సబ్ రిజిస్ట్రార్ వద్దకు వెళ్లనవసరం లేదుఅధ్యయనానికి తెలంగాణలో కమిటీ ఏర్పాటు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లకుండా దస్తావేజులకు ఇంటిలో...
సబ్ రిజిస్ట్రార్ వద్దకు వెళ్లనవసరం లేదుఅధ్యయనానికి తెలంగాణలో కమిటీ ఏర్పాటు
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లకుండా దస్తావేజులకు ఇంటిలో ఉండే రిజిస్ట్రేషన్ చేయించుకొనే రోజులు తెలంగాణలో రానున్నాయి. కేవలం కొన్ని సాంకేతిక పరికరాలు, అంతర్జాలం ఉంటే చాలు.. ఇంటిలో కూర్చునే రిజిస్ట్రేషన్ ప్రక్రియనంతా పూర్తి చేసుకోవచ్చు. ప్రస్తుతం మహారాష్ట్రలో కొన్ని రకాల దస్తావేజులకు ఇటువంటి ఇ-రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంది.రిజిస్ట్రేషన్‌కోసం కక్షిదారుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లటం, అక్కడి వెబ్ కెమేరా ద్వారా ఫొటోలు తీయించుకొని, స్కానర్ ద్వారా వేలిముద్రలు వేయాలి. ఒప్పందం కుదిరిన ఇరు పక్షాల వారు, వారి సాక్షులు కూడా కార్యాలయానికి వెళ్లాలి. ఈ ప్రక్రియ పూర్తవడానికి ఒక గంటకు పైగానే సమయం పడుతోంది. ఇటువంటి ప్రాథమిక సమాచారాన్ని ఇంటి వద్దనే నమోదు చేసే విధానాన్ని తెలంగాణ సర్కారు మంగళవారం నుంచి అమల్లోకి తేబోతోంది. ప్రాథమిక వివరాలను అంతర్జాలం ద్వారా కక్షిదారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపి ఆ తర్వాత అక్కడికి వెళ్లాలి. వివరాలు అప్పటికే సిద్ధంగా ఉండటంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా ముగుస్తుంది. ఇటువంటి విధానంతోపాటు కక్షిదారులు తమ ఇళ్లనుంచే దస్తావేజులకు రిజిస్ట్రేషన్లను చేయించుకోగలిగే విధానాన్ని కూడా అమల్లోకి తేవాలని రిజిస్ట్రేషన్ శాఖ యోచిస్తోంది. దీన్నే ఇ-రిజిస్ట్రేషన్‌గా వ్యవహరిస్తారు. దీనిపై అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు రంగారెడ్డి డీఐజీ పుష్పలత, హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్ అశోక్‌లతో ఒక కమిటీ ఏర్పాటు కానున్నట్టు అధికార వర్గాలు 'ఈనాడు'కు తెలిపాయి.మహారాష్ట్రలో ఐదు రకాల దస్తావేజులకు అమలుసబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లకుండానే అమలయ్యే ఇ-రిజిస్ట్రేషన్ విధానం ప్రస్తుతం మహారాష్ట్రలో ఐదు రకాల దస్తావేజులకు అమల్లో ఉంది. అక్కడి భారీ అపార్టుమెంట్లలోని ఫ్లాట్లను బిల్డరు మొదటిసారి విక్రయించేటప్పుడు ఇటువంటి ఇ-రిజిస్ట్రేషన్‌ను అనుసరించవచ్చు. అద్దె నియంత్రణ చట్టం కింద భవన యజమానికి, కిరాయికి ఉండే వారికి మధ్య జరిగే ఒప్పందాలన్నింటినీ పూర్తి చేసుకోవచ్చు. మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థతో కుదుర్చుకొనే లీజు ఒప్పందం, స్థానిక సంస్థలతో కుదుర్చుకొనే కొన్ని రకాల ఒప్పందాలకు ఇ-రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇలా చేపడతారుదస్తావేజు నకలు వెబ్సైట్లోనే ఉంటుంది. స్టాంపు రుసుం రూపేణా ఏమేరకు చెల్లించాలనే వివరాలూ దానిలోనే అందుబాటులో ఉంటాయి.రుసుం మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. ఇంటిలో కంప్యూటర్‌కు అంతర్జాలంతో పాటు వెబ్కెమేరా ఉండాలి. వేలిముద్రల స్కానర్, బయోమెట్రిక్ డివైజ్ కూడా ఉండాలి.ఇటువంటి పరికరాల తోడ్పాటుతో దస్తావేజును, ఫొటోలు, వేలిముద్రలను పంపిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ వాటిని పరిశీలించి మరుసటి రోజుకల్లా ఆమోద ముద్ర వేస్తారు. దస్తావేజు కాపీని కంప్యూటర్ ద్వారా పొందవచ్చు.దస్తావేజును నిర్ణీత సమయాల్లోనే సబ్ రిజిస్ట్రార్‌కు పంపాలనే నిబంధనలేవీ ఉండవు. కక్షిదారుడు ఏ సమయంలోనైనా పంపుకోవచ్చు.