పూడూరు/హైదరాబాద్: డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో బస్సు చెట్టుకు ఢీకొని ముందుభాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే దుర్మరణ...
పూడూరు/హైదరాబాద్: డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో బస్సు చెట్టుకు ఢీకొని ముందుభాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వెళ్తున్నది. ఉదయం పూడురు గేటు వద్దకు రాగానే రోడ్డు పక్కన ఉన్న చెట్టు పైకొమ్మలను బలంగా దీంతో పైభాగం వెనుకకు ఒరిగి నుజ్జునుజ్జయింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న అంజలి (23) అక్కడికక్కడే మరణించగా, కండక్టర్తోపాటు ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని వికారాబాద్లో ప్రథమ చికిత్స అనంతరం, మెరుగైన చికిత్స కోసం గాంధీ దవాఖానకు తరలిం చారు. విషయం తెలుసుకున్న రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి వికారాబాద్ దవాఖానలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ హరికిషన్ పరారయ్యాడు.
ప్రమాదాలపై మంత్రి మహేందర్రెడ్డి సీరియస్: తరచూ చోటుచేసుకుంటున్న ఆర్టీసీ బస్సుల ప్రమాదాల విషయంలో అధికారులపై రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి సీరియస్ అయ్యారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా పూడూర్ సమీపంలో ఆర్టీసీ హైర్ బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన మృతురాలి కుటుంబానికి రూ.2లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయాలైన వారికి చికిత్స అందచేస్తున్నామన్నారు. ప్రమాదాల విషయంలో డిపో మేనేజర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అన్ని రీజినల్ మేనేజర్లకు ఆదేశాలు జారీచేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంపై అధికారులను నివేదిక కోరినట్లు చెప్పారు.