(5 Jul) ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం నల్గొండ జిల్లా యాదగిరి గుట్టలో జరిగే కార్యక్రమానికి హాజరైన తర్వాత కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, ధర్మా...
(5 Jul) ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం నల్గొండ జిల్లా యాదగిరి గుట్టలో జరిగే కార్యక్రమానికి హాజరైన తర్వాత కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, ధర్మారంలలో జరిగే హరితహారం కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం జిల్లాకు రానున్నారు. తొలుత ఆయన దండేపల్లి మండలం గూడెం వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తారు. 30 వేల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో గోదావరి నదిపై నిర్మించిన గూడెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి జిల్లా ప్రజలకు అంకితం చేయనున్నారు. అనంతరం గూడెం దేవాలయంలో హరితహారంలో పాల్గొని మొక్కలు నాటుతారు. తర్వాత అక్కడే జిల్లా ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడతారు. అక్కడి నుంచి బయలుదేరి జన్నారం మండలం తపాల్పూర్, కిష్టాపూర్‌లలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయన రాక సందర్భంగా స్వాగతం పలకడానికి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల విద్యార్థులను సిద్ధం చేశారు. ఆ తర్వాత కడెం మండలం దస్తూరాబాద్ పంచాయతీ పరిధిలోని దేవునిగూడలో ఒకేసారి లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం మామడకు చేరుకుని స్థానిక పోలీసు స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటుతారు. అక్కడి నుంచి నిర్మల్‌కు చేరుకుంటారు. నిర్మల్ ఆర్టీసీ డిపోలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. నూతనంగా నిర్మించిన ఆర్డీవో భవనాన్ని ప్రారంభిస్తారు. మంచిర్యాల చౌరస్తాలో రోడ్‌షో ముగించుకుని నిజామాబాద్ జిల్లాకు బయలుదేరుతారు. జిల్లాకు ముఖ్యమంత్రి హోదాలో నాలుగోసారి వస్తున్న కేసీఆర్‌కు అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. బహిరంగ సభలు జరిగే ప్రదేశాల్లో ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పించారు. ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ గత రెండు రోజులుగా విస్తృతంగా పర్యవేక్షించారు. శనివారం కూడా ముఖ్యమంత్రి పర్యటించే గూడెం నుంచి నిర్మల్ వరకు ఏర్పాట్లను పరిశీలించారు. సిబ్బందిని అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాక సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలీసు అధికారులు సమావేశమై పటిష్ట బందోబస్తుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇద్దరు అదనపు ఎస్పీలు, ఒక ఏఎస్పీ, డీఎస్పీలు 9 మంది, సీఐలు 40 మంది, ఎస్సైలు 110 మంది, ఏఎస్సైలు 140 మంది, హెడ్ కానిస్టేబుళ్లు 200 మంది, పోలీసు కానిస్టేబుళ్లు 900 మంది, మహిళా పోలీసులు 40 మంది, హోంగార్డులు 600 మంది, సాయుధ పోలీసులు 400 మంది, టీఎస్పీఎస్ 200 మంది, సీఆర్పీఎఫ్ కేంద్ర బలగాలు 80 మందిని సీఎం పర్యటనకు వినియోగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తరుణ్‌జోష్ తెలిపారు. అంతేకాకుండా జిల్లా నిఘా విభాగం, డాగ్స్వాడ్, బాంబ్డిస్పోజబుల్ టీంలు, రోడ్డు ఓపెనింగ్ టీంలు, రోడ్డు సెర్చింగ్ టీంలు, జిల్లా ప్రత్యేక కమాండోలు విధుల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రతి మండలానికి డీఎస్పీ స్థాయి అధికారి ఇన్ఛార్జిగా ఉంటారు. సీఎం పర్యటనకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశాం. ట్రాఫిక్, భద్రత, వసతులు వంటి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించాను. హరితహారంలో పాల్గొనడానికి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు రావడం మనందరి అదృష్టంగా భావిస్తున్నా. జిల్లావాసులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.