ఆగస్టు ఆఖరుదాకా వర్షాభావంతప్పదంటున్న వాతావరణశాఖఎండకు మాడిపోతున్న విత్తనాలుకలవరం చెందుతున్న రైతాంగం ఖమ్మం కటి రెండు వారాలు కాదు.. ఏకంగా...
ఆగస్టు ఆఖరుదాకా వర్షాభావంతప్పదంటున్న వాతావరణశాఖఎండకు మాడిపోతున్న విత్తనాలుకలవరం చెందుతున్న రైతాంగం
ఖమ్మం కటి రెండు వారాలు కాదు.. ఏకంగా ఆగస్టు ఆఖరుదాకా తెలుగు రాష్ట్రాల్లో వర్షం కురిసే సూచన కనిపించడం లేదు. ఆ తర్వాతే క్రమంగా వర్షాలు మొదలై సెప్టెంబరు ఆఖరుకు ఆశించిన వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణుల అంచనా. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించిన ప్రకారం నైరుతి సీజన్లో (జూన్ నుంచి సెప్టెంబరు) సాధారణం కంటే 8శాతం వర్షపాతం లోటు అనివార్యంగా కనిపిస్తోంది. దేశంలో వేగంగా వ్యాపించిన నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అదే సమయంలో దక్షిణ భారతంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. వస్తూనే భారీ వర్షాలతో నైరుతి వూరించడంతో అప్పులు చేసి ఉత్సాహంగా విత్తనాలు చల్లుకున్న రైతులు ఇప్పుడు మొలకెత్తకముందే అవిఎండిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రైతులు తుంపర పరికరాలతో చేలను తడుపుకొంటున్న దయనీయ పరిస్థితి కనిపిస్తోంది.సాధారణంగా దేశవ్యాప్తంగా విస్తరించే రుతు పవనాలు ఆ వెంటనే మళ్లీ క్రమంగా కిందికి వస్తుంటాయి. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం, వాయుగుండం వంటివి ఇందుకు దోహదం చేస్తుంటాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ సారి అలాంటి వాతావరణ పరిస్థితులు కనిపించడం లేదు. ఎల్నినో, ఇతర వాతావరణ మార్పులు కూడా ఇందుకు కారణం కావొచ్చని నిపుణులు అంటున్నారు.హిమాలయాల వరకు వెళ్లిన రుతు పవనాల ద్రోణి మళ్లీ కిందికి దిగే పరిస్థితుల్లేకపోవడంతో దక్షిణ భారత ప్రజలు అధిక పగటి ఉష్ణోగ్రతలతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం, వాయుగుండాల ప్రభావంతో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసేవి. గతంలో జూన్ నుంచి ఆగస్టు మధ్య ఇలాంటి పరిస్థితి ఉండేది. ఈసారి రుతు పవనాలు ప్రవేశించాక జూన్ రెండో వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఒకటిఏర్పడటంతో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిశాయి. మళ్లీ ఆ స్థాయి కలిగిన అల్పపీడనం ఇప్పటివరకు ఏర్పడకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం నమోదయ్యే సమయంలో గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ప్రతికూల వాతావరణ పరిస్థితులతో నైరుతి రుతు పవనాలు వచ్చే నెలాఖరుకు యథా ప్రకారం కిందికి దిగే అవకాశాలున్నాయి. వీటి ప్రభావంతో సెప్టెంబరులో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే సాధారణం కంటే ఈ సీజన్లో 8 శాతం వర్షపాతం లోటు ఉంటుందని వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు. అక్టోబరు నుంచి మొదలయ్యే ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈసారి మంచి వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ సీజన్లో కోస్తాంధ్ర కంటే రాయలసీమ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తుంటాయి. ఇదే సమయంలో బంగాళాఖాతంలో తుపాన్లు వంటివి ఏర్పడే అవకాశం ఉన్నందున, కోస్తాంధ్రలోనూ సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ వర్గాలు వెల్లడించాయి.పత్తాలేని వర్షాలు.. పత్తికి ఇక్కట్లువర్షాలు ముఖం చాటేయడంతో కర్షకుల మదిలో కలవరం తీవ్రమౌతోంది. కళ్లెదుటే విత్తనం విచ్చుకోపోవడం, విచ్చుకున్న చోట మొగ్గ దశలోనే ఎండిపోవడం చూసి రైతులు తట్టుకోలేకపోతున్నారు. ఖమ్మం జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి ఇది. జిల్లాలో పత్తి సాధారణ సాగు 1,60,604 హెక్టార్లు కాగా గతేడాది 1.69 లక్షల హెక్టార్లలో సాగైంది. ఈ ఏడాది ఇప్పటివరకు 1.50 లక్షల హెక్టార్లలో పత్తి సాగు అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సకాలంలో వర్షాలు పడడంతో సీజన్ బాగుంటుందన్న ధీమాతో రైతులు పత్తి వేశారు. విత్తిన అనంతరం వర్షాలు ముఖం చాటేయడంతో అన్నదాతలు బిక్కమొహం వేయాల్సి వస్తోంది. ఇప్పటికే సుమారు 30హెక్టార్లకుపైగా భూమిలో వేసిన పత్తి విత్తనాలు భూమిలోనే కలిసిపోగా, మరికొన్ని ఎండ వేడిమిని తాళలేక మాడిపోతున్నాయి.