా ఇస్తున్నారన్న ఆరోపణలపై రేవంత్‌రెడ్డి తదితరులను అనిశా అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం నలుగుర్ని నిందితులుగా పేర్కొన్నారు. ఎఫ్.ఐ.ఆర్.లో సండ్ర పేరు ఎక్కడా లేదు. అయితే అనిశా దర్యాప్తులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో సండ్ర కూడా కీలకపాత్ర పోషించినట్లు వెల్లడైందని సమాచారం. ముఖ్యంగా స్టీఫెన్‌సన్‌తో మొదట బేరసారాలు మొదలుపెట్టింది ఆయనేనని అనిశా అధికారులు భావిస్తున్నారు. తెదేపా తరఫున మైనార్టీ వ్యవహారాల్లో పాల్గొనే సండ్ర, ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన సెబాస్టియన్‌తో పాటు మిగతా నిందితులు అందరితోనూ నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారని అనిశా గుర్తించినట్లు సమాచారం. ఖమ్మం జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలతోనూ సండ్ర సంప్రదింపులు జరిపారని, మొత్తం మీద ఈ వ్యవహారంలో ఆయన అత్యంత కీలక పాత్ర పోషించారన్న అభియోగాలపైనే అనిశా ఆయనను అరెస్టు చేసింది.అనిశా ప్రశ్నల పరంపరఓటుకు నోటు కేసులో విచారణకు హాజరు కావాలని అనిశా ఇదివరకే సండ్రకు నోటీసులు జారీ చేసింది. అయితే అనారోగ్యం కారణంగా హాజరు కాలేనని సండ్ర సమాచారం ఇచ్చారు. తాజాగా మరోమారు నోటీసులు జారీ చేయగా సోమవారం ఆయన విచారణకు హాజరయ్యారు. ఉదయం పది గంటల సమయంలో ఆయన అనిశా కార్యాలయంలోకి వెళ్లారు. దర్యాప్తు అధికారి మల్లారెడ్డి ఆధ్వర్యంలోని బృందం సండ్రను ప్రశ్నించింది. ప్రధానంగా స్టీఫెన్‌సన్, సెబాస్టియన్‌లకు ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరి ఆదేశాలతో ఫోన్లు చేశారు? ప్రలోభపెట్టమని ఎవరు చెప్పారు? ఇంకా ఎమ్మెల్యేలు ఎవరెవరితో సంప్రదింపులు జరిపారు? అంటూ సండ్రను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే తనకేమీ తెలియదని, సెబాస్టియన్ పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటాడు కాబట్టి ఆయనతో మాత్రమే ఫోన్లో మాట్లాడానని సండ్ర చెప్పినట్లు తెలుస్తోంది. మిగతా ప్రశ్నలు వేటికి కూడా తనకు తెలియదనే అన్నట్లు సమాచారం. అనిశా అధికారులు కొన్ని పత్రాలు చూపించి మరీ ప్రశ్నించినా ముక్తసరిగానే సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తంమీద సాయంత్రం నాలుగు గంటల సమయంలో అరెస్టు చేస్తున్నట్లు ఆయనకు చెప్పారు. మంగళవారం ఆయనను న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. తెదేపా తరఫున మైనార్టీ వ్యవహారాలు చూసే జిమ్మీకి కూడా అనిశా నోటీసులు ఇచ్చినా ఆయన హాజరు కాలేదు.అనిశా కార్యాలయం వద్ద హడావుడివిచారణకు సండ్ర హాజరవుతారని తెలియగానే పెద్ద సంఖ్యలో తెలుగుదేశం నాయకులు అనిశా కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తుపల్లి నియోజకవర్గంతో పాటు ఖమ్మం జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో నాయకులు తరలి వచ్చారు.అప్రూవర్‌గా మారను: సెబాస్టియన్‌ఈ కేసులో తాను అప్రూవర్‌గా మారనని ఓటుకు నోటు కేసులో నిందితునిగా ఉన్న తెదేపా మైనార్టీ విభాగం ప్రతినిధి హ్యారీ సెబాస్టియన్ స్పష్టం చేశారు. బెయిల్ షరతుల్లో భాగంగా సంతకం పెట్టేందుకు సోమవారం అనిశా కార్యాలయానికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. స్టీఫెన్‌సన్‌తోపాటు తనకు చాలామంది ఆంగ్లో ఇండియన్‌లు తెలుసని చెప్పారు. స్టీఫెన్‌సన్ తనను మోసం చేశాడో లేదో ఆయనకు, తనకు, దేవునికే తెలుసన్నారు. జిమ్మీ, మత్తయ్య, తెదేపా నేతగా రేవంత్‌రెడ్డిలు తనకు తెలుసని చెప్పారు.ఆధారాల సేకరణలో ఈసీఈనాడు, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఓవైపు అవినీతి నిరోధక శాఖ (అనిశా) చురుగ్గా దర్యాప్తు చేస్తుండగా మరోవైపు ఎన్నికల సంఘం కూడా తనంతట తానుగా విచారణ చేపట్టడానికే నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా అన్ని ఆధారాలను సేకరించే ప్రయత్నంలో ఉంది. రేవంత్‌రెడ్డి తదితరులు స్టీఫెన్‌సన్‌తో జరిపిన సంభాషణలున్న ఆడియో, వీడియో దృశ్యాలు, పరికరాలను న్యాయ వైజ్ఞానిక ప్రయోగశాల నుంచి ఇప్పించాలని కోర్టును ఆశ్రయించేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమౌతోంది. ఇప్పటికే కోర్టు నుంచి అనిశా అధికారుల దర్యాప్తు చేసి సమర్పించిన పత్రాలను పొందింది. వీటిలో ఎఫ్‌ఐఆర్, రిమాండ్, కస్టడీ రిపోర్టులతోపాటు మేజిస్ట్రేట్ ముందు నమోదు చేసిన స్టీఫెన్‌సన్, మాల్కం టేలర్, జెస్సికా స్టీఫెన్‌సన్‌ల వాంగ్మూలాలు, నిందితుల అరెస్ట్ సమయంలో అనిశా అధికారులు నమోదు చేసిన వాంగ్మూలాలను తీసుకుంది. ఈ పత్రాలతోపాటు ఆడియో, వీడియో రికార్డింగ్‌లను ఇప్పించాలన్న ఎన్నికల సంఘం అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల సంఘం నేరుగా న్యాయ వైజ్ఞానిక ప్రయోగశాలకు వెళ్లడానికి అవకాశం లేనందున కోర్టు నుంచి ఆదేశాలు పొందాలని భావిస్తోంది. ఈమేరకు కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసి ఆడియో, వీడియో రికార్డింగ్ కాపీలను ఇచ్చేలా న్యాయవైజ్ఞానిక ప్రయోగశాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరాలని యోచిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయి.