-పలు ప్రాజెక్టులకు కన్సల్టెన్సీగా సేవలు -ఇతర కంపెనీల ద్వారా రూ.25 కోట్ల పనులు హైదరాబాద్ : పలు కంపెనీల విద్యుత్ ఉత్పత్తిలో సింగ...
-పలు ప్రాజెక్టులకు కన్సల్టెన్సీగా సేవలు
-ఇతర కంపెనీల ద్వారా రూ.25 కోట్ల పనులు
హైదరాబాద్ : పలు కంపెనీల విద్యుత్ ఉత్పత్తిలో సింగరేణి సంస్థ కన్సల్టెన్సీగా ఉంటూ వ్యాపారాభివృద్ధిలో భాగస్వామిగా వ్యవహరిస్తున్నది. ఇతర సంస్థల ప్రాజెక్టులను అభివృద్ధి చేసే దిశలో ఎనిమిదేండ్ల్లలో రూ.25 కోట్ల పనులను సింగరేణి దక్కించుకున్నది. కేవలం బొగ్గు ఉత్పత్తిపైనే కాకుండా వ్యాపార విస్తరణకు సింగరేణి కొత్త విధానాలను అవలంబిస్తున్నది. సింగరేణి ఉత్పత్తిచేసే బొగ్గును విద్యుత్ ఉత్పత్తికి ఇతర ప్రాంతాలకు తరలించే వారు.
ఇప్పుడు ఆ పరిస్థితి మారనున్నది. ఇందుకు 6,500 కోట్లతో విద్యుత్ ఉత్పత్తికి సింగరేణి థర్మల్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. సింగరేణి బిజినెస్ డెవలప్మెంట్ విభాగం ద్వారా పలు సంస్థలు, ప్రాజెక్టులకు కన్సల్టెన్సీగా వ్యవహరిస్తున్నది. బొగ్గు ఉత్పత్తిపై అపార అనుభవం ఉండటంతో బొగ్గు ఉత్పత్తిపై శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రాజెక్టులకు పనిచేయడం వంటివి చేపడుతున్నది. భూముల్లో బొగ్గు గనుల అన్వేషణ, తవ్వకాలు, ఉత్పత్తిపై ప్రణాళికా రచన, సర్వే చేపట్టడం వంటి ప్రక్రియలను సింగరేణి సంస్థ నిపుణులు, ఇక్కడి అధునాతన యంత్ర పరికరాలతో ఆయా ప్రాజెక్టుల వద్ద పనులు చేపడున్నారు.
సింగరేణి బిజినెస్ డెవలప్మెంట్ విభాగానికి నర్సింహారావు జీఎంగా ఉన్నారు. ఎన్టీపీసీ, ఎన్ఎండీఎల్ఐ, టాటాస్పాంజ్ ఐరన్, రిలయన్స్ ఎనర్జీ సంస్థలకు సింగరేణి కన్సల్టెన్సీగా వ్యవహరించి విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణ పనులు దక్కించుకుంది. ఇందులో 60 శాతం వరకు ప్రాజెక్టుల పనులు పూర్తయ్యాయి.
అన్నింటా ముందంజ: కేవలం బొగ్గు ఉత్పత్తిపైనే కాకుండా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నామని, ఇందుకు పనులు కూడా చేపట్టామని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ పేర్కొన్నారు. సింగరేణిలో అత్యాధునిక యంత్రాలున్నాయని, రూ.1.50 కోట్లు విలువచేసే త్రీడీ స్కానర్ యంత్రం ద్వారా భూముల్లో ఉండే ఖనిజ సంపదను గుర్తించ గలుగుతామన్నారు. ఇతర కంపెనీలు చేపట్టే బొగ్గు తవ్వకాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణలో కూడా తమ సంస్థకు చెందిన బిజినెస్ డెవలప్మెంట్ విభాగం కన్సల్టెన్సీగా వ్యవహరిస్తున్నదని ఆయన తెలిపారు.