రామకృష్ణాపూర్, న్యూస్‌టుడే: సింగరేణి సంస్థ జులై నెలలో 116 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించింది. గత ఏడాది జులైలో సాధించిన ఉత్పత్తి కన్నా.. ప్...

రామకృష్ణాపూర్, న్యూస్‌టుడే: సింగరేణి సంస్థ జులై నెలలో 116 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించింది. గత ఏడాది జులైలో సాధించిన ఉత్పత్తి కన్నా.. ప్రస్తుతం 0.647 మిలియన్ టన్నులు అధికంగా సాధించినట్లు యాజమాన్యం శుక్రవారం పేర్కొంది. 2015-16 ఆర్థిక సంవత్సరం జులైలో సింగరేణి సంస్థ 3.913 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. సింగరేణీయుల సమష్టి కృషి ఫలితంగా నెలాఖరునాటికి 4.560 మిలియన్ టన్నుల ఉత్పత్తితో 116 శాతం నమోదైంది. బొగ్గు రవాణాలో జులైలో 5.087 మిలియన్ టన్నులు సాధించడం విశేషం. గతేడాది ఇదే నెలలో 4.103 మిలియన్ టన్నులను మాత్రమే సాధించింది. గతేడాదితో పోలిస్తే 24 శాతం అధికంగా రవాణా చేసినట్లయింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ఎలాంటి ఒత్తిడి లేకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం బొగ్గు ఉత్పత్తి చేపట్టడంతో ప్రతినెలా నిర్దేశిత బొగ్గు లక్ష్యం సాధిస్తోంది. ఉపరితల గనుల్లో మట్టి తొలగింపు(ఓవర్‌బర్డెన్) విషయంలోనూ జులై నెల లక్ష్యం 131 శాతం దాటింది. 19.396 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను వెలికితీయాల్సి ఉండగా నెలాఖరు నాటికి 25.456 మిలియన్ క్యూబిక్ మీటర్లను తొలగించింది. గతేడాది ఇదే కాలానికి 16.649 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను తొలగించింది. ప్రతి నెలా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను కలిసికట్టుగా సింగరేణీయులు సాధిస్తే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు లోటు అనేది లేకుండా చేసే వీలుందని, ఉద్యోగులు ఇదే ఒరవడిని కొనసాగించాలని సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్ పిలుపునిచ్చారు. కోట్లాది రూపాయలతో కొనుగోలు చేసిన భారీ యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీరాంపూర్ గ్రామీణం: జులై నెల 30వ తేదీ వరకు శ్రీరాంపూర్ ఏరియా 107 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిందని శ్రీరాంపూర్ జీఎం ఎస్డీ.ఎం సుభాని పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో వరుసగా నాలుగో నెల శ్రీరాంపూర్ ఏరియా వంద శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించిందన్నారు. కంపెనీ వార్షిక ఉత్పత్తి లక్ష్యంలో జులై నెలాఖరు నాటికి సింగరేణి వ్యాప్తంగా శ్రీరాంపూర్ ఏరియా 105 శాతం ఉత్పత్తితో కొత్తగూడెంతో సమానంగా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. జులై నెలలో ఏరియా ఉత్పత్తి లక్ష్యం 3,94,000 టన్నులకు గాను 4,20,177 టన్నులతో 107 శాతం బొగ్గు ఉత్పత్తిని నమోదుచేసిందన్నారు. ఏరియాలోని భూగర్భ గనులు 98 శాతం, శ్రీరాంపూర్ ఉపరితల గని 120 శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించిందని ఆయన తెలిపారు. కార్మికులు, అధికారులు, సూపర్వైజర్ల సమష్టి కృషితోనే అధిక ఉత్పత్తి సాధించామని, రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించాలని సూచించారు. త్వరలోనే ఏరియాలోని గనులపై అధునాతన క్యాంటీన్లను ఏర్పాటుచేస్తామన్నారు. మీకోసం-మీచెంతకు కార్యక్రమంలో కార్మిక కుటుంబాలు సూచించిన సమస్యలను పరిష్కరించేందుకు యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. ఏరియాలోని ఆర్కే-5, ఆర్కే-6 గనుల్లో వెంటిలేషన్ సమస్యలను పరిష్కరించామని, ఐకే-1ఏ, ఎస్సార్పీ-1 గనుల్లోని సమస్యలనూ త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో ఎస్ఓటు జీఎం సత్యనారాయణ, ఎస్సార్పీ ఓసీపీ ప్రాజెక్టు ఆధికారి గణపతి, డీజీఎం(పీ) శర్మ, ఏజీఎం ఫణి, పర్సనల్ మేనేజర్ కిరణ్, డీవైసీఎంఓ లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌లో జూన్ 29వ తేదిన రికార్డు స్థాయిలో 28,132 టన్నుల బొగ్గును రవాణా జరిగింది. ఆ ఒక్కరోజే శ్రీరాంపూర్ సీహెచ్‌పీ నుంచి ఆరు ర్యాకులు, రోడ్డు మార్గంలో 4,927 టన్నుల బొగ్గు రవాణా అయింది. ఈ సందర్భంగా ఏరియా జీఎం ఎస్డీ.ఎం సుభాని శనివారం సీహెచ్‌పీని సందర్శించి అక్కడి ఉద్యోగులను అభినందించారు. అనంతరం జీఎం మాట్లాడుతూ రికార్డు స్థాయిలో అత్యధికంగా బొగ్గు రవాణా చేయడం అభినందనీయమన్నారు. కంపెనీ అభివృద్ధికి సహకరించే కార్మికులకు గుర్తింపు ఉంటుందన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లో మరిన్ని రికార్డులు సాధించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీహెచ్‌పీ డీజీఎం రామలింగం, ఎస్ఓటు జీఎం సత్యనారాయణ, డీజీఎం(పీ) శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.