బీజేపీ జిల్లా నేతల డిమాండ్ * స్థానిక నేతలకే అవకాశం ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి * ఇతర పార్టీల నేతలను తీసుకువస్తే మధ్యలోనే ...

బీజేపీ జిల్లా నేతల డిమాండ్
* స్థానిక నేతలకే అవకాశం ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి
* ఇతర పార్టీల నేతలను తీసుకువస్తే మధ్యలోనే వెళ్లిపోతారని వాదన
హైదరాబాద్: పార్టీ సిద్ధాంతాలపై విశ్వా సంతో పనిచేస్తున్న వారినే వరంగల్ ఉప ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఆ పార్టీ జిల్లా నేతలు ఒత్తిడి తెస్తున్నారు. వరంగల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రమంత్రివర్గంలో చేరడంతో వస్తున్న ఈ ఉప ఎన్నికలో గెలుపు గుర్రాలకోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం అన్వేషిస్తోంది.
టీడీపీతో గత ఎన్నికల్లో ఉన్న పొత్తు ఈ ఉప ఎన్నికలోనూ కొనసాగనుందని ఇరుపార్టీల నేతలు ఇప్పటికే ప్రకటించారు. వరంగల్ ఎంపీ స్థానానికి గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థే పోటీలో ఉన్నారు. దీనితో ఈ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థికే టీడీపీ మద్దతు ప్రకటించే అవకాశాలున్నాయి. దీనికి అనుగుణంగానే ఇరుపార్టీల నేతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. తమ అభ్యర్థే పోటీలో ఉంటారనే విశ్వాసంతో బీజేపీ నేతలు అభ్యర్థి ఎంపికపై దృష్టిని సారించారు.
అభ్యర్థి గురించి పార్టీ రాష్ట్ర నేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా కూడా ప్రాథమికంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర శాఖతో సంబంధంలేకుండా అమిత్షా కూడా అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్నేతలతో అమిత్షా ఫోనులో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అలాగే సామాజిక ఉద్యమ నేతలతో బీజేపీ రాష్ట్ర నాయకులు మంతనాలు చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమంతోపాటు, ఇతర ఉద్యమాల్లోనూ కొంత పేరున్న నేతను వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీలోకి దించడం వల్ల రాజకీయ ప్రయోజనం ఉంటుందనే విశ్వాసం తో బీజేపీ జాతీయ, రాష్ట్ర పార్టీనేతలు ఉన్నట్టుగా దీన్నిబట్టి అర్థం అవుతోంది. అయితే ఈ ప్రతిపాదనలను వరంగల్ జిల్లా పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇతర పార్టీల నేతలను ఎన్నికల అవసరాలకోసం తీసుకురావడం వల్ల పార్టీ బలపడకపోగా, మరింత బలహీనపడుతున్నదని వారు వాదిస్తున్నారు.
బలహీనంగా ఉన్నా, రాష్ట్రస్థాయిలో గుర్తింపు లేకున్నా స్థానిక నేతను ఎన్నికల బరిలోకి దించడం వల్ల పార్టీ విస్తరణకు, బలోపేతానికి ఉపయోగపడుతుందని అంటున్నారు. ఎన్నికల కోసం వచ్చిన నాయకుడు ఓడినా, గెలిచినా పార్టీకి విధేయంగా పనిచేయడం లేదంటూ కొన్ని ఉదాహరణలను కూడా చూపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన ఆర్.పరమేశ్వర్ ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. గెలిచినా, ఓడినా పార్టీలోనే పనిచేయగలిగే అభ్యర్థినే పోటీలోకి దించాలని రాష్ట్ర పార్టీ నేతలపై జిల్లా నేతలు ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది.